Skip to content
జాతీయం వార్తలు

India’s Debt Trap: అప్పుల ఊబిలో కూరుకుపోయిన భారత్.. కొత్త అప్పులతో పాత వడ్డీలు తీర్చుతున్న పరిస్థితి.. భారత ఆర్థిక వ్యవస్థ ముందు ముందు ఎటువైపు.

Prajapaksham 22 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
India’s Debt Trap: అప్పుల ఊబిలో కూరుకుపోయిన భారత్.. కొత్త అప్పులతో పాత వడ్డీలు తీర్చుతున్న పరిస్థితి.. భారత ఆర్థిక వ్యవస్థ ముందు ముందు ఎటువైపు.

India's Debt Trap: అప్పుల ఊబిలో కూరుకుపోయిన భారత్.. కొత్త అప్పులతో పాత వడ్డీలు తీర్చుతున్న పరిస్థితి.. భారత ఆర్థిక వ్యవస్థ ముందు ముందు ఎటువైపు.

India’s Debt Trap: కేంద్రంలోని ప్రభుత్వ ఆర్థిక విధానాలపై రాజ్యసభ సాక్షిగా తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. దేశం రోజురోజుకూ అప్పుల ఊబిలో కూరుకుపోతోందని.. ప్రభుత్వం సేకరిస్తున్న కొత్త రుణాల్లో అత్యధిక భాగం పాత అప్పుల వడ్డీలు కట్టడానికే సరిపోతోందని పార్లమెంట్‌లో వెల్లడైన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించిన సమాధానంలో తాజా అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ సమర్పించిన వివరాల ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా తీసుకున్న రుణాలలో వడ్డీ చెల్లింపుల వాటా 50.9 శాతంగా ఉండేది. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ నిష్పత్తి ఊహించని విధంగా 81.8 శాతానికి పెరిగింది. అంటే నేడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకునే ప్రతి రూ. 100 రుణంలో దాదాపు రూ. 82 కేవలం పాత అప్పులపై వడ్డీల చెల్లింపులకే ఖర్చవుతోంది. దీనివల్ల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు, కొత్త మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం వద్ద రుణ నిధులు చాలా తక్కువ మొత్తంలో అందుబాటులో ఉంటున్నాయని ఎంపీ బ్రిట్టాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

గత ఐదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వ మొత్తం రుణభారం గణనీయంగా పెరిగింది. 2022 మార్చి నాటికి రూ. 138.66 లక్షల కోట్లుగా ఉన్న మొత్తం బకాయిలు, 2026 మార్చి 31 నాటికి రూ. 201.17 లక్షల కోట్ల మైలురాయిని దాటాయి. కేవలం ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే అప్పుల పరిమాణం రూ. 62.5 లక్షల కోట్లు పెరిగింది. అంటే దాదాపు 45 శాతం మేర అప్పులు పెరిగాయి. ప్రస్తుత దేశ జనాభా ప్రాతిపదికన లెక్కవేస్తే.. భారత్‌లోని ప్రతి పౌరుడిపై సగటున రూ. 1.36 లక్షల కేంద్ర ప్రభుత్వ అప్పు భారం పడుతోందని బ్రిట్టాస్ విశ్లేషించారు. దేశంలో 95 శాతానికి పైగా రుణాలు అంతర్గత మార్గాల ద్వారా రూపీ రూపంలోనే సేకరించగా.. విదేశీ రుణం రూ. 9.89 లక్షల కోట్లుగా ఉంది.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను ఖండిస్తూ తమ ఆర్థిక నిర్వహణపై స్పష్టత ఇచ్చింది. తమకు అప్పులు తిరిగి చెల్లించే పూర్తి సామర్థ్యం ఉందని సమర్థించుకుంది. రెవెన్యూ వసూళ్లలో వడ్డీ చెల్లింపుల నిష్పత్తి 2020-21లోని 41.6 శాతం నుండి 2025-26 నాటికి 37.6 శాతానికి తగ్గిందని, ఇది దేశ ఆర్థిక స్థిరత్వానికి నిదర్శనమని తెలిపింది. అలాగే రాబోయే బడ్జెట్ అంచనాల ప్రకారం తాజా ద్రవ్యలోటు రూ. 16.96 లక్షల కోట్ల కంటే ప్రభావవంతమైన మూలధన వ్యయం రూ. 17.15 లక్షల కోట్లు ఎక్కువగా ఉందనడం ద్వారా.. అప్పులన్నీ ఆస్తుల సృష్టికే వాడుతున్నామని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా ద్రవ్యలోటు జీడీపీలో 6.7 శాతం నుండి 4.4 శాతానికి తగ్గిందని పేర్కొంది.

అయితే ప్రభుత్వ సమర్థనను ఎంపీ బ్రిట్టాస్ తీవ్రంగా తప్పుపట్టారు. తాత్కాలిక డేటాను, ఇంకా నెరవేరని బడ్జెట్ అంచనాలతో పోల్చి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కొత్త అప్పుల్లో 81.8 శాతం పాత వడ్డీలకే సరిపోతుంటే, అప్పులన్నీ ఆస్తుల నిర్మాణానికే వాడుతున్నామనడం వాస్తవ దూరం అని విమర్శించారు. జీడీపీ గణనలో 2022-23 నుండి కొత్త శ్రేణిని ఉపయోగిస్తున్నందున, పాత సంవత్సరాలతో పోల్చి ద్రవ్యలోటు తగ్గిందని చెప్పడం గణాంకపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న ఈ రుణ భారం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి తెస్తోందని హెచ్చరించారు.