అమిత్ షా ఎప్పటికైనా సమాధానం చెప్పాల్సిందే: రాహుల్ గాంధీ
rahul gandhi vs amit shah
‘పార్లమెంట్ మార్చ్’ సందర్భంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల అమానుష చర్యపై హోం మంత్రి అమిత్ షా మౌనాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోమారు ప్రశ్నించారు. ఈ నేరానికి సంబంధించి ఎప్పటికైనా మంత్రి సమాధానం చెప్పక తప్పదని స్పష్టం చేశారు.
శనివారం ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ‘ఛాత్రో కి గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో ఒక విద్యార్థి తనకు ఇక ఏ మార్గమూ మిగలలేదని చెప్పారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఏళ్ల తరబడి సన్నద్ధత, కుటుంబానికి చెందిన భూమి అమ్మకం, తల్లిదండ్రులపై అప్పుల భారం… అయినా చివరకు చేతికి దక్కింది ఏమీ లేదు అని ఆ విద్యార్థి తన గోడును వెల్లబోసుకున్నాడని రాహుల్ గాంధీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఇది ఆ విద్యార్థి వైఫల్యం కాదు, అతని కష్టానికి తగిన గుర్తింపునివ్వని వ్యవస్థ వైఫల్యం అని లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ఉద్ఘాటించారు. పేపర్ లీక్ వ్యవహారంపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనను విరమించి చాలా రోజులు గడిచినా, వారిపై ఢిల్లీ పోలీసులు తీసుకున్న చర్యల గురించి షా నుండి ఒక్క మాట కూడా రాలేదని మండిపడ్డారు. క్షమాపణ చెప్పడానికి బదులుగా, మోదీజీ క్షమను ప్రసాదించడంలో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.
‘అమిత్ షా గారూ, మేము బాధ్యతను ప్రశ్నించడం ఆపేస్తామని ఒక్క క్షణం కూడా అనుకోవద్దు. రాజధాని వీధుల్లో యువతపై లాఠీలు, పెల్లెట్ గన్లు ప్రయోగించారు. అయినా మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈ నేరానికి సంబంధించి ఎప్పటికైనా మీరు సమాధానం చెప్పక తప్పదు’ అని రాహుల్ గాంధీ హెచ్చరించారు.
విద్యార్థులే దేశానికి వెలుగు అని పేర్కొన్న కాంగ్రెస్ అగ్ర నేత, వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పేపర్ లీక్ వ్యవహారంపై జులై 20న విద్యార్థులు చేసిన నిరసన సమయంలో పోలీసుల దౌర్జన్యాలపై హోం మంత్రి షా ఉభయ సభల్లోనూ ప్రకటన చేయాలన్న ప్రతిపక్షం డిమాండ్ కారణంగా పార్లమెంటు ఉభయ సభలలోనూ స్తంభన కొనసాగుతోంది. సభలో గందరగోళం మధ్యే చాలా వరకు శాసనపరమైన కార్యకలాపాలు జరిగాయి.
పోలీసుల చర్యపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గత వారం అమిత్ షాపై తీవ్ర విమర్శలు చేశారు. సభలో మాట్లాడాలని చైర్మన్ సి.పి. రాధాకృష్ణన్ సూచించినప్పటికీ, హోం మంత్రి రాజ్యసభకు రాలేదని ఆయన పేర్కొన్నారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై ఇటీవల జరిగిన పోలీసు చర్యకు సంబంధించి షా సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఏ మంత్రి సభకు వచ్చి తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలో ప్రతిపక్షాలు నిర్దేశించలేవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో అన్నారు.
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..
- Strait of Hormuz Attack: హార్ముజ్ జలసంధిలో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు..
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!
- సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..
- Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో తగ్గుతున్న ఆక్సిజన్.. విశాఖ-కాకినాడ తీరాలకు ఎదురుగా ‘డెడ్ జోన్’.. కనుమరుగవుతున్న చేపలు..