Voter List Deletions: ఓటర్ల జాబితా నుంచి ముస్లింల పేర్ల తొలగింపే లక్ష్యమా? మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషీ సంచలన వ్యాఖ్యలు
Former CEC Dr SY Quraishi
Voter List Deletions: చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపుతో పాటు నకిలీ, డూప్లికేట్ ఎంట్రీలను సరిచేయడాన్ని తాము కూడా సమర్థిస్తామని ఖురేషీ తెలిపారు. అయితే, జాబితాలో చనిపోయినట్లు పేర్కొన్న ప్రతి వ్యక్తి నిజంగానే మరణించారా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం అత్యంత కీలకమన్నారు.
Voter List Deletions: ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) డాక్టర్ ఎస్‌వై ఖురేషీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత రెండేళ్లలో చోటుచేసుకున్న పరిణామాలతో ప్రజాస్వామ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్ల తొలగింపు తీరుపై అనేక సందేహాలు వ్యక్తం చేసిన ఆయన.. ఈ ప్రక్రియలో దురుద్దేశం ఉందనే నిర్ధారణకు తాను వచ్చానని పేర్కొన్నారు. ఒక ప్రైవేటు టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితాల నుంచి సుమారు 13 కోట్ల మంది పేర్లు తొలగించారనే అంశంపై చర్చ సందర్భంగా ఖురేషీ స్పందించారు. చనిపోయిన ఓటర్ల పేర్లను తొలగించడం అవసరమేనని, వలస వెళ్లిన వారి పేర్లను కూడా సంబంధిత ప్రాంతంలో సరిచేయవచ్చని అన్నారు. అయితే, ఒక ప్రాంతం నుంచి వలస వెళ్లిన వారి పేర్లను తొలగిస్తున్నప్పుడు.. వారు మరో ప్రాంతానికి వెళ్లినట్లయితే అక్కడ ఓటర్లుగా నమోదు చేసే ప్రక్రియ కూడా జరగాలని స్పష్టం చేశారు. ఒకచోట పేరును తొలగించి, మరోచోట నమోదు చేయకపోతే వారి ఓటు హక్కు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పేర్ల తొలగింపుపై ప్రశ్నలు
చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపుతో పాటు నకిలీ, డూప్లికేట్ ఎంట్రీలను సరిచేయడాన్ని తాము కూడా సమర్థిస్తామని ఖురేషీ తెలిపారు. అయితే, జాబితాలో చనిపోయినట్లు పేర్కొన్న ప్రతి వ్యక్తి నిజంగానే మరణించారా? అనే విషయాన్ని నిర్ధారించుకోవడం అత్యంత కీలకమన్నారు. తాము జీవించి ఉన్నప్పటికీ ఓటర్ల జాబితాలో చనిపోయినట్లుగా నమోదు చేశారని కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి ఘటనలు ఓటర్ల జాబితాల విశ్వసనీయతపై సందేహాలు కలిగిస్తాయని పేర్కొన్నారు. 2002–03లో నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత ఎన్నికల సంఘం సాధారణంగా ఓటర్ల జాబితాల సంక్షిప్త సవరణ (Summary Revision) ప్రక్రియపై దృష్టి పెట్టిందని ఖురేషీ వివరించారు. అప్పటికి ఓటర్ల వివరాలు కంప్యూటరీకరించడంతో, ఇంటింటికీ వెళ్లి జాబితాలో ఉన్న పేర్లు, వివరాలను ధ్రువీకరించడం ద్వారా అవసరమైన మార్పులు చేయవచ్చని భావించినట్లు తెలిపారు.
ఓటర్ల పేర్ల తొలగింపులో దురుద్దేశం ఉందా?
ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపు ప్రక్రియను పరిశీలిస్తే, కొన్ని వర్గాల ఓటర్లను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానం కలుగుతోందని ఖురేషీ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ముస్లింలు, బీజేపీకి మద్దతు ఇవ్వని ఓటర్లే లక్ష్యంగా ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. ఒకే పోలింగ్ బూత్‌లో 75 శాతం వరకు ఓటర్ల పేర్లు తొలగించారని, కొన్ని ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న బూత్‌లలో 60 నుంచి 80 శాతం వరకు పేర్లు తొలగిపోయినట్లు తనకు కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా పరిణామాలు ఎందుకు చోటుచేసుకున్నాయనే దానిపై సమగ్ర పరిశీలన అవసరమని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారుల అధికారాలపై అభ్యంతరాలు
ఓటర్ల జాబితాల్లో పేర్లను చేర్చడం, తొలగించడం వంటి నిర్ణయాలు చట్టబద్ధంగా అధికారం కలిగిన ఎన్నికల నమోదు అధికారుల పరిధిలో ఉండాలని ఖురేషీ అన్నారు. ఢిల్లీలోని కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పేర్ల తొలగింపులు జరిగాయని, స్థానిక స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కొన్ని పేర్లను తిరిగి చేర్చలేదని ఆయన ఉదాహరణగా వివరించారు. గోవాలో జరిగిన ఒక ఉదంతాన్ని కూడా ప్రస్తావిస్తూ.. సంబంధిత ఓటర్లు నిజమైనవారేనని అధికారులు చెప్పినా, పేర్లను తిరిగి చేర్చే విషయంలో సమస్యలు ఎదురైనట్లు తెలిపారు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయని ఖురేషీ అభిప్రాయపడ్డారు.
విపక్షాలతో చర్చలు జరపాలి
తాను ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సమయంలో వివాదాస్పద అంశాల పరిష్కారానికి రాజకీయ పార్టీలతో చర్చలు, సంప్రదింపులకు ప్రాధాన్యం ఇచ్చేవాడినని ఖురేషీ తెలిపారు. ఈవీఎంల పారదర్శకతపై గతంలో అభ్యంతరాలు వ్యక్తమైనప్పుడు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు. ఆ సమావేశంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈవీఎంలలో ఓటు ఎవరికి పడిందో ఓటరు ధ్రువీకరించుకునే విధానం అవసరమని సూచించినట్లు ఖురేషీ వివరించారు. ఆ సూచనను సమావేశంలో అంగీకరించి, వీవీప్యాట్ (VVPAT) వ్యవస్థ అభివృద్ధి దిశగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఎన్నికల సంఘం విపక్షాల ప్రతినిధులతో చర్చలు జరిపి, వారి సందేహాలను నివృత్తి చేయాలని ఖురేషీ సూచించారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వాసం పెరగాలంటే పారదర్శకత, సంప్రదింపులు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు అవసరమని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.