ఓటు హక్కు ఉద్యమం తొలివారం గ్రాండ్ సక్సెస్
SIR Protest
గ్యాన్పాఠక్
సిఇసి (ఎన్నికల ప్రధానాధికారి)కి వ్యతిరేకంగా ఆందోళన తొలివారం (అక్టోబర్ 2 భారతదేశంలో విశాలమైన ఓటుహక్కు ఉద్యమానికి ఆరంభంగా కనిపిస్తోంది. ఈ ఆందోళనకు ఇండియా కూటమిలోని 19 పార్టీలు సెప్టెంబరు 30న పిలుపు ఇవ్వటం గుర్తుచేసుకోదగింది. ఈ ఆందోళనలో అనేక స్రవంతులు కలుస్తున్నాయి: ఇండియా కూటమి పార్టీలు, కాక్రోచ్ జనతాపార్టీ (సిజెపి) నాయకత్వంలో యువత, విద్యార్థి సంఘాలు, పౌరసమాజ క్రియాశీలురు, విద్యావేత్తలు, ఎక్కువగా సాధారణ పౌరులు చేరారు. గమనించాల్సిన తదుపరి పెద్ద విషయం ఈరోజు అక్టోబర్ 10 ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద సమీకరణ.
సిఇసి వ్యతిరేక ఆందోళన తొలివారం సాధించిన గొప్ప విషయం దాని రాజకీయ, సామాజిక పునాది విస్తరించటం, భౌగోళికంగా కూడా దాని వ్యాప్తి పెంపొందటం. రాజకీ య పునాది విస్తరణకు సంబంధించి తమిళనాడుకు చెందిన పాలక టివికె ఇండియా కూటమిలో చేరటం. దాని ఆందోళన కార్యక్రమం రాష్ట్రంలో వచ్చేవారం మొదలవుతుంది. ఇండియా కూటమిలో భాగస్వామి కాని డిఎంకె ఆ కూటమి ఆందోళనను ఆలస్యంగా బలపరిచింది. కూటమి లో భాగస్వామి కాని ఆప్ (ఎఎపి) సొంతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇండియా కూటమిలో భాగస్వామి కాని బిజూ జనతాదళ్ (బిజెపి) అక్టోబర్ 6న ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఎంపిల ప్రదర్శనలో పాల్గొన్నది.
సామాజిక పునాది విస్తరణకు సంబంధించి సిజెపితో సంబంధమున్న యువత ముంబై, బెంగళూరుల్లో సమీకృతమై ప్రదర్శనలు జరిపారు. ఎఐఎస్ఎ, ఎఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్‌లకు చెందిన విద్యార్థి గ్రూపులు కూడా పాల్గొన్నాయి. పౌరసమాజం నిర్వహించిన ప్రదర్శనల్లో విద్యావేత్తలు, న్యాయవాదులు, కళాకారులు, ఇతర సర్వసాధారణ ప్రజలు పాల్గొన్నారు. పేరొందిన ప్రముఖులు చాలా మంది ఈ ప్రదర్శన ల్లో పాల్గొంటున్నారు. అక్టోబర్ 8 నాటికి ఈ నిరసన ప్రదర్శనలు దాదాపు అన్ని రాష్ట్రాలకు విస్తరించాయి. ఢిల్లీ, కర్నాటక, బిహార్, ఒడిసా, మహారాష్ట్ర, హర్యానా, తెలంగాణ, త్రిపుర ప్రత్యేకించి ప్రస్తావించదగినవి. ఉత్తర ప్రదేశ్‌లో కూడా ఆందోళన కార్యక్రమాలు ప్రకటించబడ్డాయి.
నిరసనలు ఆ విధంగా కలిసిపోవటం, భౌగోళికంగా విస్తరణ పెరగటం, భారతదేశంలో అతిపెద్ద ఎన్నికల హక్కు ల పోరాటానికి ఆరంభాన్ని సూచిస్తున్నది. ఇది ఇంకెంతమాత్రమూ రాజకీయ పార్టీల నాయకత్వంవహిస్తున్న ఉద్యమం కాదు. అలా కొట్టిపారేయ వీలులేదు. ఇది విస్తృత విభాగాల ప్రజల్లోకి వెళ్లినందున ప్రతిపక్ష రాజకీయాలుగా చిత్రించవీలులేదు.
సిజెపిని ఈ ఎన్నికల హక్కుల ఉద్యమంలో భిన్నమైన ఫ్రంట్‌గా చూడాలి. వారు సిఇసి రాజీనామా లేదా తొలగింపును డిమాండ్ చేయటంతో పాటు యావత్ ఎన్నికల వ్యవస్థ మరమ్మతును కోరుతున్నారు. సిజెపి ఇప్పటికే ఢిల్లీ, ముంబైలు దాటి కర్నాటకకు విస్తరించింది. బెంగళూరులో వారు అక్టోబర్ 8న ‘సర్’ ప్రక్రియపై ప్రజా ట్రిబ్యునల్, చెప్పులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సిజెపి జన్ లేదా యువజన నిరసన సంస్కృతికి, పాత ప్రతిపక్ష లేదా పౌరసమాజ నిరసన తీరుకు మధ్య ముఖ్యమైన
వారధిగా పనిచేస్తున్నది.
సమస్య ఇప్పుడు “సిఇసి రాజీనామా” నుంచి మరింత విస్తృతమైన సమస్యలకు మారటం ఈ వారంలో ఎంతో పర్యవసానంతో కూడిన మార్పు. సిఇసి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా తక్షణ నినాదంగా ఉన్నప్పటికీ, ఎన్నికల వ్యవస్థ మొత్తాన్ని సంస్కరించాలనే డిమాండ్లు విస్తరించాయి. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్‌భాగవత్, సిఇసి జ్ఞానేశ్‌కుమార్‌లు భారతదేశ ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని హైజాక్ చేసి, దేశద్రోహానికి పాల్పడ్డారని, వారందరినీ కోర్టుముందు నిలబెట్టాలని ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ చెప్పారు.
అక్టోబర్ 5న సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవటంతో సమస్య మరింత తీవ్రతను సంతరించుకుంది. ఫారం 6లో మార్పులను తాము ఎన్నడూ ఆమోదించలేదని అది స్పష్టం గా చెప్పింది. కేంద్ర ప్రభుత్వం, సిఇసి, ఇసిఐ అధికారుల నుంచి సమాధానాలు కోరింది. ఇసిఐ ఏనిర్ణయమైనా చట్టప్రకారం జరిగి ఉండకపోతే దాన్ని రద్దు చేస్తారని చెప్పింది. ఇవి రాజ్యాంగం, లీగల్ పరిధిలో ప్రవేశించిన తీవ్రమైన ఆరోపణలు.
ఢిల్లీలో గతవారం పోలీసుల ప్రతిస్పందన సైతం వారం రోజుల నిరసన ఆందోళనలో ఒక ముఖ్యాంశంగా రాజకీయ వరవడి సంతరించుకుంది. వారు నిరసనకారులను అడ్డుకున్నారు, నిరసన ప్రదేశాలనుంచి బలవంతంగా తొలగించారు. అక్టోబరు 6,7 తేదీల్లో వారు రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీలను సైతం నిర్బంధంలోకి తీసుకున్నారు. వేడిని రాహుల్ పైకి మళ్లించటానికిగాను పాలక బిజెపి ఆయన మహిళా పోలీసులతో అపసవ్యంగా ప్రవర్తించారని ఆరోపించింది. కాగా నిరసనలో పాల్గొంటున్న ఎంపిలపై పోలీసులు చేయిచేసుకున్నారని, నిరసన కేంద్రాలనుంచి తొలగించటానికి బలప్రయోగం చేశారని ప్రతిపక్షం ఆరోపించింది. నిరసనలను ఎదుర్కోవడానికి ప్రభుత్వం 24వేలమంది పోలీసులను వినియోగించింది.
10వ తేదీన జంతర్‌మంతర్ వద్ద నిరసనను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఢిల్లీలో నిషేధాజ్ఞలు విధించి నిరసనలకు అనుమతిలేదని పోలీసు అధికారులు ప్రకటించారు. ఈ పరిస్థితి కొత్త రాజకీయ కోణాలు సృష్టిస్తున్నది. ఎన్నికల వ్యవస్థలో నిజాయితీ అసలు సమస్యకాగా, పోలీసు ఆంక్షలు, డిటెన్షన్లు నిరసన తెలిపే స్వేచ్ఛ అనే మరో అంశాన్ని దానికి జోడించాయి.
తొలివారం ఆందోళన రాజకీయ అనుబంధాలులేని యువతను, విద్యార్థులు, తొలిసారి ఓటర్లు, పౌరసమాజ కార్యకర్తలు, వ్యక్తిగతంగా ఓటు ఫిర్యాదు వున్న వ్యక్తులను పెద్దసంఖ్యలో ఆకర్షించింది. ఆ విధంగా గడిచిన వారం గణించదగినంత విస్తృతమైన ఓటుహక్కుల ఉద్యమానికి ప్రాతిపదిక కల్పించింది. సూక్ష్మంగా చెప్పాలంటే, సిఇసి/ఎస్ఐఆర్ వివాదం పార్లమెంట్ లేదా ఎన్నికల కమిషన్ నాలుగు గోడల మధ్య అదుపులో ఉంచలేనంత కఠినంగా తయారైంది.
అక్టోబరు 8 నాటికి ఉద్యమం ఢిల్లీ హద్దులు దాటి బహుళ కేంద్రాలు, బహుళ తరగతుల ఉద్యమంగా విస్తరించింది. మరో గమనార్హమైన అంశం ఏమంటే, సిఇసి రాజీనామాతో ఆందోళన ముగుస్తుందని సిజెపి, విద్యార్థి గ్రూపు లు చెప్పటంలేదు. అంతేగాక 10వతేదీ జంతర్‌మంతర్ నిరసన గతంలోలాగా (నీట్ వ్యతిరేక ఆందోళన) కాకుండా సిజెపి, వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య ఆందోళనగా ఉంటుందని ఆ సంఘాల నాయకులు బుధవారం ఢిల్లీలో ప్రకటించారు. సర్‌ను నిలుపుచేయటం, 2025 జనవరి నాటి ఓటరు జాబితాల పునరుద్ధరణ, స్వతంత్ర దర్యాప్తు, ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన 2023 నాటి చట్టంలో మార్పులను వారు డిమాండ్ చేస్తున్నారు.
బిహార్ సరికొత్త ఉద్యమ కేంద్రంగా అవతరించింది. అక్టోబరు 7న ఇండియా/గ్రాండ్ అలయెన్స్ పార్టీలు రాష్ట్రంలోని 534 బ్లాక్ (మండల) కేంద్రాల్లో “ఆక్రోశ్ ప్రదర్శనలు” నిర్వహించాయి.
ఆర్జెడి, కాంగ్రెస్, సిపిఐ(ఎంఎల్) సిపిఐ, సిపిఐ(ఎం), విఐపి, ఐఐపి పార్టీలు పాల్గొన్నాయి. అక్టోబరు 8న ఆందోళన బ్లాక్ కేంద్రాల నుంచి జిల్లాల కేంద్రాలకు, పట్నాకు విస్తరించింది. ప్రతిపక్షనాయకుడు తేజస్వీ యాదవ్ నాయకత్వంలో లోక్‌భవన్‌కు ప్రదర్శన తీశారు.
అక్టోబరు 8న ఒడిసా బంద్ మరో ముఖ్యఘటన. భువనేశ్వర్, కటక్, బర్గా, భద్రక్, బాలాసోర్, రాయగడ్, కేంద్రపార, బోలంగీర్, బెర్హంపూర్, సంబల్పూర్లుబంద్ పాటించాయి.
మహారాష్ట్రలో సెప్టెంబరు 25, అక్టోబరు 4 మధ్య మొత్తం 88 నిరసన కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ పిలుపుపై 8వ తేదీన అనేక రాష్ట్రాల్లో ‘ప్రజాస్వామ్యానికి నల్లదినం’పెద్ద ఎత్తున పాటించారు.
ఢిల్లీలో ఇండియా కూటమి ఎంపిలు సిఇసిని కలుసుకుని మెమొరాండం ఇచ్చేందుకు 6వ తేదీన చేసిన ప్రయత్నాన్ని ఆ పక్కనే ఉన్న ఆకాశవాణి కార్యాలయం వద్ద, 7వ తేదీ నిరసనను జంతర్‌మంతర్ వెలుపల పోలీసులు అడ్డుకున్నందున, 8వ తేదీ రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీజీకి నివాళులర్పించి, తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు.