Skip to content
తెలంగాణ › వార్తలు

Disproportionate Assets Case: మొయినాబాద్‌ టౌన్ ప్లానింగ్ అధికారిణిపై ఏసీబీ కొరడా.. 10 చోట్ల ఏకకాలంలో సోదాలు.. గత సెప్టెంబర్ 30న లంచం తీసుకుంటూ పట్టుబడిన వాణి..

jagan 16 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Disproportionate Assets Case: మొయినాబాద్‌ టౌన్ ప్లానింగ్ అధికారిణిపై ఏసీబీ కొరడా.. 10 చోట్ల ఏకకాలంలో సోదాలు.. గత సెప్టెంబర్ 30న లంచం తీసుకుంటూ పట్టుబడిన వాణి..

ACB

Disproportionate Assets Case: ఆదాయానికి మించి భారీగా ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి (టీపీవో) గుండు వాణిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఆమె నివాసంతో పాటు బంధువుల ఇళ్లు, ఇతర అనుమానిత ప్రాంతాలు కలిపి మొత్తం 10 చోట్ల ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి.

ఈ సోదాల్లో భాగంగా అధికారులు గుండు వాణి పేరిట, ఆమె కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిర, చరాస్తుల పత్రాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు , ఇతర ఆదాయ మార్గాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తన అధికారిక ఆదాయ వనరులకు మించి ఆమె భారీ స్థాయిలో అక్రమ ఆస్తులను సమీకరించినట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు.

గత సెప్టెంబర్ 30న లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఘటనే ఈ తాజా దర్యాప్తునకు ప్రధాన కారణమైంది. అప్పట్లో ఒక అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు గుండు వాణి రూ.75 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె తరఫున ఆ మొత్తాన్ని స్వీకరిస్తుండగా మొయినాబాద్ మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న యాలమోని సుదర్శన్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఘటనలో వాణి, సుదర్శన్ ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన ఏసీబీ.. తదుపరి విచారణలో భాగంగా గుండు వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి తాజా సోదాలు చేపట్టింది.

ట్యాగ్‌లు: Telangana Telangana ACB