N Chandrasekaran Resigns: చంద్రశేఖరన్ రాజీనామాకు కారణం అదే.. ఆరు నెలల నుంచే టాటా సన్స్ గ్రూపులో ఘర్షణలు..
N Chandrasekaran Resigns
N Chandrasekaran Resigns: దేశీయ కార్పొరేట్ దిగ్గజ సంస్థ టాటా సన్స్ (Tata Sons) గ్రూపులో తీవ్ర సంచలనం చోటుచేసుకుంది. గత తొమ్మిదేళ్లుగా టాటా గ్రూప్‌ను తిరుగులేని శక్తిగా ముందుకు నడిపిస్తున్న ఎన్. చంద్రశేఖరన్ (63) తన ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆగస్టు 18, 2026న జరగనున్న కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశానికి (AGM) కేవలం కొన్ని రోజుల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే 2027 ఫిబ్రవరి 20తో ముగిసే తన ప్రస్తుత పదవీకాలం వరకు బాధ్యతల్లో కొనసాగుతానని.. తదుపరి వారసుడి ఎంపిక ప్రక్రియ సజావుగా సాగేందుకు బోర్డుకు సహకరిస్తానని ఆయన ప్రకటించారు.
సారథ్య బాధ్యతల పొడిగింపు, భవిష్యత్ వ్యూహాలపై టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటాతో వచ్చిన తీవ్ర విభేదాలే ఈ రాజీనామాకు ప్రధాన కారణమని కథనాలు వెల్లడిస్తున్నాయి. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్‌లు ఏకగ్రీవంగా సిఫార్సు చేశాయి. అయితే 2026 ఫిబ్రవరి 24న జరిగిన టాటా సన్స్ బోర్డు సమావేశంలో నోయెల్ టాటా దీనిని వ్యతిరేకించడంతో ఏకాభిప్రాయం కుదరలేదు. టాటా సన్స్‌ను ఎప్పటికీ స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయకూడదనే షరతుకు చంద్రశేఖరన్ అంగీకరించకపోవడం.. బోర్డులో ప్రాతినిధ్యంపై వచ్చిన ఘర్షణల వల్ల ఆ సమావేశం జరిగి ఆరు నెలలు గడిచినా ఎటువంటి పరిష్కారం లభించలేదు.
తన రాజీనామాపై బుధవారం ఉదయం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో చంద్రశేఖరన్ మాట్లాడుతూ.. టాటా గ్రూప్‌లో 40 ఏళ్ల సుదీర్ఘ వృత్తి జీవితాన్ని పూర్తి చేసుకున్నాను. బోర్డు సమావేశం జరిగి ఆరు నెలలు దాటినా పునఃనియామకంపై స్పష్టత రాలేదు. అనేక కీలక వ్యూహాత్మక ప్రాజెక్టులు అమలులో ఉన్న సమయంలో ఉద్యోగులు, పెట్టుబడిదారులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా నాయకత్వంపై ముందస్తు స్పష్టత ఉండటం చాలా ముఖ్యం. అందుకే నా పేరును పరిగణనలోకి తీసుకోవద్దని కోరుతూ వైదొలగుతున్నానని స్పష్టం చేశారు.
ఈ అనూహ్య వార్తతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా విలవిలలాడాయి. ఉదయం వ్యాపార వేళల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) షేరు గరిష్టంగా 4.5% పడిపోగా, టాటా స్టీల్, టాటా పవర్, టైటాన్, టాటా మోటార్స్ షేర్లు 2% నుండి 4% వరకు తీవ్ర నష్టాలను మూటగట్టుకున్నాయి. 2016లో రతన్ టాటాతో వచ్చిన విభేదాల కారణంగా సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి తొలగించిన తీవ్ర సంక్షోభం తర్వాత.. మళ్లీ ఇప్పుడు టాటా సన్స్, టాటా ట్రస్ట్స్‌ల మధ్య విభేదాలు రచ్చకెక్కడం కార్పొరేట్ నిపుణులలో చర్చనీయాంశమైంది. కొత్త ఛైర్మన్ ఎంపిక కోసం టాటా సన్స్ బోర్డు త్వరలోనే ఒక ప్రత్యేక సెలెక్షన్ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
- US Measles Outbreak: అమెరికాలో మీజిల్స్ కలకలం.. మూడు దశాబ్దాల తర్వాత మళ్లీ 3,900కు చేరువైన కేసులు!
- సీపీఐ నేత గుజ్జుల ఈశ్వరయ్యను పరామర్శించిన సీపీఐ, బీఆర్ఎస్ నేతలు.. ప్రజా జీవితంలో మళ్లీ చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్ష..
- Bay of Bengal Dead Zone: బంగాళాఖాతంలో తగ్గుతున్న ఆక్సిజన్.. విశాఖ-కాకినాడ తీరాలకు ఎదురుగా ‘డెడ్ జోన్’.. కనుమరుగవుతున్న చేపలు..
- CEC Resignation Row: జ్ఞానేశ్ రాజీనామా వరకు కదలను.. ఢిల్లీ రోడ్డుపైనే బైఠాయించిన రాహుల్
- CJP Protest: ఒకే దేశం, ఒకే ఎన్నిక’ నినాదం వెనుక పెద్ద కుట్ర ఉంది.. కేంద్రంపై విరుచుకుపడిన సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే