Skip to content
జాతీయం › వార్తలు

UP Elections 2027: యూపీ ఎన్నికలపై వేడెక్కిన ఇండియా కూటమి రాజకీయం.. గెలుపు గుర్రాలకే సీట్లన్న అఖిలేశ్.. 181 స్థానాలపై కాంగ్రెస్ పట్టు..

jagan 16 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
UP Elections 2027: యూపీ ఎన్నికలపై వేడెక్కిన ఇండియా కూటమి రాజకీయం.. గెలుపు గుర్రాలకే సీట్లన్న అఖిలేశ్.. 181 స్థానాలపై కాంగ్రెస్ పట్టు..

Rahul Gandhi and Akhilesh Yadav

UP Elections 2027: ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఇండియా కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో 181 సీట్లను కాంగ్రెస్ ఆశిస్తున్నట్లు ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వెల్లడించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో మెయిన్‌పురిలో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్‌తో చర్చలు కొనసాగుతాయని, అయితే ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఆ పార్టీకే సీటు కేటాయిస్తామని స్పష్టం చేశారు. రెండు పార్టీలు అన్ని అంశాలను సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాయని, బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి ప్రధాన లక్ష్యమని, కూటమి పూర్తి ఐక్యంగానే ఉందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు నవంబర్ 17న లక్నోలో ఎస్పీ, కాంగ్రెస్ మధ్య అధికారికంగా సీట్ల పంపకంపై చర్చలు జరగనున్న నేపథ్యంలో.. సోమవారం (నవంబర్ 16) ఢిల్లీలోని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ భేటీలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, యూపీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి రాజేంద్ర పాల్ గౌతమ్, పీసీసీ అధ్యక్షురాలు ఆరాధన మిశ్రా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలు , 181 స్థానాల ప్రతిపాదనపై ఈ సమావేశంలో లోతుగా చర్చించారు. యూపీలో మార్పు ఖాయమని, సామాజిక న్యాయం కోసం ఇండియా కూటమితో కలిసి బలమైన ప్రత్యామ్నాయాన్ని అందిస్తామని సమావేశం అనంతరం ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో కుల సమీకరణాలను తనవైపు తిప్పుకోవడంపై సమాజ్‌వాదీ పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. అఖిలేశ్ యాదవ్ ప్రతిపాదించిన పీడీఏ (వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీలు) వ్యూహంలో భాగంగా ఆగ్రాలో నవంబర్ 15న భారీ దళిత సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా పట్టు కోల్పోయిందని, ఆ పార్టీని రాజకీయాల నుంచి పూర్తిగా తొలగించడమే తమ లక్ష్యమని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.

అయితే ఎస్పీ నిర్వహించిన దళిత సమ్మేళనంపై సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ) అధినేత, మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో ఎస్పీ పాలనలో ఆ పార్టీ నేతలే దళితులపై దాడులు, భూకబ్జాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. మరోవైపు కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావని గతంలో ఎస్పీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాల మధ్య నవంబర్ 17న జరిగే చర్చల్లో కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు దక్కుతాయన్న దానిపై స్పష్టత రానుంది.

ట్యాగ్‌లు: election news Uttar Pradesh