Skip to content
జాతీయం › వార్తలు

Bay of Bengal Cyclone Update: బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు? నవంబర్ చివరిలో కొత్త వాతావరణ వ్యవస్థ.. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా?

jagan 28 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Bay of Bengal Cyclone Update: బంగాళాఖాతంలో మరో తుపాను ముప్పు? నవంబర్ చివరిలో కొత్త వాతావరణ వ్యవస్థ.. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారుతుందా?

bay of Bengal

Bay of Bengal Cyclone Update: శీతాకాలం వచ్చినా తుపానులు భయం మాత్రం వీడటం లేదు. నవంబర్ చివరిలో లేదా డిసెంబర్ మొదటి వారంలో దక్షిణ బంగాళాఖాతంలో మరో ఉష్ణమండల తుఫాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వాతావరణ నిపుణుడు జాసన్ నికోల్స్ తన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా అంచనా వేశారు. నవంబర్ 30న ప్రారంభమయ్యే వారం చివరి నాటికి దక్షిణ బంగాళాఖాతంలో ఈ తుఫాను రూపుదిద్దుకునే సూచనలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుత దశలో దాని తీవ్రత, ప్రయాణించే మార్గం, తీర ప్రాంతాలపై చూపే ప్రభావం గురించి ఇప్పుడే ఖచ్చితమైన అంచనాకు రాలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

బంగాళాఖాతంలో కొత్త వాతావరణ వ్యవస్థ ఏర్పడబోతోందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) కూడా ధృవీకరించింది. ఐఎమ్‌డి తాజా బులెటిన్ ప్రకారం.. నవంబర్ 29 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం (Upper Air Cyclonic Circulation) ఏర్పడే అవకాశం ఉంది.

సముద్రంలో ఆవర్తనం ఏర్పడినంత మాత్రాన అది తప్పనిసరిగా తుఫానుగా మారుతుందని చెప్పలేము. ఇది ముందుగా అల్పపీడనంగా మారి, ఆ తర్వాత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, గాలుల వేగం వంటి అనుకూల వాతావరణ పరిస్థితులు తోడైతేనే తుఫానుగా బలపడుతుంది. ప్రస్తుతానికి బంగాళాఖాతంలో ఎలాంటి తుఫాను హెచ్చరికలు లేవు. దక్షిణ అండమాన్ సముద్రంలో మాత్రం చెదురుమదురు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి.

ఇప్పటికే ఇటీవల సంభవించిన తుఫానుల ప్రభావం నుంచి కోలుకుంటున్న తూర్పు తీర రాష్ట్రాలకు ఈ కొత్త అంచనా కొంత ఆందోళన కలిగిస్తోంది. ఈ రాబోయే వాతావరణ వ్యవస్థ ఒడిశా లేదా ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు కదులుతుందా.. తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయా అనే అంశాలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. రాబోయే రెండు మూడు రోజుల్లో వాతావరణ నమూనాల్లో వచ్చే మార్పులు, ఐఎమ్‌డి విడుదల చేసే తదుపరి బులెటిన్‌ల ద్వారా ఈ వ్యవస్థ గమనంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.