Hyderabad: ఏసీపీ కార్యాలయంలో కానిస్టేబుల్ ఆత్మహత్య.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు..
Constable commits suicide at LB Nagar Police Station
Hyderabad: హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో చోటుచేసుకున్న కానిస్టేబుల్ ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి విధుల్లో ఉన్న కానిస్టేబుల్ జె.సాయి కుమార్ తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో ఎల్బీనగర్ ఏసీపీ (ACP) కార్యాలయంలోని రెస్ట్ రూమ్‌లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
తోటి సిబ్బంది సాయి కుమార్‌ను ఉరివేసుకుని ఉండటాన్ని గమనించి.. వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని కామినేని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తరలించే మార్గంలోనే ఆయన మృతి చెందినట్లు పరీక్షించిన వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
మృతుడు సాయి కుమార్ 2024 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్. ప్రస్తుతం ఆయన ఈ-కాప్స్ (e-Cops) డ్యూటీ నిమిత్తం ఎల్బీనగర్ ఏసీపీ కార్యాలయానికి అటాచ్ అయి విధులు నిర్వహిస్తున్నారు. సాయి కుమార్ తన స్నేహితులతో కలిసి కర్మన్‌ఘాట్ ప్రాంతంలో ఒక గదిలో నివాసముంటున్నారు. విధి నిర్వహణలో ఉండగానే ఆయన ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం తోటి పోలీసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఈ ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ వేగవంతం చేశారు. సాయి కుమార్ ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు విషయం తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. సాయి కుమార్ మృతికి గల కారణాలను వెంటనే వెల్లడించాలని, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!
- సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..
- Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో తగ్గుతున్న ఆక్సిజన్.. విశాఖ-కాకినాడ తీరాలకు ఎదురుగా ‘డెడ్ జోన్’.. కనుమరుగవుతున్న చేపలు..
- CEC Resignation Row: జ్ఞానేశ్ రాజీనామా వరకు కదలను.. ఢిల్లీ రోడ్డుపైనే బైఠాయించిన రాహుల్
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే
గమనిక: మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా తీవ్రమైన నిరాశ, మానసిక ఒత్తిడి లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉంటే, వెంటనే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించడం చాలా ముఖ్యం.