తమిళులా మజాకా.. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక్కటైన తమిళ పార్టీలు.. తమిళ గీతానికే తొలి ప్రాధాన్యమిస్తూ ఏకగ్రీవ తీర్మానం..
Vijay and Stalin
తమిళనాడులో ఇకపై అన్ని అధికారిక కార్యక్రమాలలో రాష్ట్ర గీతమైన ‘తమిళ తాయ్ వాళ్తు’కే తొలి ప్రాధాన్యం లభించనుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని తప్పనిసరిగా ఆలపించాలని తమిళనాడు శాసనసభ సోమవారం ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. రాష్ట్ర సాంస్కృతిక మూలాలను పరిరక్షించేందుకు, తమిళ భాషా ఐడెంటిటీని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు శాసనసభా వర్గాలు వెల్లడించాయి.
ఈ చారిత్రాత్మక తీర్మానాన్ని ముఖ్యమంత్రి విజయ్ శాసనసభలో స్వయంగా ప్రవేశపెట్టగా.. అధికార, ప్రతిపక్షాలనే తేడా లేకుండా సభలోని అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పాలకపక్షంతో పాటు డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్ వంటి ప్రధాన పార్టీల సభ్యులు కూడా ఈ ప్రతిపాదనను స్వాగతించారు. సభలో సుదీర్ఘంగా చర్చ సాగిన అనంతరం.. స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్ వాయిస్ ఓటు నిర్వహించి ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్లు అధికారికంగా ప్రకటించారు.
తీర్మానం ఆమోదం పొందిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ సభను ఉద్దేశించి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తమిళ భాష తమ రాష్ట్రానికి కేవలం ఒక సమాచార సాధనం మాత్రమే కాదని, అది ప్రతి ఒక్క తమిళుడి ప్రాణనాడి, అస్తిత్వం, భావోద్వేగమని అభివర్ణించారు. తమిళం మన గర్వం, తమిళం మన శక్తి. ‘తమిళం’ అన్న ఒక్క పదం యావత్ తమిళనాడును ఏకతాటిపైకి తీసుకువస్తుంది. మన నేల సంస్కృతికి ప్రతీకగా నిలిచే ‘తమిళ తాయ్ వాళ్తు’ గీతానికి రాష్ట్రంలో ప్రథమ స్థానం ఉండాలి. దానికి అగ్రపీఠం వేయడం మా హక్కు, బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర భాషా, సాంస్కృతిక హక్కుల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పిన ఆయన.. తమిళ భాషపై ఉన్న అభిమానం దేశభక్తికి ఎంతమాత్రం పరస్పర విరుద్ధం కాదని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.
వాస్తవానికి ఇటీవల కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారిక కార్యక్రమాల నిర్వహణపై కొన్ని కీలక మార్గదర్శకాలు, సూచనలను విడుదల చేసింది. జాతీయ గీతానికి (జనగణమన) ముందు జాతీయ గేయమైన ‘వందేమాతరం’ ఆలపించాలని అందులో పేర్కొంది. ఒకవేళ రాష్ట్ర గీతంతో పాటు జాతీయ గీతం లేదా గేయాన్ని కూడా ఆలపించాల్సి వస్తే.. జాతీయ గేయానికే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్రం తన సూచనలో స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన ఈ మార్గదర్శకాల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తమిళనాడు ప్రభుత్వం ఈ కీలక చట్టబద్ధ సవరణను అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజ్యాంగం ప్రతి రాష్ట్రానికి కల్పించిన భాషా, సాంస్కృతిక హక్కులకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం సభలో వివరణ ఇచ్చింది. తమ సొంత భాషా అస్తిత్వాన్ని చాటుకోవడమే ఈ తీర్మానం ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఈ నూతన తీర్మానం అమలులోకి రావడంతో.. ఇకపై తమిళనాడు పరిధిలోని అన్ని ప్రభుత్వ, అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని (‘తమిళ తాయ్ వాళ్తు’) తప్పనిసరిగా ఆలపిస్తారు. అలాగే కార్యక్రమాలు ముగిసే సమయంలో జాతీయ గీతాన్ని ఆలపించే సంప్రదాయం ఇకపై చట్టబద్ధంగా అమలుకానుంది. ఈ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా తమిళ భాషాభిమానులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
- CJP Protest Assault Case: జంతర్‌మంతర్ దాడి కేసులో కీలక పరిణామం.. స్వతంత్ర భరద్వాజ్ పోలీసుల అదుపులోకి..
- Konda Surekha Controversy: నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను, మారే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన కొండా సురేఖ..సోషల్ మీడియా వదంతులు నమ్మవద్దని వినతి..
- Konda Surekha Controversy: కొండా సురేఖను పదవి నుంచి తొలగించడం బాధాకరమైన విషయమే.. స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..
- One Last Kiss: ఎనిమిదేళ్ల బంధానికి భావోద్వేగ వీడ్కోలు.. చివరి ముద్దు ఇచ్చి కన్నీళ్లు పెట్టుకున్న బస్సు డ్రైవర్.. స్పందించిన కేరళ సీఎం..
- Tamil Nadu: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడి యత్నం.. కామాంధుడిని తరిమి తరిమి కొట్టిన వీధి కుక్కలు.. వీడియో ఇదిగో..