మెట్రోని నేను అడ్డుకుంటున్నట్లు చెప్పిన ఆ కేంద్రమంత్రి ఎవరో చెప్పండి.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్
Kishan Reddy Rejects Revanth’s Allegations on Metro Funding
హైదరాబాద్ మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధిని తాను అడ్డుకుంటున్నట్లుగా చెప్పిన ఆ కేంద్రమంత్రి ఎవరో ముఖ్యమంత్రి బహిరంగంగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాభై యాభై నిష్పత్తిలో చేపట్టేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూత్రప్రాయంగా అంగీకరించారని, ఈ విషయాన్ని రేవంత్‌రెడ్డికి కూడా స్పష్టం చేశారని తెలిపారు. కేవలం కిషన్‌రెడ్డి ఆపమంటే ప్రాజెక్టులు ఆపే సంస్కృతి కేంద్ర ప్రభుత్వంలో లేదని, తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.
మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి ఐఆర్‌ఎఫ్‌సీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న రూ.13,500 కోట్ల రుణ ఒప్పందాన్ని తానేమీ అడ్డుకోలేదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో నిర్వహణ ఖర్చులు పోను మిగిలిన ఆదాయం నుంచి ముందుగా ఐఆర్‌ఎఫ్‌సీ రుణాలను చెల్లించాలని కేంద్రం కోరుతోందని, కానీ ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించకపోవడం వల్లే ఈ సాంకేతిక చిక్కులు వచ్చాయని వివరించారు. దేశవ్యాప్తంగా ఏ మెట్రోలోనూ అప్పులను ముందే చెల్లించరని, ప్రాజెక్టు మనుగడ సాగించాలంటే ఈ సాంకేతిక అంశాలపై ఇరు ప్రభుత్వాలు కూర్చుని చర్చించుకోవాలి తప్ప రాజకీయ ఆరోపణలు చేయడం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగదని హితవు పలికారు.
తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా భారీగా నిధులు అందిస్తోందని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గుర్తుచేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల కోసం రూ.1.75 లక్షల కోట్లు వెచ్చించడంతో పాటు, తాజాగా 50 ఏళ్ల కాలపరిమితితో రూ.11 వేల కోట్ల వడ్డీ లేని రుణాన్ని కూడా కేంద్రం మంజూరు చేసిందన్నారు. అలాగే మూసీ పునరుజ్జీవనం కోసం ఏషియా డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.4,100 కోట్ల రుణం ఇప్పించామని, ఎన్సీడీసీ ద్వారా గత 12 ఏళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు అందజేయడమే కాకుండా ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల కోసం రూ.34 వేల కోట్లు కేటాయించామని వివరించారు. గతంలో మెట్రో ఫేజ్–1 అలైన్‌మెంట్ మార్పు పేరుతో నాటి కేసీఆర్ ప్రభుత్వం మూడేళ్లు కాలయాపన చేస్తే, నేడు రేవంత్‌రెడ్డి కూడా అదే తీరుతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా, ఆయనతో కలిసి తానే స్వయంగా కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి మెట్రో ఫేజ్-2 సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని కిషన్‌రెడ్డి ప్రకటించారు.