Skip to content
తెలంగాణ వార్తలు

తెలంగాణలో 89 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలు.. ఈ నెల 12న రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ

Prajapaksham 17 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
తెలంగాణలో 89 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలు.. ఈ నెల 12న రాష్ట్ర ఓటర్ల జాబితాను స్తంభింపజేసిన ఈసీ

Telangana Begins Voter List Purification Drive, Door-to-Door Survey from June 25

ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్‌)–2026 ప్రక్రియలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 12న రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను తాత్కాలికంగా స్తంభింపజేసి, కొత్త ఓటర్ల నమోదును నిలిపివేసింది. ఆ సమయానికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 3,38,26,448 మంది ఓటర్ల వివరాలతో ‘సర్‌’ ఎన్యూమరేషన్‌ ఫారాలను ఎన్నికల సంఘం ప్రచురిస్తోంది.

రాష్ట్రంలో చివరిసారిగా 2002లో ఈ కార్యక్రమం జరగ్గా, నాటి జాబితాతో ప్రస్తుత ఓటర్ల వివరాలను సాఫ్ట్‌వేర్ ద్వారా మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రస్తుత ఓటర్లు నాటి 2002 జాబితాలో తమ పేరైనా లేక తమ తల్లిదండ్రులు, తాతయ్య, నాయనమ్మల పేర్లనైనా కలిగి ఉంటేనే ఈ మ్యాపింగ్‌ సాధ్యమవుతుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 70.02 శాతం మంది ఓటర్ల మ్యాపింగ్‌ పూర్తి కాగా, సాంకేతిక లోపాలు మరియు వివరాల వ్యత్యాసాల కారణంగా ఏకంగా 89.55 లక్షల మంది ఓటర్ల వివరాల్లో తేడాలున్నట్లు ఎన్నికల సంఘం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ గుర్తించింది.

పేర్ల అక్షరాల్లో మార్పులు, బంధుత్వం పొరపాటుగా నమోదు కావడం (తండ్రికి బదులు భర్త అని ఉండటం), తండ్రికి-బిడ్డకు మధ్య వయసు తేడా 15 ఏళ్ల కంటే తక్కువగా ఉండటం, ఒకే కుటుంబంలో ఆరుగురు కంటే ఎక్కువ మంది సంతానం ఉండటం. బీఎల్‌ఓల తప్పుడు మ్యాపింగ్ వంటి కారణాల వల్ల ఈ 89.55 లక్షల మంది వివరాల్లో వ్యత్యాసాలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో దాదాపు 26.47 శాతం మందికి స్థానిక ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్వో) నోటీసులు జారీ చేయనున్నారు. జూలై 31 నుంచి సెప్టెంబర్‌ 28 మధ్య ఈ నోటీసులు ఇచ్చి వివరణ కోరనున్నారు. అనుమానాల నివృత్తి కోసం ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల పత్రాలను వారు ఆధారాలుగా చూపించాల్సి ఉంటుంది.

అంతకంటే ముందే, ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 మధ్య బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటికీ తిరిగి ఓటర్లందరికీ రెండు ఎన్యూమరేషన్‌ ఫారాలను పంపిణీ చేసి, పూర్తి చేసిన ఒక ప్రతిని వెనక్కి తీసుకుంటారు. జూలై 31న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాతే వ్యత్యాసాలున్న ఓటర్లకు నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. ఓటర్ల జాబితాను స్తంభింపజేసినప్పటికీ మ్యాపింగ్‌ ప్రక్రియ యథాతథంగా కొనసాగుతుందని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం స్పష్టం చేసింది.

ఈ నెల 12 నాటికి ఓటరుగా నమోదు కాని వారికి లేదా 18 ఏళ్లు నిండిన కొత్త వారికి కూడా ఈ ప్రక్రియలో ఓటరుగా నమోదయ్యే అవకాశం కల్పిస్తున్నారు. బీఎల్‌ఓలు వారికి ఫారం–6 దరఖాస్తుతో పాటు ఒక స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని అందిస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 మధ్య ఈ దరఖాస్తులను, అభ్యంతరాలను పరిశీలించి, అర్హులైన వారందరికీ తుది ‘సర్‌’ ఓటర్ల జాబితాలో చోటు కల్పిస్తారు.