Skip to content
జాతీయం వార్తలు

ఆన్‌లైన్‌లో మహిళల భద్రత ఒక ప్రశ్న?

Prajapaksham 23 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
ఆన్‌లైన్‌లో మహిళల భద్రత ఒక ప్రశ్న?

Is women safety online a question

హరిప్రసాద్‌ దూపాటి (షాపూర్‌ నగర్‌, హైదరాబాద్‌)

ఇటీవల ఒక కాలేజీ విద్యార్థిని ఫొటోలు వాట్సాప్‌ గ్రూపుల్లో ప్రముఖంగా వైరల్‌ అయ్యాయి. మొదట అవి సాధారణ సెల్ఫీలు అని అనుకున్నారు. కానీ దగ్గరగా చూస్తే…ఆమె ముఖాన్ని వేరే వ్యక్తి శరీరానికి జతచేసి, అభ్యంతరకరమైన వీడియోగా మార్చినట్లు తెలిసింది. అది ఏఐ సాయంతో చేసిన డీప్‌ఫేక్‌ అని తేలింది. ఆ వీడియో చూసినవాళ్లలో చాలామంది, ‘ఇంత క్లియర్‌గా ఉంటే నిజమే అయి ఉంటుంది’ అని నమ్మారు. ఎవ్వరూ ఆమె అనుమతి ఉందా? ఆమె జీవితం మీద ప్రభావం ఏమిటి? అని ఆలోచించలేదు. ఫలితంగా ఆ వీడియో
విస్తృతంగా షేర్‌ అయ్యింది. ఆ అమ్మాయి మానసికంగా తీవ్ర ఒత్తిడికి లోనైంది. కుటుంబానికి పరువు పోతుందనే భయంతో కొన్ని రోజులు బయటకు రావడానికే భయపడింది. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు పట్టుబడ్డారు. కానీ అప్పటికే జరిగిన నష్టం తిరిగిరానిది. ఈ సంఘటన మరోసారి చెప్పేదేంటంటే డిజిటల్‌ ప్రపంచంలో ఒక క్లిక్‌ కూడా ఎవరి జీవితాన్నైనా నాశనం చేసే శక్తి కలిగి ఉందని. డిజిటల్‌ హింసను తేలికగా తీసుకోవడం సమాజానికి అత్యంత ప్రమాదకరమైన విషయం.
డిజిటల్‌ హింస… ఎన్నో రూపాలు
గృహహింసనే ఇప్పటికీ సీరియస్‌గా తీసుకోని పురుషాధి క్య సమాజం మనది. ఇక డిజిటల్‌ వయొలెన్స్‌ తీవ్రతను అర్థం చేసుకుంటుందని ఆశించడం అత్యాశే. ఆ మాటే చెబుతోంది ఇటీవల వెలువడిన ఒక అధ్యయనం.‘ఎక్స్‌పీరియన్సింగ్‌ టెక్నాలజీ ఫెసిలిటేటెడ్‌ జెండర్‌-బేస్డ్‌ వయొలెన్స్‌ ఇన్‌ ఇండియా’ అన్న ఆ నివేదికలో అధ్యయన వివరాలతో పాటు బాధితులు, నిపుణుల ఇంటర్వ్యూలు కూడా ఉన్నాయి.
వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల నుంచి తస్కరించి వాటితో డీప్‌ఫేక్‌లు సృష్టించడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ వేదికలపై, అశ్లీల వెబ్‌సైట్ల లో పంచుకోవడం, ఒకరిని లక్ష్యంగా చేసుకుని వేర్వేరు వేదికలపై వెంటాడి వేధించడం, ఫేక్‌ ఐడెంటిటీలతో లైంగిక వేధింపులకు పాల్పడటం, స్త్రీలపట్ల ద్వేషాన్నీ, స్త్రీవాదం పట్ల వ్యతిరేకతనీ ప్రచారం చేయడం (మ్యానోస్ఫియర్‌, ఇన్సెల్స్‌)… ఇవన్నీ డిజిటల్‌ వయొలెన్స్‌ రూపాలే.
ఏఐ సాంకేతికతను అడ్డం పెట్టుకుని కీచకులు ఆన్‌లైన్‌లో పేట్రేగిపోతున్నారు. ఐరాస అధ్యయనం ప్రకారం 33 శాతం స్త్రీలు డిజిటల్‌ హింసను ఎదుర్కొంటున్నారు. కులం, వర్గం, వృత్తి, వైకల్యం… లాంటి వాటిని బట్టి ఈ వేధింపుల తీవ్రత పెరగడం గమనార్హం. డిజిటల్‌ హింస అనేది ఒక కామెంట్‌గానో, ఇన్‌బాక్స్‌ మెసేజ్‌లతోనో చిన్నగానే మొదలవుతుంది. అక్కడే దానికి గట్టిగా చెక్‌ పెట్టకపోతే అదే వెంటాడి, వేధించే పెనుముప్పుగా పరిణమిస్తుంది.
ఆన్‌లైన్‌ వేధింపులు వికృతరూపం దాలుస్తున్నాయనడానికి నిదర్శనం బుల్లీసైడ్‌(Cyberbullicide సైబర్‌ బుల్లీయింగ్‌ కారణంగా చోటుచేసుకుంటున్న ఆత్మహత్యలు). ఈ వేధింపులు బాధితుల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక, ఉద్యోగ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపడమే కాదు; భౌతిక, మానసిక ఆరోగ్యాలను హరిస్తున్నాయి. కుంగుబాటుకు లోనై ఆత్మహత్యకు పాల్పడేలా చేస్తున్నాయి. సైబర్‌ బుల్లీయింగ్‌ బాధితుల్లో ఆత్మహత్యల ఆలోచనలు 11.5 శాతం, ఆత్మహత్యా యత్నాలు 8.7 శాతం ఎక్కువని ఓ అధ్యయనం చెబుతోంది. ఫిర్యాదు చేయడమంటే మరోసారి జరిగిందంతా తలచుకుని బాధపడటమేనని, అంతా విని తమనే తప్పుపడుతున్నారని బాధితులు వాపోతున్నారు. ఒకసారి ఆన్‌లైన్‌లోకి ఏదైనా వెళ్తే దాన్ని పూర్తిగా తొలగించడం దాదాపు అసాధ్యం.
పేట్రేగిపోతున్న పోకిరీలు ః ఆధునిక మనిషి అస్తిత్వానికి చిరునామాగా మారింది ఆన్‌లైన్‌ యాక్టివిటీ. టీనేజర్ల నుంచి సీనియర్‌ సిటిజెన్ల వరకు అందరూ స్వేచ్ఛగా ఉపయోగించుకుంటున్న సామాజిక మాధ్యమాలు మహిళలకు మాత్రం పీడకలగా మారుతున్నాయి. వారిని వెంటాడి, వేధించి, జీవనాన్ని దెబ్బతీస్తున్నాయి. సైబర్‌ బుల్లీయింగ్‌ ప్రైవసీని హరిస్తూ, ప్రాణహానిని ప్రేరేపిస్తూ తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది.
ప్రస్తుతం ఉన్న ఐటి రూల్స్‌ ప్రకారం న్యాయవిరుద్ధమైన కంటెంట్‌ను ఫిర్యాదు చేసిన 36 గంటల్లోపల తొలగించాలి. కానీ అందుకు బాధితులతో పాటు పోలీసులు కూడా పోరాటం చేయాల్సి వస్తోంది. ఏఐ టూల్స్‌ దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టెక్నాలజీ సంస్థలదే. అవి స్పందించకపోగా తాత్సారం చేస్తున్నాయని, దాంతో తప్పనిసరిగా చట్టపరంగా వెళ్లాల్సి వస్తోందని, అదేమో ఎక్కువ సమయం తీసుకుంటోందని నివేదిక చెబుతోంది. భారతీయ సైబర్‌ చట్టాల్లోని ఖాళీలనూ ఎత్తిచూపుతోంది నివేదిక. ప్రస్తుతం ఈ కేసులన్నీ ఐటి యాక్ట్‌లోని సెక్షన్లు 66C, 66D, 66E, 67, 67A, 67B, అలాగే భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల ఆధారంగా నమోదవుతున్నాయి.
డిజిటల్‌ వేధింపులను ఎదుర్కొనేవారికి, లేదా అది చూసినవారికి వెంటనే ఎలా స్పందించాలో తెలియదు. అయితే ప్రతి ఒక్కరూ ముందుగా అది తమ తప్పు కాదన్నది గుర్తు
పెట్టుకోవాలి.
వెంటనే బ్లాక్‌చేసి రిపోర్ట్‌ చేయాలి. సాధ్యమైన చోటల్లా ఆ కాంటాక్ట్‌ను తొలగించాలి. అలాగే ’StopNCII.org’ సాయం తో ఆయా చిత్రాలను, వీడియోలను ఆన్‌లైన్‌ నుంచి తొలగించే ప్రయత్నం చేయవచ్చు. తొలగించే ముందే స్క్రీన్‌షాట్లు, లింకులు, టైమ్‌స్టాంప్‌ల రూపంలో సాక్ష్యాలను భద్రపరచుకోవాలి. ఒక్కరే లోలోన ఆందోళన చెందకుండా నమ్మకస్తులతో పంచుకోవాలి. ఆన్‌లైన్‌, సోషల్‌ మీడియా తదితర ఖాతాలన్నింటికీ ట్రూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ పెట్టుకోవాలి.
డిజిటల్‌ అబ్యూజ్‌ మన కళ్లముందు మరొకరికి జరుగుతున్నా మౌనంగా ఉండకూడదు. బాధితులతో పాటు పక్కవారు కూడా ఎదురు తిరిగినప్పుడు సంఘటనలు తగ్గుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దేశవ్యాప్త హెల్ప్‌లైన్‌ (181), నేషనల్‌ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌, మిషన్‌ శక్తి లాంటివి ఈ విషయంలో బాధితులకు అండగా నిలుస్తున్నాయి. లీగల్‌ నోటీసులు పంపడం కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది.
బాధితులు కోరుకునేది… సత్వర స్పందన, సానుభూతి తో సమస్యను వినడం, వారి భద్రతను, గౌరవాన్ని కాపాడే పరిష్కారం. కాబట్టి వేధింపులపై ఫిర్యాదులు వచ్చినప్పుడు పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ భయం ఉంటేనే ఆన్‌లైన్‌ పోకిరీలు జడుస్తారు.
మహిళలు గౌరవంగా, సురక్షితంగా, సంతోషంగా జీవించే హక్కును కాలరాస్తున్న డిజిటల్‌ హింసను కట్టడి చేయడానికి ప్రభుత్వాలు గట్టి సంకల్పంతో ముందుకు రావాలి.

ట్యాగ్‌లు: Women Women power women's safety