Skip to content
జాతీయం వార్తలు

Bankipur Bypoll Result: బద్దలవబోతున్న బీజేపీ కంచుకోట.. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ దూకుడు.. మంజల్‌పూర్‌లో బీజేపీ, దతియాలో కాంగ్రెస్ ముందంజ

Prajapaksham 03 Aug 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Bankipur Bypoll Result: బద్దలవబోతున్న బీజేపీ కంచుకోట.. బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో ప్రశాంత్ కిషోర్ దూకుడు.. మంజల్‌పూర్‌లో బీజేపీ, దతియాలో కాంగ్రెస్ ముందంజ

Prashant Kishor and modi

Bankipur Bypoll Result: దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంటోంది. ప్రధానంగా బీహార్‌లోని బంకిపూర్, గుజరాత్‌లోని మంజల్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని దతియా నియోజకవర్గాల్లో నమోదవుతున్న తాజా ఫలితాలు దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

బీహార్‌లోని పట్నా పరిధిలోని ప్రతిష్టాత్మక బంకిపూర్ అసెంబ్లీ స్థానంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలుగా బీజేపీకి అభేద్యమైన కంచుకోటగా ఉంటూ వస్తున్న ఈ నియోజకవర్గంలో.. తొలిసారిగా నేరుగా ఎన్నికల బరిలోకి దిగిన జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ భారీ విజయం దిశగా దూసుకుపోతున్నారు.

14 విడతల ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ఏకంగా 7,700 ఓట్లకు పైగా ఆధిక్యంలో నిలిచారు. 1995 నుండి ఈ స్థానంలో గెలుస్తూ వస్తున్న బీజేపీకి ఇది తీవ్ర భంగపాటుగా పరిగణించబడుతోంది. ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం స్థిరంగా పెరుగుతుండటంతో పాట్నాలోని జన్ సూరజ్ ప్రధాన కార్యాలయం వద్ద కార్యకర్తలు, మద్దతుదారులు అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంటున్నారు.

గుజరాత్‌లోని మంజల్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార భారతీయ జనతా పార్టీ తన హవాను స్పష్టంగా ప్రదర్శిస్తోంది. 12వ విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి సతీష్ గోవింద్‌భాయ్ పటేల్ మొత్తం 34,345 ఓట్లు సాధించి, తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి భిఖాభాయ్ రబారీపై 19,368 ఓట్ల భారీ ఆధిక్యంతోతిరుగులేని ముందంజలో ఉన్నారు. ఈ సీటులో బీజేపీ సునాయాస విజయం సాధించడం దాదాపు ఖాయమైపోయింది.

మధ్యప్రదేశ్‌లోని దతియా అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు రౌండ్ రౌండ్‌కూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆధిక్యాలు పలుమార్లు చేతులు మారిన అనంతరం.. 15వ విడత లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కున్వర్ ఘనశ్యామ్ సింగ్ (25,856 ఓట్లు) తన సమీప ప్రత్యర్థి, బీజేపీకి చెందిన అశుతోష్ తివారీపై 1,786 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు.

ఈ ఉప ఎన్నికల ట్రెండ్స్ పరిశీలిస్తే.. బీహార్‌లో సాంప్రదాయ రాజకీయ సమీకరణాలను తలకిందులు చేస్తూ ప్రశాంత్ కిషోర్ సాధిస్తున్న ఆధిక్యం సరికొత్త రాజకీయ మార్పుకు సంకేతంగా నిలుస్తుండగా.. గుజరాత్‌లో బీజేపీ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ తమ బలాన్ని నిరూపించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.