Skip to content
తెలంగాణ › వార్తలు

Sajjanar Emotional Message: ఎప్పటికీ మరచిపోలేని ప్రయాణం.. హైదరాబాద్ సీపీగా ఇక గుడ్ బై.. భావోద్వేగ సందేశాన్ని పంచుకున్న వీసీ సజ్జనార్ ..

jagan 13 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Sajjanar Emotional Message: ఎప్పటికీ మరచిపోలేని ప్రయాణం.. హైదరాబాద్ సీపీగా ఇక గుడ్ బై.. భావోద్వేగ సందేశాన్ని పంచుకున్న వీసీ సజ్జనార్ ..

Sajjanar Emotional Message

Sajjanar Emotional Message: తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున సీనియర్ ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగిన నేపథ్యంలో, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ (సీపీ) వీసీ సజ్జనార్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ భగవత్‌ను నూతన కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఇప్పటివరకు హైదరాబాద్ సీపీగా తనదైన ముద్ర వేసిన సజ్జనార్‌ను ప్రభుత్వం తెలంగాణ విపత్తు నిర్వహణ, అగ్నిమాపక సేవల విభాగం డైరెక్టర్ జనరల్ (డీజీ)గా బదిలీ చేస్తూ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) డీజీగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ బదిలీ నేపథ్యంలో సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా నగర ప్రజలకు, పోలీస్ సిబ్బందికి అత్యంత భావోద్వేగపూరితమైన వీడ్కోలు సందేశాన్ని పంచుకున్నారు.

గడచిన ఏడాది కాలం తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అపురూపమైన ప్రయాణమని సజ్జనార్ పేర్కొన్నారు. చారిత్రక హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సేవ చేసే గొప్ప అవకాశాన్ని కల్పించిన తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అలాగే, నూతన సీపీగా బాధ్యతలు చేపట్టబోతున్న మహేశ్ భగవత్‌కు అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్ మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడుతూ, శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రజలంతా కలిసిమెలిసి ప్రతి పండుగనూ ఘనంగా జరుపుకున్న తీరు తన మనసును ఎంతో కదిలించిందని గుర్తుచేసుకున్నారు.

సంస్కరణలతో ప్రజల మన్ననలు

ప్రజల క్షేమమే పరమావధిగా తాము చేపట్టిన ప్రతి సంస్కరణనూ నగరవాసులు తమ సొంత కార్యక్రమంగా భావించి ఆదరించారని సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు. తన హయాంలో సాధించిన కీలక విజయాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు:

ఆహార కల్తీపై ఉక్కుపాదం: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే కల్తీ మాఫియాపై ‘హెచ్-ఫాస్ట్’ (H-FAST) ద్వారా కఠిన చర్యలు తీసుకుని, ఫుడ్ సేఫ్టీ అధికారుల సహకారంతో భారీ ఎత్తున కల్తీ ఆహారాన్ని సీజ్ చేశామని తెలిపారు.

దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’: సైబర్ నేరాల నియంత్రణకు బ్యాంకులు, టెలికాం విభాగాల (DoT) సమన్వయంతో చేపట్టిన ‘ఆపరేషన్ ఆక్టోపస్’కు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోం సెక్రటరీ నుండి ప్రత్యేక ప్రశంసలు దక్కడం హైదరాబాద్ పోలీసులకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు.

ట్రాఫిక్ & మహిళల భద్రత: దశాబ్దాలుగా నగరవాసులు ఎదురుచూస్తున్న కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను జీహెచ్‌ఎంసీ సహకారంతో విజయవంతంగా అమలు చేసి ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం కలిగించామన్నారు. మహిళల రక్షణ కోసం ‘స్పందన’ వాహనాలు, బాధితులకు సత్వర న్యాయం కోసం ‘ఇన్వెస్టిగేషన్ మానిటరింగ్ సెల్’, అలాగే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకు ‘డే విత్ సీపీ’ కార్యక్రమాలు తనకు ఎంతో ఆత్మసంతృప్తిని మిగిల్చాయని వివరించారు.

పోలీస్ సిబ్బంది త్యాగాలకు సెల్యూట్

ఈ విజయాలన్నింటి వెనుక హోంగార్డుల నుంచి అడిషనల్ సీపీల వరకు ప్రతి ఒక్కరి అహర్నిశల శ్రమ దాగి ఉందని సజ్జనార్ కొనియాడారు. పండుగైనా, పబ్బమైనా సొంత కుటుంబాలను పక్కనపెట్టి రోడ్లపై నిలబడి పనిచేసే సిబ్బందిని ప్రోత్సహించేందుకు ‘ఎక్స్‌ట్రా మైల్’, వారి ఆరోగ్య రక్షణ కోసం ‘గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్’ వంటి కార్యక్రమాలను చిరు కానుకగా అందించామన్నారు. తనకు నిరంతరం మార్గదర్శనం చేసిన డీజీపీకి, ఉన్నతాధికారులకు, వెన్నంటి నిలిచిన ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ ప్రజలు, పోలీస్ కుటుంబాలు ఎల్లప్పుడూ సురక్షితంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. గుండెనిండా మధుర జ్ఞాపకాలతో సీపీగా సెలవు తీసుకుంటున్నట్లు సజ్జనార్ ముగించారు.