తెలంగాణలో SIR డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల.. సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలకు అవకాశం
Voter List
తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (Special Intensive Revision – SIR) ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జూన్ 25 నుండి ఆగస్టు 10 వరకు నిర్వహించిన ఎన్యూమరేషన్ (ఓటర్ల వివరాల సేకరణ) ముగియడంతో.. దానికి సంబంధించిన కీలక గణాంకాలను, తదుపరి ప్రణాళికను తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది (78.30%) ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. సేకరించిన వివరాల ఆధారంగా.. 9,22,229 మంది (2.73%) ఓటర్లు మరణించినట్లు గుర్తించారు. అలాగే 57,46,803 మంది (16.99%) ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోవడం (Shifted), లేకపోవడం (Absent) లేదా ఇతర కారణాల వల్ల వారి ఫారాలు లభ్యం కాలేదు. ఇక 6,70,203 మంది (1.98%) ఓటర్ల పేర్లు ఒకానికంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదైనట్లు గుర్తించారు. ఈ విధంగా బహుళ ప్రదేశాల్లో నమోదు అయిన ఓటర్ల పేర్లను పరిశీలించి, కేవలం ఒక్క చోట మాత్రమే వారి పేరును కొనసాగిస్తారు.
ఈ భారీ ఎన్యూమరేషన్ ప్రక్రియను 33 జిల్లాల ఎన్నికల అధికారులు (DEOలు), 119 మంది EROలు, 892 మంది AEROలు, 3,590 మంది బిఎల్‌ఓ సూపర్‌వైజర్లు, 35,985 మంది బూత్ లెవల్ అధికారులు (BLOలు) సమర్థవంతంగా నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ రాజకీయా పార్టీల నుండి మొత్తం 49,018 మంది బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) కూడా చురుగ్గా పాల్గొని తమ సహకారాన్ని అందించారు. పొలిటికల్ పార్టీల వారీగా BRS నుండి 20,394 మంది, కాంగ్రెస్ నుండి 13,144 మంది, బిజెపి నుండి 11,621 మంది, AIMIM నుండి 2,382 మంది, పీసీపీ/బీఎస్పీ ఇతర పార్టీల ప్రతినిధులు ఈ ప్రక్రియలో పాలుపంచుకున్నారు.
ఓటర్లకు మెరుగైన సదుపాయాలు & పారదర్శకత:
ఈ ప్రక్రియలో ఓటర్లకు అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేయడంతో పాటు సహాయం అందించడానికి సీఈఓ, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో హెల్ప్‌డెస్క్‌లను, టోల్ ఫ్రీ నంబర్ 1950 సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఓటర్ల సంఖ్య 1,200 మించకుండా చర్యలు చేపట్టడంతో.. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,985 నుండి 36,353 కి పెరిగింది (368 కొత్త కేంద్రాలు ఏర్పాటయ్యాయి). వయోవృద్ధులు, దివ్యాంగులు మరియు పేద వర్గాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది ప్రత్యేక సహాయం అందించారు.
అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా జాబితా నుండి విస్మరించబడకూడదనే ఉద్దేశంతో.. 2026 ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ERO కార్యాలయాలు, గ్రామ పంచాయతీ, మున్సిపల్ నోటీసు బోర్డులు అధికారిక వెబ్‌సైట్లలో ప్రదర్శించారు.
సవరణ ప్రక్రియ తదుపరి కీలక తేదీలు:
డ్రాఫ్ట్ ప్రచురణ: 17.08.2026
దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ: 17.08.2026 నుండి 16.09.2026 వరకు
నోటీసుల జారీ & అభ్యంతరాల పరిష్కారం: 17.08.2026 నుండి 15.10.2026 వరకు
తుది ఓటర్ల జాబితా ప్రచురణ: 19.10.2026
హక్కులు – అభ్యంతరాల దాఖలు విధానం:
ఎన్యూమరేషన్ సమయంలో ఫారం సమర్పించలేకపోయిన నిజమైన ఓటర్లు 16.09.2026 వరకు ఫారం-6, నిర్దేశిత డిక్లరేషన్ ఫారంతో దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6, ఎన్‌ఆర్‌ఐలకు ఫారం-6A, పేర్ల తొలగింపు లేదా అభ్యంతరాలకు ఫారం-7, చిరునామా మార్పు లేదా సవరణలకు ఫారం-8 ఉపయోగించవచ్చు. ఈ దరఖాస్తులను నేరుగా అధికారులకు గానీ, https://voters.eci.gov.in వెబ్‌సైట్ లేదా ECINET యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ సమర్పించవచ్చు.
తగిన విచారణ చేయకుండా.. నోటీసు ఇవ్వకుండా, సహేతుకమైన అవకాశం కల్పించకుండా ముసాయిదా జాబితా నుండి ఏ ఒక్క ఓటరు పేరునూ తొలగించబోమని సీఈఓ కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ ERO నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే.. 15 రోజుల్లోగా జిల్లా మేజిస్ట్రేట్ (DEO)కి, ఆపై 30 రోజుల్లోగా సీఈఓకి అపీల్ చేసుకునే వెసులుబాటు చట్టప్రకారం అందుబాటులో ఉంది.
- Prakash Raj SIR Remarks: పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న.. ‘ప్రజల పక్షాన ఉంటారా? ఎన్నికల సంఘం పక్షాన ఉంటారా?’
- Dussehra 2026: నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాలు ఇవే.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఒక్కో రూపం విశిష్టత గురించి తెలుసా..
- Andhra Pradesh Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి 17.20 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ..పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi Satyagraha: దేశవ్యాప్త ఉద్యమాలకు డిజిటల్ వేదిక.. ‘సత్యాగ్రహ’ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ
- Telangana Express Turns 50: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దాకా .. ఐదు దశాబ్దాల ప్రస్థానం..