Sitting for Hours Every Day? ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు..షాకిస్తున్న గ్లాస్గో వర్సిటీ అధ్యయనం..
Sitting for Hours Every Day? ఎక్కువసేపు ఒకేచోట కూర్చోవడం వల్ల క్యాన్సర్ ముప్పు..షాకిస్తున్న గ్లాస్గో వర్సిటీ అధ్యయనం..
Sitting for Hours Every Day? మీరు ఎక్కువసేపు నిరంతరాయంగా ఒకేచోట కూర్చుని పని చేస్తున్నారా.. అయితే క్యాన్సర్ బారీన పడే అవకాశం ఉన్నట్లే. తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మీరు ఎక్కువసేపు నిరంతరాయంగా ఒకేచోట కూర్చోని పని చేయడం వల్ల క్యాన్సర్‌బారిన పడే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని గ్లాస్గో వర్సిటీ తాజా అంతర్జాతీయ అధ్యయనం హెచ్చరించింది.
అదే సమయంలో నిత్యం చిన్నపాటి లేదా తేలికపాటి శారీరక శ్రమ చేయడం ద్వారా క్యాన్సర్ మరణాల ముప్పును భారీగా తగ్గించవచ్చునని పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు. గ్లాస్గో విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులతో కూడిన ఒక అంతర్జాతీయ బృందం యూకే బయోబ్యాంక్ లో నమోదైన సుమారు 91,292 మంది పౌరుల ఆరోగ్య డేటాను క్షుణ్ణంగా విశ్లేషించింది. క్యాన్సర్ ముప్పు.. దానివల్ల సంభవించే మరణాలను ఖచ్చితంగా అంచనా వేయడానికి పరిశోధకులు వీరిని సగటున 12.4 సంవత్సరాల పాటు నిరంతరం పర్యవేక్షించి ఈ విషయాలను వెల్లడించారు.
ఈ అధ్యయనం ప్రకారం.. రోజులో ఎటువంటి విరామం లేకుండా 30 నిమిషాలకు పైగా నిరంతరాయంగా కూర్చోవడం వల్ల క్యాన్సర్‌తో మరణించే ముప్పు 9 శాతం పెరుగుతుంది. అయితే, ప్రతిరోజూ ఒక గంట పాటు కూర్చోవడానికి కేటాయించే సమయాన్ని తగ్గించి.. దాని స్థానంలో తేలికపాటి శారీరక శ్రమకు ప్రాధాన్యమిస్తే క్యాన్సర్ మరణాల ముప్పు 12 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
ఎక్కువసేపు ఒకేచోట కదలకుండా కూర్చోవడం వల్ల కేవలం క్యాన్సర్ మాత్రమే కాకుండా డయాబెటిస్, అధిక రక్తపోటు, తీవ్రమైన గుండె జబ్బులబారిన పడే ప్రమాదం కూడా పెరుగుతుందని ఇప్పటికే పలు పరిశోధనలలో నిరూపితమైంది. నిత్యం క్రమం తప్పకుండా చిన్నపాటి కదలికలు లేదా శారీరక శ్రమ చేసే వ్యక్తుల్లో క్యాన్సర్ బారిన పడటం, అలాగే దానివల్ల మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.