Cyclone Kani Threat: నెల రోజుల్లోనే నాలుగో సైక్లోన్ ముప్పు? బంగాళాఖాతంలో మొదలైన ‘కని’ తుపాను అలజడి..
Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ముప్పు.. అక్టోబర్ 27 నుంచి ఏపీలో భారీ వర్షాలు...
Cyclone Kani Threat: కేవలం నెల రోజుల వ్యవధిలో అర్నాబ్, మురసు, అక్వాన్ అనే మూడు తుఫానులు వరుసగా విరుచుకుపడిన బంగాళాఖాతంలో ఇప్పుడు నాలుగో తుఫాను ముప్పు పొంచి ఉంది. వరుస తుఫానులతో ఇప్పటికే తీరప్రాంత రాష్ట్రాలు అప్రమత్తం కాగా.. తాజా వాతావరణ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. నవంబర్ 29న దక్షిణ అండమాన్ సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి నవంబర్ 30 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతంగా రూపుదిద్దుకోనుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ అల్పపీడన వ్యవస్థ అనుకూల వాతావరణ పరిస్థితుల మధ్య తుఫానుగా బలపడితే, దానికి కని అని నామకరణం చేయనున్నారు. ఈ పేరును మాల్దీవులు సూచించింది. తీర ప్రాంతాల్లో పెరిగే ‘సీ ట్రంపెట్’ అని పిలువబడే చెట్టుతో ఈ పేరుకు సంబంధం ఉంది. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 4 మధ్య సముద్రంలో అలజడి తీవ్రంగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నమూనాల ప్రకారం ఈ తుఫాను గమనం శ్రీలంక, తమిళనాడు తీరాల వైపు ఉండే సూచనలు కనిపిస్తున్నప్పటికీ.. సముద్రంలో గాలుల దిశ మారితే ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలపైనా దీని ప్రభావం పడి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తుఫానుల ప్రభావానికి తరచుగా గురయ్యే ఒడిశాలో గత పదేళ్లలో సంభవించిన 13 తుఫానుల వల్ల రూ. 15,457 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని ఆ రాష్ట్ర రెవెన్యూ మంత్రి సురేష్ పూజారి తెలిపారు. ఈ విపత్తుల్లో 156 మంది ప్రాణాలు కోల్పోగా, 55.63 లక్షల పశుపక్ష్యాదులు మృత్యువాత పడ్డాయి. దాదాపు 8.20 లక్షల ఇళ్లు ధ్వంసమయ్యాయి. గతంలో తిట్లీ, ఫణి, బుల్బుల్, అంఫాన్, యాస్, దానా వంటి తుఫానులతో పాటుగా.. ఈ ఏడాది వచ్చిన అర్నాబ్, మురసు, అక్వాన్ తుఫానులు కూడా తీరప్రాంత జిల్లాలను, పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఈ అనుభవాల దృష్ట్యా ఒడిశా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 880 తుఫాను ఆశ్రయ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు, ముందస్తు సమాచారం కోసం ప్రత్యేక అలర్ట్ యాప్, హెచ్చరిక వ్యవస్థను సిద్ధం చేసింది. అంతేకాకుండా విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు అందించే పరిహారాన్ని రూ. 4 లక్షల నుంచి రూ. 8 లక్షలకు పెంచింది. ఇందులో సుమారు 30 శాతం సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.
ఉత్తర హిందూ మహాసముద్ర ప్రాంతంలోని బంగాళాఖాతం, అరేబియా సముద్రాల మీదుగా ప్రతి ఏటా సగటున ఐదు నుండి ఆరు తుఫానులు ఏర్పడతాయి. వీటిలో అత్యధిక భాగం బంగాళాఖాతంలోనే పుడుతుంటాయి. వాతావరణ సరళి ప్రకారం ఈ ప్రాంతంలో మార్చి నుండి జూన్ వరకు మొదటి సీజన్, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు రెండవ సీజన్ ఉంటాయి. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించిన తర్వాత బంగాళాఖాతంలో వేడి అలాగే నిలిచి ఉండి.. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఈ వేడి తుఫానులు ఏర్పడటానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
రుతుపవనాల కాలంలో వీచే బలమైన ఎగువ స్థాయి గాలులు తుఫాను వలయాలను చెదరగొడతాయి. కానీ రుతుపవనాల తర్వాత వీచే బలహీనమైన గాలులు అల్పపీడనాలు వ్యవస్థీకృతమై తీవ్ర తుఫానులుగా మారడానికి దోహదపడతాయి. దీనికి తోడు బంగాళాఖాతం మూడు వైపులా భూభాగంతో చుట్టుముట్టబడి ఉండటం వల్ల వాతావరణ వ్యవస్థలు త్వరగా బలహీనపడకుండా భారత తూర్పు తీరం, బంగ్లాదేశ్ వైపు కదులుతూ సుదీర్ఘకాలం చురుకుగా ఉంటాయి.