చరిత్ర పునరావృతం కాకూడదు..బిల్లులు ప్రవేశ పెట్టేందుకు బీజేపీ వ్యూహం ఇదే అంటున్న జైరాం రమేష్
చరిత్ర పునరావృతం కాకూడదు
పార్లమెంట్లో కేంద్రం కీలక బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం
2023 నాటి 146 మంది ఎంపిల సస్పెన్షన్‌ను గుర్తు చేసిన జైరామ్ రమేశ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా 2023లో అపూర్వమైన రీతిలో 146 మంది ఎంపిలను సస్పెండ్ చేయడం, స్వల్ప వ్యతిరేకతతో అనేక కీలక చట్టాలను ఆమోదించడం వంటి విషయాలను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ఆదివారం గుర్తుచేసుకున్నారు.
చరిత్ర పునరావృతం కాకూడదు అని ఆయన ఉద్ఘాటించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి వారానికి ముందు ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈ సమావేశాల్లో విదేశీ విరాళాల (నియంత్రణ) సవరణ బిల్లు, 2026తో సహా పలు కీలక చట్టాలను చేపట్టే అవకాశం ఉంది.
‘2023 డిసెంబర్ 13న, పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకి, నినాదాలు చేస్తూ, క్యాన్ల నుండి పసుపు పొగను విడుదల చేసినట్లు ఎక్స్‌లో జైరామ్ రమేశ్ పోస్టు చేశారు. అదే సమయంలో మరో ఇద్దరు బయట రంగు పొగ క్యాన్లను పేల్చారని, ఇది భద్రతకు జరిగిన దిగ్భ్రాంతికరమైన, తీవ్రమైన ఉల్లంఘన అని అన్నారు.
‘ప్రతిపక్షమంతా కేంద్ర హోం మంత్రి నుంచి ఒక ప్రకటన కోసం పదేపదే డిమాండ్ చేసింది. కానీ ఏ ప్రకటన రాలేదు. గత నెలలో నిరసన చేస్తున్న యువతపై ఢిల్లీ పోలీసులు జరిపిన దారుణాలపై ఇప్పుడు మౌనం వహిస్తున్నట్లే అప్పుడు కూడా ఆయన మౌనం వహించారు’ అని అన్నారు.
2023 డిసెంబర్ 14 నుంచి 2023 డిసెంబర్ 21 మధ్య, అపూర్వమైన రీతిలో 146 మంది ఎంపిలను లోక్‌సభలో 100 మందిని, రాజ్యసభలో 46 మందిని సస్పెండ్ చేశారని ఆయన ఎత్తి చూపారు. ఈ రికార్డు స్థాయి సస్పెన్షన్ల తర్వాత, మిగిలిన సమావేశాల్లో ప్రతిపక్షాల హాజరు నామమాత్రంగానే ఉన్నప్పటికీ, పార్లమెంట్ అనేక ముఖ్యమైన చట్టాలను ఆమోదించిందని ఆ కాంగ్రెస్ నాయకుడు అన్నారు.
డిసెంబర్ 20న లోక్‌సభలో, డిసెంబర్ 21న రాజ్యసభలో మూడు క్రిమినల్ చట్ట సంస్కరణల బిల్లులు ఆమోదం పొందాయని మరికొన్ని ఉదాహరణలను ఆయన పేర్కొన్నారు. 1860 నాటి భారత శిక్షా స్మృతి స్థానంలో 2023 నాటి భారతీయ న్యాయ సంహిత వచ్చింది; 1973 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో 2023 భారతీయ నాగరిక్ సురక్షా సంహిత వచ్చిందని; భారత సాక్ష్య చట్టం స్థానంలో 2023 భారతీయ సాక్ష్య అధినియమ్ వచ్చిందని రమేశ్ పేర్కొన్నారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల (నియామకం, సేవా నిబంధనలు, పదవీకాలం) బిల్లు ఆమోదం పొందిందని కూడా ఆయన గుర్తు చేశారు. అయితే ఇలాంటి చరిత్ర పునరావృతం కాకూడదని మాజీ కేంద్ర మంత్రి నొక్కి చెప్పారు.
అత్యంత కీలకమైన అంశాలపై చర్చ జరగనున్నందున ఈనెల 10, 11, 12 తేదీలలో లోక్‌సభ, రాజ్యసభల్లోని తమ ఎంపిలు తప్పనిసరిగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు విప్ జారీ చేసింది. ఈ మూడు రోజులూ తమ ఎంపిలు సభకు హాజరయ్యేలా చూడాలని ప్రతిపక్ష పార్టీ ఇండియా కూటమి మిత్రపక్షాలకు కూడా సూచించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
వచ్చే వారం పార్లమెంటులో వివాదాస్పద ఎస్సిఆర్ఎ బిల్లుపై చర్చ, ఆమోదం జరగనున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ విప్ జారీ చేశారు. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్న చర్చ జరుగుతోంది.