Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

మానేరు తీరపు సాహిత్య చైతన్యం గూడూరి సీతారాం

Prajapaksham 10 Aug 2026 0 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
మానేరు తీరపు సాహిత్య చైతన్యం గూడూరి సీతారాం

Guduri Sitaram: The Literary Spirit of the Manair Riverbank

ఏవి. సుధాకర్‌

తెలంగాణ సాహిత్య క్షేత్రంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న తొలితరం కథారచయితలలో గూడూరి సీతారాం అగ్రగణ్యులు. 1950ల కాలంలో గ్రాంధిక భాషా ప్రాభవం, శైలి బలంగా ఉన్న రోజుల్లోనే, ఆయన సామాన్యుల వాడుక భాషకు, ముఖ్యంగా తెలంగాణ మాండలికానికి కథల్లో పట్టం కట్టారు. ప్రస్తుత రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేటలో 18 జులై 1936లో జన్మించిన సీతారాం, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డికి బాల్యమిత్రుడు. కేవలం కథకుడిగానే కాకుండా మానేరు రచయితల సంఘ స్థాపకుడిగా, సాహిత్య ఉద్యమకారుడిగా తెలంగాణ అస్తిత్వాన్ని, గ్రామీణ జీవితాన్ని తన రచనల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు.
గూడూరి సీతారాం కథల ప్రధాన బలం వాటిలోని సజీవమైన భాష. నిత్య జీవితంలో పల్లె ప్రజలు మాట్లాడుకునే నిఖ్సాన తెలంగాణ యాసను, నుడికారాలను ఆయన కథా వస్తువుగా మార్చుకున్నారు. అప్పటివరకు సాహిత్యానికి దూరం అనుకున్న భాషతోనే అద్భుతమైన భావవ్యక్తీకరణ చేయవచ్చని నిరూపించారు. 1953 నుండి 1965 మధ్య కాలంలో ఆయన సుమారు 80కథల వరకు రాశారు. ఆయన రాసిన ‘లచ్చి‘, ‘నారిగాని బతుకు‘, ‘రంగడు‘, ‘రాజమ్మ రాజరికం‘, ‘మారాజు‘ వంటి కథలు గ్రామీణ సమాజంలోని వర్గ వైరుధ్యాలను, అమాయకత్వాన్ని, పీడిత ప్రజల వేదనలను కళ్ళకు కట్టినట్లు చూపుతాయి. ఆయన రాసిన కథల్లో 1957 నాటి ‘లచ్చి‘ కథ ఎంతో ప్రసిద్ధి చెందింది. గ్రామాల్లో జీవనోపాధి కరువై, బతుకు దెరువు కోసం పల్లె ప్రజలు పట్టణాలకు వలస వెళ్ళడం అనివార్యమౌతున్న సామాజిక నేపథ్యాన్ని ఈ కథ అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. పల్లెల్లోని వ్యవసాయ సంక్షోభం, దొరల భూ స్వామ్య వ్యవస్థలో నలిగిపోయిన సామాన్యుల జీవితాలను ఆయన నిశితంగా పరిశీలించి విశ్లేషించారు. సీతారాం గారి కథలు నాటి తెలంగాణ సామాజిక, ఆర్థిక చరిత్రను నిక్షిప్తం చేసిన సజీవ పత్రాలు.
సీతారాం కథల్లో కేవలం కన్నీళ్లే కాకుండా, వ్యవస్థపై తిరుగుబాటు, ఆత్మగౌరవ పోరాటాలు కూడా కనిపిస్తాయి. ‘రాజమ్మ రాజరికం’ వంటి కథల ద్వారా నాటి సామాజికాధికార ముఖచిత్రాన్ని ఎండగట్టారు. సమాజంలో వెనుకబడిన, బహుజన వర్గాల ప్రజల కష్టాలను వారి కోణంలోంచే చూస్తూ కథలు రాయడం ఆయన ప్రత్యేకత. ఆయన పాత్రలు చాలా సహజంగా ఉంటూ, తమ హక్కుల కోసం లేదా కనీస బతుకు దెరువు కోసం పోరాడే శ్రమజీవులుగా దర్శనమిస్తాయి. ఈ మానవీయ కోణ మే ఆయన కథలను సార్వజనీనం చేసింది.
గూడూరి సీతారాం గారిని కేవలం ఒక కథకుడి గా మాత్రమే చూస్తే వారి వ్యక్తిత్వంలోని ఒక ప్రధాన కోణాన్ని వదిలేసినట్లవుతుంది. నాటి కరీంనగర్‌ జిల్లాలో సాహిత్య చైతన్యాన్ని రగిలించడానికి ఆయన ’మానేరు రచయితల సంఘం’ (మారసం) స్థాపనలో కీలక పాత్ర పోషించి, ఒక ఉద్యమకర్తగా నిలిచారు. అప్పటికే ప్రాంతీయ వివక్షకు గురవుతున్న తెలంగాణ సాహిత్య ఉనికిని చాటడానికి, నూతన తరం రచయితలను ప్రోత్సహించడానికి ఈ వేదికను ఒక ఆయుధంగా మలిచారు. జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ సి. నారాయణరెడ్డి లాంటి మహామహులతో కలిసి సాహిత్య చర్చ లు జరుపుతూనే, గ్రామీణ ప్రాంతాల్లోని అజ్ఞా త కవులను, రచయితలను వెలుగులోకి తెచ్చేందుకు ఆయన చేసిన సంస్థాగత కృషి తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ‘నా చుట్టూ ఉన్న సంఘటనలు, నేను అనుభవించిన పల్లె బతుకు, పీడిత నేపథ్యమే నన్ను రచయితను చేశాయి‘ అని ఆయన స్వయంగా పేర్కొనడం, ఆయన రచనల వెనుక ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.
ఆయన రాసిన వ్యాసాల సంకలనం ‘కానుగు చెట్టు‘, అలాగే ‘గూడూరి సీతారాం కథలు’ పుస్తకాలు నేటి తరం పరిశోధకులకు, పాఠకులకు తెలంగాణ అస్తిత్వ చేతనను అందిస్తున్నాయి. మరుగున పడిపోతున్న ఎందరో తెలంగాణ రచయితలను ప్రోత్సహించి, వారి రచనలను వెలుగులోకి తేవడానికి ఆయన నిరంతరం తపించారు. ఆడంబరాలకు దూరంగా ఉంటూ తెలుగు కథా సాహిత్యానికి ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యం. తెలంగాణ కథా శిల్పంలో గూడూరి సీతారాం గారు చెరిపేయలేని ఒక మహోన్నత శిఖరం.