JC Prabhakar Reddy: వినకపోతే మీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమే.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వీడియో వైరల్..
JC Prabhakar Reddy
JC Prabhakar Reddy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనదైన శైలితో గుర్తింపు పొందిన టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. పట్టణంలో జటిలంగా మారిన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆయన ఎవరూ ఊహించని రీతిలో వినూత్నంగా రంగంలోకి దిగారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోని వ్యాపారులకు స్వయంగా పూలదండలు వేసి, స్వీట్లు తినిపిస్తూ తనదైన శైలిలో గాంధీగిరి ప్రదర్శించారు.
తాడిపత్రిలోని ముఖ్యమైన రోడ్ల పక్కన, దుకాణాల ముందు ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడంతో రాకపోకలకు తీవ్ర విఘాతం కలుగుతోందని జేసీ ప్రభాకర్ రెడ్డి దృష్టికి వచ్చింది. ఈ విషయమై గతంలోనే ఆయన పలుమార్లు వ్యాపారులకు, వాహనదారులకు అవగాహన కల్పించారు. అయినా కూడా కొందరి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆయనే నేరుగా రోడ్డుపైకి వచ్చారు.
పుట్లూరు రోడ్డులో పర్యటిస్తున్న సమయంలో కొన్ని షాపుల ముందు రోడ్డుకు అడ్డంగా బైక్‌లు పార్క్ చేసి ఉండటాన్ని గమనించిన ఆయన.. సదరు దుకాణదారుల వద్దకు వెళ్లి ప్రేమగా పూలదండలు వేసి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిట్టి, కొట్టి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అందుకే ప్రేమగా ఇలా దండలు వేసి స్వీట్లు ఇచ్చాను. దయచేసి పరిస్థితిని అర్థం చేసుకుని ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సహకరించండి. వినకపోతే మీ కాళ్లు పట్టుకోవడానికైనా సిద్ధమే” అని వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ గాంధీగిరి తర్వాత కూడా తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. “ఇంత చెప్పినా మారకపోతే, నేనే స్వయంగా వచ్చి మీ షాపులకు తాళాలు వేస్తాను” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి కొనసాగుతుండగా, తండ్రీకొడుకులిద్దరూ నిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రదర్శించిన ఈ వినూత్న నిరసన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- వైసీపీకి బిగ్ షాక్.. బొత్స మేనల్లుడు చిన్న శ్రీను రాజీనామా
- Telangana Political Row: కేటీఆర్,హరీష్ రావు విడుదల.. రేవంత్ సర్కారుపై ధ్వజమెత్తిన బీఆర్ఎస్ నేతలు..
- Telangana Assembly Session: బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిలకు ఊరట.. రిమాండ్‌ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు!
- Saudi Arabia’s Water Miracle: నదులు లేకపోయినా కోట్ల మందికి మంచి నీరు ఎలా.. సౌదీ అరేబియా వాటర్ సప్లై వెనుక అసలు రహస్యం..
- Eiffel Tower: ఈఫిల్ టవర్ వద్ద లింగ వివక్ష వివాదం.. మహిళా ఉద్యోగులను పక్కకు తప్పించడంపై సిబ్బంది ఆగ్రహం..