Skip to content
జాతీయం వార్తలు

మందిర్‌, మసీదు, చర్చి.. కాదేదీ చోరీలకు అనర్హం

Prajapaksham 14 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మందిర్‌, మసీదు, చర్చి.. కాదేదీ చోరీలకు అనర్హం

Temples, mosques, churches—nothing is off-limits for theft.

ఎం. కోటేశ్వరరావు

అయోధ్యలో రాముడి సొమ్ము కొట్టేసిన ఉదంతం అనేక మందితో మాట్లాడిస్తున్నప్పటికీ దేవుడి అంశగా జన్మించినట్లు చెప్పుకున్న నరేంద్రమోడీ నోరు తెరిపించలేక సాక్షాత్తూ ఆ రాముడే “మౌనం”గా ఉండిపోయాడు! ఓట్ల కోసం రాముడు కావాల్సి వచ్చింది, ఎన్నికల ప్రచారం కోసం సాష్టాంగ ప్రమాణం చేస్తున్న ఫొటోల నిమిత్తం అయోధ్య రామాలయం అవసరమైంది. కానీ దాని లో జరిగిన కుంభకోణం గురించి స్పందించటానికి నోరు రావటం లేదు. తమ గుళ్లలో జరిగే అక్రమాలపై ఎందుకు దేవుళ్లు, దేవతలు స్పందించటం లేదన్నది తరతరాలుగా నాస్తికులు, హేతువాదులు, భౌతికవాదులు వేస్తున్న సమాధానం లేని ప్రశ్న. దేవతల లీలలు, మహిమల గురించి కథకథలుగా చెప్పుకుంటాం. ఇప్పుడు వారికి వచ్చిన కానుకల చోరీ గురించి అయోధ్య దర్యాప్తులో కతలు ఎన్నో వెలువడుతున్నాయి.
ఇంకా గూగులమ్మ తల్లికి ఏ మతం, కులాన్ని అంటగట్టలేదు.అఫ్‌ కోర్సు తమ కంపెనీ ప్రయోజనాలు, వాటిని పరిరక్షించే నేతలు, పార్టీల గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ తల్లికూడా అలాంటి సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా నిరోధిస్తున్నదని చెబుతున్నారు.అయినా తనకు ఇబ్బందిలేని వాటిని అందిస్తున్నది.ప్రార్ధనా స్థలాల్లో భక్తులు, విశ్వాసులు ఇచ్చే కానుకలను కొట్టి వేయటం అన్ని చోట్లా జరుగుతున్నదని ఎవరు అడిగినా చెబుతుంది, కావాలంటే తెలుసుకోవచ్చు. మందిరాలు, మసీదులు, చర్చ్‌లు ఏవీ ఇలాంటి అక్రమాలకు దూరంగా లేవు. పేరు భిన్నంగా ఉండవచ్చు తప్ప ప్రతి చోటా కానుకల స్వీకరణ, వాటి అపహరణ జరుగుతూనే ఉంది. అయోధ్య ఉదంతంతో ఇప్పుడు జనాలకు పాత దొంగతనాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ మతం, దేవుళ్లను రాజకీయ అవసరాలకోసం వినియోగించుకొనే సంఘపరివార్‌ సంస్థలన్నింటినీ జనం అనుమానంతో చూసేందుకు దోహదం చేస్తున్నాయి. దేవాలయాలను ప్రభుత్వ అదుపు నుంచి తొలగించాలని కోరుతున్న వారికి ఇప్పుడు నోట్లో పచ్చివెలక్కాయపడింది. ట్రస్టుల పేరు తో వాటిని నడిపే తమవారి నిర్వాకాలు వెలుగులోకి రావటంతో మింగా కక్కలేకుండా ఉన్నారు. ఇప్పుడు సంఘపరివార్‌ పెద్దల ఆందోళన దేవుడి సొమ్ము, నగలను కొట్టేయటం కాదు, కోట్లాది మంది భక్తుల్లో బిజెపి, విశ్వహిందూపరిషత్‌ వంటి తమ సంస్థల పట్ల ఉన్న విశ్వాసం, నమ్మకాలు సడలిపోతే తమ హిందూత్వ అజెండాకే ముప్పు అన్నదే అసలు భయం. కొందరిని కొంతకాలం మోసం చేయగలం, అందరినీ ఎల్లకాలం మభ్యపెట్టలేము కదా!
కానుకల చోరీ పూర్వరంగంలో అయోధ్య రామాలయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోరాదని విశ్వహిందూపరిషత్‌ చెబుతోంది. ఎందుకంటే అది తమ చేతుల్లోంచి పోతుందనే భయం. మా హిందూ దేవాలయం, కానుకలు ఇచ్చిందీ, దొంగతనం చేసిందీ మా హిందువులే కదా, మేం మేం చూసుకుంటాం అన్నట్లుగా దాని వైఖరి ఉంది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి రామాలయ ట్రస్టును తీసుకురాకూడదని చెబుతున్నారు. దీని అర్ధం ఏమిటి? భవిష్యత్‌లో కూడా ఏం జరిగినా ఎవరూ ప్రశ్నించకూడదు, ఎంత పారదర్శకత! తప్పనిసరై రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి సంపత్‌ రాయ్‌, ట్రస్టీ అనిల్‌ మిశ్రా రాజీనామా చేయగా ఆహ్వానితుడు గోపాలరావును ఆ జాబితా నుంచి తొలగించారు. వీరు ముగ్గరూ సంఘపరివార్‌ గుంపులోని వారే. నరేంద్రమోదీ ప్రవచించిన జవాబుదారీతనం, నేను తినను ఇతరులను తిననివ్వను’ అన్న ‘చౌకీదార్‌’ సంగతేమిటి? యావత్‌ దేశాన్నీ కదలించిన ఈ ఉదంతం అసలు పట్టించుకోవాల్సింది కాదన్నట్లుగా ఇంతవరకు ఒక్క మాటా మాట్లాడలేదు. సాగినంత కాలం సాగుతుంది తప్పదు. రామాలయంలో జరిగింది కుంభకోణం కాదు, చిన్న చోరీ మాత్రమే, అలాంటివి ప్రతిచోటా జరుగుతూనే ఉన్నాయి గనుక పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొందరు తక్కువ చేసి చూపేందుకు చూస్తున్నారు. గోడీ మీడియా తప్పనిసరై ఈ కేసు గురించి వార్తలను ఇవ్వకతప్పటం లేదు. గతంలో ఆరోపణలు వచ్చినపుడు వాటన్నింటినీ మూసిపెట్టింది, ఇప్పుడు సాధ్యం కావటం లేదు. నిజమే ప్రతి చిన్న చోరీ విచారణకు పోలీసులు కేసులు పెడతారు తప్ప రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేకం గా దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేయవు కదా! అయోధ్యలో జరిగింది చిన్న దొంగతనమే అయితే యోగి సర్కార్‌ సిట్‌ను ఎందుకు ఏర్పాటు చేసినట్లు? అనేక మంది సంఘపరివార్‌ ప్రముఖులు తీవ్ర ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్లు? చిన్న చోరీ అయితే అయోధ్య బార్‌ అసోసియేషన్‌ నిందితుల తరఫున వాదించకూడదనే నిర్ణయం ఎందుకు తీసుకున్నట్లు ? ఆరోపణలకు గురైన ట్రస్టు సభ్యులు పట్టణం విడిచి వెళ్లాలని ఎందుకు డిమాండ్‌ చేసినట్లు? కొందరు చెబుతున్న ఈ “చిన్న” ఉదంతం గురించి సమాధానం లేని “పెద్ద” ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.
దేవాలయాలను ప్రభుత్వ ఆధీనంలోకి తెస్తే అక్రమాలకు తావుండదని అర్ధం కాదు. పాలక మండళ్లు, అధికారులను ప్రశ్నించటానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానం చెబుతారా లేదా అన్నది పక్కన పెడితే కనీసం సమాచార హక్కు చట్టం వర్తిస్తుంది. అదే ప్రైవేటు ట్రస్టులైతే రామాలయం గతే ! కాశీ విశ్వనాధుడి ఆలయంలోని శివలింగం వద్ద 1983 జనవరి ఐదున 2.55కిలోల బంగారం మాయమైంది. దాని దర్యాప్తులో బయటపడిన లోపాల తరువాత మహంతుల(పూజారుల) అదుపు నుంచి తప్పించేందుకు కాశీ విశ్వనాధ ఆలయ చట్టం 1983చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ట్రస్టుకు అప్పగించారు. ఆ సమయంలో ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. ఆలయంలో చోరీ వార్తలు వెలువడగానే వారణాసిలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు ఆయోధ్యలో అలాంటిదేమీ కనిపించటం లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నది బిజెపి గనుక, వీధుల్లోకి వచ్చేవారెవరుంటారు. కాశీ ఆలయచోరీ కేసులో నిందితులకు పదిహేడేళ్ల తరువాత 2000సెప్టెంబరు ఏడున కోర్టు శిక్షలు విధించింది. గట్టి ఇనుప ఊచల కవచం మధ్య గర్భగుడిలో ఉన్న ఆ బంగారం చోరీ జరిగిన తీరు చూస్తే ఇంటి దొంగలపనే అని విచారణలో తేలింది. కవచ ద్వారాలను తెరిచినట్లు తప్ప పగలగొట్టిన ఆనవాళ్లు లేవు. ఆ సమయంలో గుడిలో ఉన్న ఇద్దరు పూజారులు తాము నిద్రించి ఉన్నట్లు చెప్పారు. పూజారుల ఏలుబడిలో గుడిలో నగదు,ఆస్తుల వివరాలు సక్రమంగా లేవని తేలింది.అంతా అడ్డగోలు వ్యవహారాలు నడిచాయి.ఆలయంపై వారసత్వ అధికారం ఎవరిదన్న కీచులాటలు కోర్టుకు ఎక్కగా వివాదం తేలేంతవరకు రోజువారీ రాబడిని కేసుల్లో ఉన్న పూజారులకు సమంగా పంచాలని 1950 దశకంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 1983 చోరీతో పూజారుల హక్కులకు తెరపడింది. నాలుగు వందల సంవత్సరాల పాటు ఒక పూజారి కుటుంబం ఆలయాన్ని ఏలింది. వెయ్యి సంవత్సరాల క్రితం రామానుజాచార్యుడు ప్రారంభించినట్లు చెబుతున్న వారసత్వ అర్చకత్వానికి లేదా మిరాసీదార్ల వ్యవస్థకు 1987లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్వస్తి పలికింది. లడ్డూ కల్తీ అంశం వెలుగులోకి వచ్చిన తరువాత కొందరు దేవాలయాలను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. ఇప్పుడు అయోధ్యలో జరిగిందాన్ని సమర్ధించుకొనేందుకు కాషాయ ప్రియులు నానా పాట్లు పడుతున్నారు.
నాలుగు దశాబ్దాలకు పైగా రామాలయం చుట్టూ రాజకీయాలను తిప్పి లబ్దిపొందిన కాషాయ దళాలకు తొలిసారిగా కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరచిన ఉదంతం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియని స్థితి. రాముడిని, రామాలయాన్ని వ్యతిరేకించిన ప్రతిపక్షాలు కానుకల కుంభకోణం నుంచి పెద్దగా లబ్దిపొందలేవని కొందరు వెంటనే ముక్తాయింపులు ఇవ్వటం ప్రారంభించారు.రామాలయ ఆందోళన ప్రారంభించిన వెంటనే బిజెపికి లబ్ది చేకూరలేదు. అదే విధంగా తమ మనోభావాలను బిజెపి పెద్దలు ఎలా దెబ్బతీశారో గ్రహించటానికి కూడా జనానికి సమయం పడుతుంది. దానికి నాంది పడింది. రాముడిని వీధుల్లోకి లాగింది మతవాదులు. వారి ప్రభావానికి లోనైన జనాన్ని దాన్నుంచి బయటపడవేసేందుకు ఎవరు ప్రయత్నించాలి? మరింత మూఢత్వంవైపు నెట్టేందుకు కాషాయ దళాలు చూస్తాయి. రాముడు(అయోధ్య), కృష్ణుడు(మధుర), శివుడి(వారణాసి) ఆలయాల పేరుతో ప్రారంభించిన క్రీడను దాన్ని వ్యతిరేకించే శక్తులందరూ ముల్లును ముల్లుతోనే తీసినట్లు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో కేరళ, తమిళనాడు వంటిచోట్ల కులవివక్షకు వ్యతిరేకంగా దేవాలయ ప్రవేశ ఉద్యమం ముందుకు వచ్చింది. దాని అర్ధం దానిలో పాల్గ్గొన్నవారు మతవాదులు కాదు, వివక్షను వ్యతిరేకించటం అసలు విషయం. ఆ ఉద్యమంలో ఉన్న ఏకె గోపాలన్‌ వంటి వారు ఎందరో తరువాత కమ్యూనిస్టునేతలుగా ఎదిగిన సంగతి తెలిసిందే. బిజెపి దేవుళ్లతో రాజకీయం చేసి లబ్ది పొందినట్లు భావించిన పవన్‌ కల్యాణ్‌ సనాతనవాది అవతారమెత్తి లబ్దిపొందేందుకు చూస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ గురించి వెల్లడించటం ద్వారా తానే పెద్ద హిందూత్వవాదినని జనం ముందుకు వచ్చేందుకు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం ఏమిటో తెలిసిందే. సున్నిత మనోభావాలతో కూడుకున్న అంశాల పట్ల మొరటుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఏ ఇతిహాసా లు, పురాణాల నుంచి తిరోగమన భావాలను ముందుకు తెస్తున్నారో, వాటి నుంచే ఎదుర్కొనే ఆయుధాలను వెలికి తీయాల్సిన తరుణమిది. హిందూత్వ భావజాలం ఒక్క రోజులో ఎలా పెరగలేదో దాన్ని ఎదుర్కొనే భావాలు జనంలోకి వెళ్లటానికి సమయం పడుతుంది. మొక్కనాటగానే కాయలు కాయవు.
అయోధ్యలో అవినీతి గురించి ఆరోపణలు రావటం ఇదే ప్రధమం కాదు, గతంలో అయోధ్య వివాదంలో అసలు పిటీషన్‌దార్లలో ఒకటైన నిర్మోహి అఖారా అనేక ఆరోపణలు చేసింది. రామాలయం పేరుతో దేశం లో, విదేశాల నుంచి విశ్వహిందూపరిషత్‌ వసూలు చేసిన నిధుల్లో పధ్నాలుగు వందల కోట్లకు పైగా దుర్వినియోగం, స్వాహా జరిగిందని మహంత్‌ సీతారామ్‌ ఆరోపించారు. తాజాగా, రామాలయం కోసం రెండుకోట్లతో భూమి కొని దానికి రు.18.5కోట్లు బదలాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలోలాగా ఆరోపణలు దాటవేయటం, మూసిపెట్టటం ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపికి ఇప్పుడు అది సాధ్యం కాదు. ఇంతకాలం కాషాయ దళాలు, అవాస్తవాలను ప్రచారం చేశాయి. వాటిని వ్యతిరేకించే వారు ఇప్పుడు అసలు విషయాలను జనంలోకి తీసుకుపోవాలి.నిజాలు నిలకడ మీద బుర్రల్లోకి ఎక్కుతాయి !

ట్యాగ్‌లు: churches mosques Temples