విద్యారంగ పతనం యువ భారతానికి గాయం
Protest
పరీక్షా పత్రాల లీకేజీలకు, విద్యా వ్యవస్థలోని సాధారణ పతనానికి వ్యతిరేకంగా భారతదేశం నలుమూలలా యువ విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఊపందుకుంటున్నాయి. భారత ప్రభుత్వం జవాబుదారీతనం వహించాలని, విద్యా సంస్కరణలు చేపట్టాలనే వారి డిమాండ్లు సూటి గా, స్పష్టంగా ఉన్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి ధైర్యానికి పిరికితనంతో, విచక్షణారహిత క్రూరత్వంతో సమాధానమిచ్చింది. వారిని భవిష్యత్తు వారసులుగా కాకుండా దేశ శతృవులుగా పరిగణించింది. ఒక అపఖ్యాతి పాలైన రోజు 2026 జూలై 20న ఢిల్లీ పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఎపిఎఫ్) క్రూరమైన లాఠీచార్జీలు, భాష్ప వాయువును ప్రయోగించి అనవసరమైన హింసతో వారిని అణచివేయడానికి ప్రయత్నించాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిలో చాలా మంది గాయపడ్డారు. ఇళ్లకు తిరిగి వెళ్తున్న విద్యార్థులను కూడా వదల్లేదు. వారి వీపులపైనా, తలలపైనా లాఠీల వర్షం కురిసింది.పెల్లెట్ల వాడకంతో శరీరాలు గాయపడిన యువత వంటి అత్యంత విచారకరమైన దృశ్యాలను దేశం చూసింది. ఇందుకు కేంద్ర హోం మంత్రి స్వయంగా ఆమోదించి ఉంటారని నిస్సందేహం గా చెప్పగలం. ఆనాటి వీడియోలు మన జ్ఞాపకాలలో చెరగని ముద్ర వేసి, మన సామూహిక మనస్సాక్షిని కదిలించాయి. ప్రభుత్వం, దాని ఆధీనంలో ఉన్న మీడియా మాత్ర మే, ఆకస్మికంగా పెరుగుతున్న ఈ నిరసనల వెల్లువ చుట్టూ కట్టుకథలు అల్లుతున్నాయి. ఇకనైనా ఆపండి అని గట్టిగా, స్పష్టంగా చెప్పాలి. వీరు మన కొడుకులు, కూతుళ్లు, మన యువతీ యువకులు.
మోదీ ప్రభుత్వం చర్చలకు బదులుగా హింసను సర్వసాధారణంగా ప్రయోగిస్తుంది. రైతుల నుండి ఉద్యమకారుల వరకు ఈ ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ వారం, నిరంకుశ పాలనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన సున్నితత్వం లేని ప్రభుత్వం మరింత నీచ స్థాయికి దిగజారింది. మన భవిష్యత్ వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రభుత్వోద్యోగులు, పారిశ్రామికవేత్తలు, దేశనిర్మాతలను అర్థం చేసుకుని వారి పట్ల సానుభూతితో వ్యవహరించడానికి బదులుగా, వారి పై ప్రభుత్వ అణచివేత శక్తిని ప్రయోగించింది. దీనిని క్షమించలేము, మరచిపోలేము.ప్రతీ అసమ్మతిని దేశద్రోహంగా ముద్రవేసే పాత అస్త్రా న్ని, విద్యార్థి ఆందోళనపై బురద చల్లడానికి మళ్ళీ ప్రయోగించారు. నిరసనలకు ప్రేరణగా నిలిచిన తన విధానాలపై ఆత్మపరిశీలన చేసుకోవలసిన మోదీ ప్రభుత్వం, నిందలు వేయడానికి, కుట్ర సిద్ధాంతాలను ప్రచా రం చేయడానికి తన వద్ద ఉన్న అన్ని కుతంత్రాలను ప్రయోగించింది.
ప్రభుత్వవిద్య పతనం
ప్రభుత్వ విద్య విషయంలో మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయటమే తొలి మౌలిక అంశం. ఈ ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్లో పాఠశాల విద్యపై వెచ్చించే వాటాను 50 శాతం, ఉన్నత విద్యపై 33 శాతం తగ్గించింది. ఇంతటి అసంబద్ధమైన వెనకడుగులో ఎవరికైనా ఔచిత్యం కనిపిస్తుందా? గత 12 ఏళ్లలో మోదీ ప్రభుత్వం దాదాపు లక్ష ప్రభుత్వ పాఠశాలలను మూసివేయగా, 43,000 ప్రైవేట్ పాఠశాలల ప్రారంభాన్ని పర్యవేక్షించింది. – వీటిలో అధిక భాగం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆధర్వ్యంలో నడపబడుతున్నాయి. యాదృచ్ఛికంగా దాని అనుబంధ సంస్థలతో కలిసి భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్ పాఠశాలల నెట్‌వర్క్‌కు నేతృత్వం వహిస్తుంది. ఉన్నత విద్యారంగంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ విశ్వవిద్యాలయాలకు ఇచ్చే గ్రాంట్లను తగ్గించి, అధిక వడ్డీ రేట్లకు రుణాలు తీసుకునేలా వాటిని ప్రోత్సహించింది. వాటిని తిరిగి చెల్లించేందుకు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు తమ ఫీజులను పెంచే మార్గాన్ని ఎంచుకున్నాయి.
అత్యున్నత నాణ్యమైన, సరసమైన ప్రభుత్వ విద్య అందుబాటులో లేకపోవడంతో, భారతదేశంలోని కుటుంబాలు తమ పిల్లల చదువుల కోసం సొంతంగా డబ్బు ఖర్చు చేయవలసి వస్తోంది. కేవలం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) కోచింగ్‌పై కుటుంబాలు ఖర్చు చేసే మొత్తం, మోదీ ప్రభుత్వం ప్రభుత్వ విద్యపై మొత్తంగా పెట్టే పెట్టుబడికి సమానం. ప్రైవేట్ విద్యను అభ్యసించడానికి అయ్యే ఖర్చు, నిరుపేద కుటుంబాల నుండి వచ్చి అపారమైన సామర్థ్యం కలిగిన లక్షలాది ప్రతిభావంతులైన విద్యార్థులను నిరుత్సాహపరుస్తోంది. అయితే, అంతే కీలకమైన విషయం ఏమిటంటే, ఈ ఖర్చులు తీవ్రమైన భారాన్ని మన విద్యార్థులపై అసాధ్యమైనంత అధిక అంచనాలను మోపుతున్నాయి. తమ పిల్లల విద్యా, వృత్తిపరమైన విజయాలనే స్వప్నం కోసం వారి కుటుంబాలు ఎంతగా పెట్టుబడి పెట్టాయో భారతదేశ యువతకు బాగా తెలుసు. మన విద్యార్థులలోని ఈ తీవ్ర నిరాశకు విద్యారంగ ప్రైవేటీకరణ, వ్యాపారీకరణే ప్రత్యక్ష కారణం.
విఫలమైన పరీక్షా వ్యవస్థ
ఇక రెండవ అంశం, కేంద్రీకరణ, ప్రైవేటీకరణ, రాజకీయీకరణ ప్రక్రియలకు గురైన భారతదేశ ప్రభుత్వ పరీక్షా వ్యవస్థ నిర్వీర్యం కావడం.విశ్వవిద్యాలయాలు, రాష్ట్రాలు తమ ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా సొంత పరీక్షలను నిర్వహించుకునే సాంప్రదాయ పద్ధతి స్థానంలో, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సియుఇటి) వంటి కేంద్రీకృత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించే పరీక్షలు వచ్చాయి. ఎన్‌టిఎ అనేది ఒక అసమర్థమైన, దీర్ఘకాలంగా సిబ్బంది కొరతతో బాధపడుతున్న సంస్థ. ఇది తన పరీక్షలను నిర్వహించడానికి పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్ల సైన్యంపై ఆధారపడుతుంది. ఎన్‌టిఎ నియమించిన ప్రశ్నపత్రాల రూపకర్తలు, అనువాదకులు, నిపుణులు భారతదేశంలోని ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన ప్రఖ్యాత విద్యావేత్తలు కాదని, చాలావరకు రాజకీయ అనుబంధం కలిగిన సాధారణ వ్యక్తులేనని అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రక్రియ తుది ఫలితం తీవ్రమైన పరిణామాలకు దారితీసింది. -గత 12 ఏళ్ళలో దేశవ్యాప్తంగా 152 పేపర్ లీకులు జరిగాయి. వాటిలో 2017లో ఎన్‌టిఎ ఏర్పడిన నాటి నుంచి స్వయంగా తొమ్మిది పేపర్లను లీక్ చేసింది. అధికారులు తమ నేరపూరిత చర్యలకు ఎలాంటి తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోకుండా, పరీక్షా విధానం నుండి లాభాలు గడించాలనే మార్గం ఎంచుకుంటున్నందున, అత్యంత ప్రతిభావంతులైన, కష్టపడి చదివే విద్యార్థులు కూడా
విఫలమవుతున్నారు.
మూడవ అంశం, భారతదేశ విద్యా వ్యవస్థలో విజయం సాధించడం కష్టంగా ఉండటం. ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న గుత్తాధిపత్యం కారణంగా, పట్టభద్రులైన తర్వాత అత్యంత నాణ్యమైన, మంచి జీతాలు ఇచ్చే ఉద్యోగ అవకాశాలు నేడు అరుదుగా లభిస్తున్నాయి. మన యువ పట్టభద్రులలో నిరుద్యోగ రేటు నిలకడగా అధికంగా ఉంటోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఇది సగటున సుమారు 40 శాతంగా ఉంది. మిగిలిన కొన్ని ఉద్యోగాల కోసం పోటీ తీవ్రంగా ఉంది. వాటికోసం పోటీ పడటానికి మన విద్యార్థులు గతంలో మాదిరిగా సన్నద్ధంగా లేరు. పక్షపాత విధేయత ఆధారంగా ఎంపిక చేసిన అసమర్థ వైస్-ఛాన్సలర్ల నియామకం, దాని పర్యవసానంగా రాజకీయ సంబంధాలు కలిగిన అర్హత లేని అధ్యాపకులను నియమించుకోవడం మన ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో బోధన సంక్షోభాన్ని సృష్టించింది. పని ప్రదేశంలో నైపుణ్య అవసరాలు మరింత సవాలుగా మారిన తరుణంలో, భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ కాలం చెల్లిన పద్ధతులకు, రాజకీయ ప్రేరేపిత పాఠ్యప్రణాళిక మార్పులకు కట్టుబడి ఉంది. ఇది అభివృద్ధి చెందుతున్న పద్ధతులు, ప్రమాణాలకు ప్రమాదకరంగా దూరంగా ఉండి, ముఖ్యంగా ఆర్టిఫిషియ ల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్రపంచం వేగాన్ని అందుకోలేకపోతుంది. విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సవాళ్లతో నిండిన, రోజురోజుకు పెరుగుతున్న డిమాండ్ ఉన్న వ్యవస్థలో విజయం సాధించడానికి ప్రయత్నిస్తున్నారు.ఇందుకు తగినంత వనరులు లేకపోవడమే కారణం.
కాబట్టి విద్యా వ్యవస్థ రోజురోజుకు ఖరీదైనదిగా, అవినీతికి ఆస్కారం ఉన్నదిగా, అందులో విజయం సాధించడం కష్టంగా మారిపోతోంది. కానీ, జవాబుదారీతనం నుండి తప్పించుకుంటూ, విద్యపై చిత్తశుద్ధితో కూడిన చర్చలను నివారించే మోదీ ప్రభుత్వ స్థిరమైన, ఉద్దేశపూర్వక విధానమే దీనికి చివరి దెబ్బగా నిలిచింది. ఏకాభిప్రాయం కోరకుండా లేదా పార్లమెంటరీ చర్చలకు పెట్టకుండా జాతీయ విద్యా విధానం 2020 ను ఉద్దేశపూర్వకంగా ఆమోదించింది. ఎన్‌టిఎను అసలు పార్లమెంటు ముందుకు తీసుకురాలేదు. ఎలాంటి జవాబుదారీ యంత్రాంగాలు లేకుండా కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు చేసిన ఒక సొసైటీగానే మిగిలిపోయింది. ఎన్‌టిఎను బలోపేతం చేయాలన్న విద్యపై పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సులలో ప్రతిపక్ష సభ్యులు ఉన్నారనే ఏకైక కారణంతో, ఆ సిఫార్సులను బహిరంగంగా తోసిపుచ్చడం ద్వారా విద్యాశాఖ మంత్రి జవాబుదారీతనం పట్ల తనకున్న ధిక్కారాన్ని నిస్సిగ్గు గా ప్రదర్శించారు. ఇన్ని ఘోర వైఫల్యాలు ఎదురైనా పదవికి రాజీనామా చేయడానికి ఆయన ఇష్టపడకపోవడం ప్రజాభిప్రాయాన్ని మరింత రెచ్చగొట్టింది.
నిరసన మూలాలు
పరస్పర సంబంధిత శక్తుల సహజ పర్యవసానమే విద్యార్థుల నిరసనలు. అవి నిరాశను మాత్రమే రేకెత్తించే నేటి నిరాశాజనకమైన విద్యా వాతావరణం, మోదీ ప్రభుత్వానికి అలవాటైన అహంకారం, జవాబుదారీతనం లేదా నిర్మాణాత్మక వైఖరి లేకపోవడం. విద్యార్థి నిరసనకారులపై కేంద్ర హోం మంత్రి ప్రత్యక్ష అజమాయిషీ కింద పనిచేస్తున్న పోలీసు సిబ్బంది ప్రదర్శించిన క్రూరత్వం ఈ ప్రభుత్వ హయాంలో కొత్తేమీ కాదు. 2020లో పౌరసత్వ (సవరణ) చట్టం- జాతీయ పౌర పట్టిక నిరసనల సమయంలో సాయుధ పోలీసులు, పారామిలిటరీ బలగాలు విశ్వవిద్యాలయ ప్రాంగణాలపై ఎలా విరుచుకుపడ్డాయో మనందరికీ స్పష్టం గా గుర్తుంది. భారతదేశ మహిళా రెజ్లర్లపై జరిగిన ఆమోదయోగ్యం కాని దురాగతాలు మన స్మృతుల నుంచి ఎప్పటికీ చెరిపివేయలేము.
మోదీ ప్రభుత్వం భారతదేశ విద్యారంగాన్ని దిగజార్చడమే కాకుండా, శిక్షలపై భయం లేనితనంతో, అపారమైన స్వీయ భ్రమలతో, అత్యంత సున్నితత్వం లేకుండా వ్యవహరించడాన్ని అలవాటుగా మార్చుకుంది. భారతదేశ విద్యార్థులు మోదీ ప్రభుత్వ బూటకపుతనాన్ని బట్టబయలు చేశారు. వారికి అండగా నిలబడి, వారి భవిష్యత్తును కాపాడటం మన నైతిక, రాజకీయ, రాజ్యాంగపరమైన బాధ్యత.
(ది హిందూ తేదీ: 24/7/2026)