రూ.90 లక్షల ఇంటి అప్పులు.. ఇద్దరు పిల్లల్ని అనాధలుగా చేస్తూ దంపతులు ఆత్మహత్య..
Couple Takes Extreme Step Amid Rs 90 Lakh Housing Loan Burden
ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారం తట్టుకోలేక ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటన రెండు పసికందులను అనాథలుగా మార్చేసి.. స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నాలుగో టౌన్ ఎస్‌హెచ్‌వో (SHO) సతీష్ తెలిపిన వివరాల ప్రకారం ఈ విషాదకర సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
నిజామాబాద్‌లోని కోటగల్లికి చెందిన శేషాల నరేశ్ (33) విద్యుత్ శాఖలో బిల్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి 2014లో మేఘన (30)తో వివాహమైంది. వీరికి ఆయాన్ష (9), మిథున్ (6) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. నరేశ్ గతేడాది రూ. 90 లక్షల వ్యయంతో ఒక ఇల్లు కొనుగోలు చేశాడు. అయితే దానికి సంబంధించి హోమ్ లోన్ పొందేందుకు ప్రయత్నించగా రుణం మంజూరు కాలేదు. దీంతో చేసిన అప్పులు రోజురోజుకూ పెరిగిపోవడంతో.. గత్యంతరం లేక ఆ ఇంటిని అమ్మేశాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి వినాయక్‌నగర్‌లోని పంచముఖి హనుమాన్ ఆలయం సమీపంలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.
ఇంటి కోసం చేసిన అప్పుల భారం రోజురోజుకూ పెరిగిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన నరేశ్.. మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. భర్త ఆత్మహత్యతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన భార్య మేఘన కూడా వెంటనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
ఉదయం 10.30 గంటల సమయంలో మేఘనకు ఆమె తల్లి లావణ్య ఫోన్ చేయగా.. మేఘన సరిగా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి తన భర్త మోహన్‌కు సమాచారం అందించింది. దీంతో ఆయన హుటాహుటిన వినాయక్‌నగర్‌లోని వారి ఇంటికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు వీలులేకపోవడంతో కిటికీ చువ్వలను తొలగించి లోపలికి వెళ్లి చూడగా.. మేఘన పురుగుల మందు సేవించి పడిపోయి ఉంది, నరేశ్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. వెంటనే నరేశ్‌ను ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలించగా నరేశ్ రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది. భార్యాభర్తల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.. ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేకపోతున్నాం, తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాం అని అందులో రాసి ఉంది. మృతురాలి తండ్రి మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి కన్నుమూయడంతో ఆ తొమ్మిదేళ్ల పాప, ఆరేళ్ల బాబు అనాథలుగా మిగిలిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!
- సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..
- Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో తగ్గుతున్న ఆక్సిజన్.. విశాఖ-కాకినాడ తీరాలకు ఎదురుగా ‘డెడ్ జోన్’.. కనుమరుగవుతున్న చేపలు..
- CEC Resignation Row: జ్ఞానేశ్ రాజీనామా వరకు కదలను.. ఢిల్లీ రోడ్డుపైనే బైఠాయించిన రాహుల్
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
గమనిక: మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా తీవ్రమైన నిరాశ, మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.