రాయదుర్గం భూముల వేలానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్.. మూడు వారాల పాటు స్టే విధిస్తూ ఉత్తర్వులు
హైదరాబాద్ ఐటీ హబ్ పరిధిలోని అత్యంత ఖరీదైన రాయదుర్గం భూముల వేలం ప్రక్రియకు తెలంగాణ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. రంగారెడ్డి జిల్లా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలోని సర్వే నంబర్ 83/1లో గల భూముల వేలంపై ఉన్నత న్యాయస్థానం మూడు వారాల పాటు స్టే విధిస్తూ కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో మూడు వారాల్లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) సహా ఇతర ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఈ-వేలంలో ఇక్కడి భూమి రికార్డు స్థాయిలో ఎకరానికి ఏకంగా రూ.237 కోట్లు పలికింది. అయితే, ప్రభుత్వం వేలం వేసిన మొత్తం భూమిలో 5 ఎకరాల స్థలం తమదేనంటూ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వివాదం వెలుగులోకి వచ్చింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2010లోనే రూ.13.33 కోట్లకు ఈ 5 ఎకరాల భూమిని అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (SBH)కు కేటాయించిందని, ఆ తర్వాత ఎస్బీహెచ్ కాస్తా ఎస్బీఐలో విలీనం కావడంతో ఆ యాజమాన్య హక్కులు తమకే చెందుతాయని బ్యాంకు తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. అక్కడ కార్పొరేట్ సెంటర్ నిర్మాణానికి తాము ఇప్పటికే రూ.21 కోట్లకు పైగా ఖర్చు చేశామని, అలాంటి భూమిని ప్రభుత్వం ఏకపక్షంగా క్యాన్సిల్ చేసి వేలానికి పెట్టడం చట్టవిరుద్ధమని వారు వాదించారు.
మరోవైపు ప్రభుత్వం తరఫున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ, ఒప్పందం జరిగి 16 ఏళ్లు గడుస్తున్నా ఎస్బీఐ అక్కడ ఎలాంటి శాశ్వత నిర్మాణ పనులు చేపట్టనందు వల్లే నిబంధనల ఉల్లంఘన కింద భూమిని వెనక్కి తీసుకుని వేలం వేయాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్నాసనం, ప్రభుత్వ కేటాయింపులు ఉన్న భూమిని ఇలా ఎలా వేలం వేస్తారంటూ అసహనం వ్యక్తం చేసింది. ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ అవసరమని భావిస్తూ వేలం ప్రక్రియపై మూడు వారాల పాటు స్టే విధిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ భూముల వేలానికి హైకోర్టు స్టే ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ రియల్ ఎస్టేట్ ,రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.