Skip to content
జాతీయం › వార్తలు

ECI ఓట్ల తొలగింపు వివాదంలో కేంద్ర బిందువుగా సీమా ఖన్నా..ఎవరీ అధికారిణి..? వివాదంలో ఆమె పాత్ర ఏంటి..?

Krishna Rao 30 Sep 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ECI ఓట్ల తొలగింపు వివాదంలో కేంద్ర బిందువుగా సీమా ఖన్నా..ఎవరీ అధికారిణి..? వివాదంలో ఆమె పాత్ర ఏంటి..?

ECI భారత ఎన్నికల వ్యవస్థలో సాధారణంగా ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఎన్నికల కమిషనర్ల పేర్లే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కానీ 2026లో ఎన్నికల ఓటర్ల జాబితాలపై చెలరేగిన వివాదంలో మరో పేరు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆమె డాక్టర్‌ సీమా ఖన్నా. ఎన్నికల సంఘం డైరెక్టర్‌ జనరల్‌ (ఐటీ)గా పనిచేస్తున్న సీమా ఖన్నా ఆధ్వర్యంలోని ఐటీ విభాగం నిర్వహించే సాఫ్ట్‌వేర్‌, ఓటర్ల డేటాబేస్‌ యాక్సెస్‌ విధానంపై ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు ప్రశ్నలు లేవనెత్తినట్లు ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ దర్యాప్తు కథనాల్లో పేర్కొన్నారు. 

ఎవరీ సీమా ఖన్నా?

సీమా ఖన్నా నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (NIC)కు చెందిన సీనియర్‌ శాస్త్రవేత్త. 2025లో డిప్యుటేషన్‌పై ఆమె ఎన్నికల సంఘంలో చేరారు. ప్రస్తుతం డైరెక్టర్‌ జనరల్‌ (ఐటీ)గా ఎన్నికల సంఘం డిజిటల్‌ వ్యవస్థలు, సాఫ్ట్‌వేర్‌ మౌలిక వసతులకు సంబంధించిన బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల అధికారిక డైరెక్టరీలో కూడా ఆమెను డైరెక్టర్‌ జనరల్‌ (IT)గా పేర్కొన్నారు.

ఎన్నికల సంఘం 2026 జనవరి 22న ECINetను ప్రారంభించింది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన 40కి పైగా యాప్స్‌, పోర్టల్స్‌ను ఒకే డిజిటల్‌ వ్యవస్థ కిందకు తీసుకురావడం దీని లక్ష్యంగా ప్రకటించారు. ఈ వ్యవస్థను పారదర్శకత, విశ్వసనీయత, ప్రజల నమ్మకాన్ని పెంచేలా రూపొందించినట్లు సీమా ఖన్నా అప్పట్లో వివరించారు.

అసలు వివాదం ఏమిటి?

ఓటర్ల జాబితా తయారీ, సవరణ, పేర్ల తొలగింపు, తిరిగి చేర్పు వంటి పనుల్లో Electoral Registration Officers (EROs) కీలక పాత్ర పోషిస్తారు. చట్టపరంగా ఓటర్ల జాబితాలో పేర్లను చేర్చడం, తొలగించడం, సవరణలు చేయడం వంటి బాధ్యతలు EROలకు ఉంటాయి.

అయితే ఓటర్ల జాబితా నిర్వహణకు ఉపయోగించే సాఫ్ట్‌వేర్‌లో కొన్ని కీలక అనుమతులు, యాక్సెస్‌ నియంత్రణలు ఢిల్లీలోని ఎన్నికల సంఘం ఐటీ విభాగం పరిధిలోకి వెళ్లాయని, దీనివల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే EROల స్వతంత్ర నిర్ణయాధికారం ప్రభావితమైందా అనే ప్రశ్నలు తలెత్తాయని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ తన రిపోర్టులో పేర్కొంది. 

ఇక్కడే సీమా ఖన్నా పేరు ప్రధానంగా వినిపించింది. ఎందుకంటే ఈ సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థల నిర్వహణ ఎన్నికల సంఘం ఐటీ విభాగం పరిధిలో ఉండగా, ఆ విభాగానికి ఆమె డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు. ఓటర్ల పేర్ల తొలగింపులను వ్యక్తిగతంగా సీమా ఖన్నానే ఆదేశించారా అనే ప్రశ్న తలెత్తుతోంది.  ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాల్లో ప్రధానంగా సాఫ్ట్‌వేర్‌ యాక్సెస్‌, అనుమతులు, క్షేత్రస్థాయి అధికారుల అధికారాల విషయంలో అంతర్గత చెలరేగిన వివాదంలో ఈ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలు

ఈ వివాదంలో కీలకమైన అంశం ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి లేవనెత్తిన అభ్యంతరాలు. ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ పరిశోధన ప్రకారం, ఓటర్ల జాబితా డేటాబేస్‌ క్రమంగా కేంద్రీకృతమవుతోందని, రాష్ట్రాలు, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులకు సాఫ్ట్‌వేర్‌ యాక్సెస్‌పై పరిమితులు ఏర్పడుతున్నాయని వారు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేశారు.

2025 నవంబర్‌ 4న డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ సీమా ఖన్నాకు రాసిన లేఖలో EROలు, DEOలు, CEOలు తమ చట్టబద్ధమైన విధులను స్వయంగా నిర్వహించేలా ఐటీ వ్యవస్థ ఉండాలని సూచించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. 2026 జనవరి 2న కూడా ఇలాంటి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. EROల నిర్ణయాధికారాన్ని సాఫ్ట్‌వేర్‌ పరిమితం చేయకూడదని సూచించినట్లు నివేదిక పేర్కొంది.

గోవాలో 97 మంది ఓటర్ల వ్యవహారం

సీమా ఖన్నా పేరు ఎక్కువగా చర్చకు రావడానికి ప్రధాన కారణాల్లో ఒకటి గోవా ఓటర్ల జాబితా వ్యవహారం. 2026 ఫిబ్రవరిలో గోవాలో SIR ప్రక్రియలో భాగంగా తొలగించిన పేర్లపై EROలు విచారణ జరిపి 97 మంది ఓటర్లు తిరిగి చేర్చడానికి అర్హులని నిర్ణయించినట్లు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అయితే ఆ నిర్ణయాన్ని సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసి పేర్లను తిరిగి చేర్చేందుకు అవసరమైన ‘rollback’ సదుపాయం క్షేత్రస్థాయి ERO అధికారులకు అందుబాటులో లేని విషయాన్ని ఆ కథనం పేర్కొంది.

గోవా చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీస్‌ ఫిబ్రవరి 11 నుంచి 17 మధ్య ఎనిమిదిసార్లు ఎన్నికల సంఘాన్ని సంప్రదించినట్లు నివేదిక వెల్లడించింది. ఈ లేఖల్లో సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ జ్ఞానేశ్‌ భారతి ప్రధానంగా ప్రస్తావించబడగా, సీమా ఖన్నాను కూడా ప్రతిసారీ కాపీలో ఉంచినట్లు తెలిపింది.

ఫిబ్రవరి 18న డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ సీమా ఖన్నాకు రాసిన లేఖలో, సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అవసరమైన చర్యలను ఐటీ వ్యవస్థ అడ్డుకోకూడదని, EROలు తీసుకున్న నిర్ణయం ప్రకారం చర్యలు తీసుకునేలా సదుపాయం కల్పించాలని కోరినట్లు నివేదిక పేర్కొంది.

అయితే ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితా ప్రచురితమైనప్పుడు ఆ 97 మంది పేర్లు అందులో కనిపించలేదని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్ తన పరిశీలనలో పేర్కొంది. తరువాత గోవా చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీస్‌ ఈ 97 కేసులను ప్రత్యేకంగా ప్రాసెస్‌ చేసినట్లు వివరణ ఇచ్చారు. 

సీమా ఖన్నాపై ప్రధాన ఆరోపణలు ఏమిటి?

ప్రస్తుతం ఆమెపై చర్చకు వచ్చిన ఆరోపణలను ప్రధానంగా మూడు అంశాలుగా చూడవచ్చు.

మొదటిది — ఓటర్ల డేటాబేస్‌ కేంద్రీకరణ. గతంలో ఓటర్ల జాబితా నిర్వహణలో క్షేత్రస్థాయి అధికారులకు ఉన్న డిజిటల్‌ యాక్సెస్‌ క్రమంగా ఢిల్లీ ఐటీ విభాగం ఆధీనంలోకి వెళ్తోందనే అభ్యంతరాలు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు వ్యక్తం చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.

రెండోది — EROల చట్టబద్ధ అధికారాలపై సాఫ్ట్‌వేర్‌ పరిమితులు. EROలు చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అనుమతులు అందుబాటులో లేకపోతే, సాంకేతిక వ్యవస్థ వారి అధికారాలను పరోక్షంగా పరిమితం చేసినట్టవుతుందా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.

మూడోది — గోవాలో 97 మంది ఓటర్ల పేర్ల వ్యవహారం. అర్హులుగా గుర్తించిన 97 మంది పేర్లను తుది జాబితాలో చేర్చడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ సదుపాయం సమయానికి అందుబాటులోకి రాకపోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఆ సదుపాయం కోసం గోవా అధికారులు పదేపదే విజ్ఞప్తి చేసిన సమయంలో సీమా ఖన్నా కూడా సమాచారంలో ఉన్నారని నివేదికలు పేర్కొన్నాయి.

రాజకీయ వివాదం కంటే పెద్ద ప్రశ్న

ఈ వ్యవహారం వ్యక్తి చుట్టూ మాత్రమే పరిమితం కావడం లేదు. ఓటర్ల జాబితా వంటి అత్యంత కీలకమైన వ్యవస్థలో తుది నిర్ణయం ఎవరిది? అనే ప్రశ్నను ఇది ముందుకు తెచ్చింది.

ఒక ERO ఒక ఓటరు అర్హుడని నిర్ణయించిన తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు చేయడానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ అనుమతి మరొక స్థాయి నుంచి రావాల్సి వస్తే, ఎన్నికల ప్రక్రియలో చట్టబద్ధ అధికారం, సాంకేతిక నియంత్రణ మధ్య సంబంధం ఎలా ఉండాలి అన్నది కీలకమైన ప్రశ్నగా మారుతుంది. ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు కూడా ఇదే అంశంపై అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలు ఈ వివాదానికి మరింత ప్రాధాన్యతను తీసుకొచ్చాయి.

సీమా ఖన్నా ప్రస్తుతం ఈ మొత్తం వివాదంలో ముందుకు వచ్చిన ముఖ్యమైన వ్యక్తి. అయితే ఆమె పాత్రపై తుది నిర్ధారణకు రావాలంటే ఎన్నికల సంఘం అంతర్గత పత్రాలు, సాఫ్ట్‌వేర్‌ యాక్సెస్‌ విధానాలు, EROలకు ఇచ్చిన అధికారాలు, గోవా ఘటనపై పూర్తి రికార్డులు వంటి అంశాలపై మరింత స్పష్టత అవసరం. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఆధారాలు మాత్రం ఎన్నికల సంఘం ఐటీ వ్యవస్థపై, దాని కేంద్రీకృత నియంత్రణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

ట్యాగ్‌లు: ECI Election Commission of India