Skip to content
జాతీయం వార్తలు

మందు బాబులకు బిగ్ అలర్ట్.. రాయల్ ఛాలెంజ్, ఓల్డ్ మాంక్‌, యాంటిక్విటీ బ్లూ, బాగ్‌పైపర్ మద్యం బ్యాన్

Prajapaksham 10 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
మందు బాబులకు బిగ్ అలర్ట్.. రాయల్ ఛాలెంజ్, ఓల్డ్ మాంక్‌, యాంటిక్విటీ బ్లూ, బాగ్‌పైపర్ మద్యం బ్యాన్

FSSAI

భారత మద్యం మార్కెట్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ ప్రముఖ మద్యం తయారీ దిగ్గజం డయాజియో ఇండియా (యునైటెడ్ స్పిరిట్స్) తో పాటు పలు ప్రముఖ మద్యం సంస్థలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) విరుచుకుపడింది. నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారులను పక్కదోవ పట్టించే లేబులింగ్, కృత్రిమ ఫ్లేవర్ల వాడకం, నాణ్యతా ప్రమాణాల ఉల్లంఘన, సురక్షితం కాని ప్యాకేజింగ్ బాటిళ్ల వినియోగంపై రెగ్యులేటరీ సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే ప్రముఖ విస్కీ బ్రాండ్ రాయల్ ఛాలెంజ్ లేబుల్‌పై దానిని అమెరికన్ ఓక్ కాస్క్ లలో మెచ్యూరేషన్ (పరిపక్వత) చేసినట్లు కంపెనీ ప్రచారం చేసుకుంటోంది. అయితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిర్వహించిన లోతైన విచారణలో అసలు నిజాలు బయటపడ్డాయి. ఈ విస్కీలో సింహభాగం ప్రాసెస్ చేయని నాన్-మెచ్యూర్డ్ గ్రెయిన్ న్యూట్రల్ స్పిరిట్, డిమినరలైజ్డ్ నీరు మాత్రమే ఉన్నాయని అధికారులు తేల్చారు.

నాణ్యమైన చెక్క పీపాల్లో పూర్తిగా మెచ్యూర్ చేయకుండానే.. అలా చేసినట్లు ప్రకటనలు ఇవ్వడం వినియోగదారులను నిలువునా పక్కదోవ పట్టించడమేనని నివేదికలో స్పష్టం చేశారు. అంతేకాకుండా, బ్లెండెడ్ ఆల్కహాల్‌పై వయస్సు (Aging) నమోదు చేసే సమయంలో.. ఆ మిశ్రమంలో వాడిన అత్యల్ప వయసు ఉన్న స్పిరిట్‌నే ప్రామాణికంగా తీసుకోవాలనే కీలక నియమాన్ని కూడా కంపెనీ గాలికి వదిలేసిందని వెల్లడైంది.

సాధారణంగా మద్యం తయారీలో సహజ సిద్ధమైన మాల్ట్ లేదా మోలాసెస్ ప్రక్రియ ద్వారా సహజమైన రుచి, సువాసనలను రప్పిస్తారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా విస్కీలో కృత్రిమ విస్కీ ఫ్లేవర్, రమ్‌లో కృత్రిమ రమ్ ఫ్లేవర్ నేరుగా కలపడం అంతర్జాతీయ తయారీ విధానాలకు పూర్తి వ్యతిరేకమని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తేల్చిచెప్పింది. సహజమైన పరిపక్వత ప్రక్రియను దాటవేసేందుకు ఇటువంటి కృత్రిమ సువాసనలను ఉపయోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ బ్లూ, బాగ్‌పైపర్, ఓల్డ్ మాంక్ వంటి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్లలోని నిర్దిష్ట బ్యాచ్‌ల విక్రయాలపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆంక్షలు విధించింది.

మరోవైపు ప్యాకేజింగ్ ప్రమాణాల విషయంలోనూ తీవ్రమైన లోపాలను అధికారులు కనుగొన్నారు. భద్రతా గుర్తింపులు, అనుమతులు లేని రీసైకిల్డ్ ప్లాస్టిక్ సీసాలలో మద్యాన్ని నింపి సరఫరా చేస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో బెంగళూరులోని తయారీ కేంద్రంలో సుమారు 18 వేల బాక్సుల పరిమాణంలో ఉన్న ప్లాస్టిక్ సీసాల నిల్వలను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు తక్షణమే సీజ్/క్వారంటైన్ చేశారు.

ఈ చర్యల ద్వారా దేశీయ మద్యం పరిశ్రమలోని ఇతర కంపెనీలకు కూడా స్పష్టమైన హెచ్చరికలు పంపినట్లయింది. వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, తప్పుడు లేబుళ్లతో మార్కెట్ చేస్తున్న బ్రాండ్లపై రానున్న రోజుల్లో కూడా ఇటువంటి కఠిన తనిఖీలు కొనసాగుతాయని ఆహార భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి.