డీలిమిటేషన్ బిల్లు మహిళా రిజర్వేషన్ కోసమేనా?
Parliament
2023లో పార్లమెంటు ఆమోదించిన ‘చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్ చట్టం’ అమలు చేయాలంటే లోక్‌సభ, అసెంబ్లీల సీట్లను 50 శాతం పెంచటం అవసరమా? అదేమైనా రాజ్యాంగం లేదా ఏదైనా చట్టం ఆదేశమా? కాదే. అటువంటప్పుడు మోడీ-షా ద్వయం మహిళా బిల్లును సీట్ల సంఖ్య పెంపు, తదనుగుణంగా డీలిమిటేషన్ (నియోజకవర్గాల హద్దుల పునర్నిర్ణయం) ఎందుకు ముడిపెట్టారు? జనాభాలో సగంగా ఉన్న మహిళలకు రాజకీయ సాధికారత కల్పించే సదుద్దేశం ఈ ఆర్ఎస్ఎస్-బీజేపీ ప్రభుత్వానికి ఉన్నట్లయితే, ప్రస్తుత 543 లోక్‌సభ సీట్లలోనే మహిళలకు 33 శాతం కేటాయించి గత ఎన్నికల నుంచే ఈ చట్టాన్ని అమలు జరిపేవారు. అదే ప్రతిపక్షాల డిమాండ్ కూడా. వెంటనే అమలు జరపలేకపోవటానికి అప్పుడు చెప్పిన సమర్థనలు ఇప్పుడు గాలికి ఎగిరిపోయాయి. 2026 వరకు నియోజకవర్గాల సంఖ్యపై రాజ్యాంగ సవరణ రీత్యా స్తంభన ఉన్నందున, 2026 జనగణన (సెన్సెస్) తదుపరి తొలి ఎన్నికల నుంచి మహిళా రిజర్వేషన్ అమలు జరుపుతామన్నారు. అటువంటప్పుడు ఏప్రిల్‌లో డీలిమిటేషన్‌తో సంధానించి మహిళా రిజర్వేషన్ అమలును ప్రతిపాదిస్తూ తమకు మెజారిటీ తోడ్పాటు లేదని తెలిసీ 131వ రాజ్యాంగ సవరణను ఎందుకు ప్రవేశపెట్టారు? మహిళా రిజర్వేషన్‌కు ఇండియా కూటమి వ్యతిరేకమని నిందమోపి రాజకీయ లబ్ధి పొందడానికే కదా? ఆ బిల్లు ఓడిపోయినా అంతటితో ఆగకుండా ప్రతిపక్షాల్లో ఫిరాయింపులు ప్రోత్సహించే, అన్ని రాష్ట్రాలకు 50 శాతం సీట్ల పెంపుదలతో దక్షిణాది అసంతృప్తులను బుజ్జగించే వ్యూహాలు-ఎత్తుగడలతో సోమవారం తాజా బిల్లులు ఎందుకు ప్రవేశపెడుతున్నారు? దీనివెనుక రాజకీయ దురుద్దేశం ఉందని ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి.
సీట్ల సంఖ్య పెంపుదల నుంచి లబ్ధిపొందటమొక్కటేకాదు, డీలిమిటేషన్ ఏఐ ఉపయోగించి నియోజకవర్గాల పొందికను బీజేపీకి అనుకూలంగా కూర్పు చేసే ప్రమాదం లేకపోలేదు. అసోం, జమ్ము కశ్మీర్‌లలో డీలిమిటేషన్లో పొందికలేని ప్రాంతాలను కలగలిపి నియోజకవర్గాలు కూర్చిన ఉదాహరణలు ఈ ప్రమాదం గురించి హెచ్చరిస్తున్నాయి. రెండు, ఓటర్ల జాబితాలకు ఓటర్లను చేర్చి (మహారాష్ట్ర), ఓటర్లను తొలగించి (ప.బెంగాల్) రాజకీయ లబ్ధి పొందిన బీజేపీ పెద్దలు, లోక్‌సభ సభ్యుల సంఖ్యను పెంచటం ద్వారా (అత్యధికులకు మాట్లాడే అవకాశం ఎన్నటికీ రాదు) తమ అభీష్టం మేరకు రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటును హైజాక్ చేసే వీలు కలుగుతుంది. తాజా జనగణన మొదలైన దశలో, దాని గణాంకాల కోసం ఆగకుండా డీలిమిటేషన్ చేసి, మరో పాతికేళ్లపాటు నియోజకవర్గాలపై స్తంభన విధిస్తే నష్టం ఎవరికి? ఎస్సీ, ఎస్టీలకు. వీరి జనాభా పెరిగింది. ఆ దామాషాల్లో సీట్ల రిజర్వేషన్ పెరగకుండా మరో పాతిక ముప్పై ఏళ్లు వాయిదా పడుతుంది? ప్రస్తుత సెన్సెస్ డిజిటల్ నిర్వహిస్తున్నందున దాని నిర్ధారణలు ఆరేడు మాసాల్లోనే వస్తాయి. 2011 సెన్సెస్ ప్రాతిపదికగా డీలిమిటేషన్ చేస్తే ఈ పాతికేళ్లలో క్షేత్రస్థాయిలో జనాభా చలనాల్లో వచ్చిన హెచ్చుతగ్గులు ప్రతిఫలించవు కదా?
అన్ని రాష్ట్రాలకూ సమానంగా సీట్లలో 50 శాతం పెంపుదలవల్ల ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య సమానత్వం పైకి కనిపించవచ్చు. ఇది దక్షిణాది రాష్ట్రాల వారిని దగా చేయటానికి ఉపకరిస్తుంది. కాని పరిపూర్ణ సంఖ్యల్లో ఏర్పడే అఘాతం అధికారం స్థిరపరుచుకునేందుకు, సవరణల ద్వారా రాజ్యాంగాన్ని లోపలనుంచి తొలిచేందుకు బీజేపీకి సహాయకారి అవుతుంది. హిందీ హార్ట్‌ల్యాండ్‌గా పరిగణించబడుతున్న 9 రాష్ట్రాల్లో ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్య 225. వీటితోపాటు గుజరాత్ (26), మహారాష్ట్ర (48) కలుపుకుంటే బీజేపీ ప్రాభవం బలంగా ఉన్న 11 రాష్ట్రాల్లో సీట్లు మొత్తం 299 అవుతుంది. వాటికి 50 శాతం కలిపితే సుమారు 499 అవుతాయి. మిగతా 25 రాష్ట్రాలు, యూటీల్లో 50 శాతం సీట్లు పెంచినా వాటి పరిస్థితి రెక్కలులేని పక్షి సామెత అవుతుంది. పర్యవసానంగా పార్లమెంటు, దేశం రాజకీయ స్వభావం మారుతుంది. తద్వారా బీజేపీ నియంతృత్వ పాలనకు, దాని హిందూ రాష్ట్ర లక్ష్యసాధన దిశగా ప్రయాణానికీ మార్గం సుగమమవుతుంది. ఇది రాజ్యాంగ లక్ష్యాలకు, ఫెడరల్, ప్రజాస్వామ్య, లౌకిక ఆదేశాలకు విరుద్ధమవుతుంది. ఈ ప్రమాదాన్ని దాచిపెట్టేందుకు పాలకపార్టీ మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో సంధానించి నాటకమాడుతోంది. 50 శాతం సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ అమలును మాత్రమే ఎత్తిచూపుతూ డీలిమిటేషన్ వెనుకనున్న ముప్పును దాటవేస్తున్న ప్రాంతీయ పార్టీలు విచారించే రోజు రాకపోదు. డీలిమిటేషన్ కమిషన్ ఏ గీత గీసినా అదే ఫైనల్, అప్పీలుకు అవకాశం ఉండదు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను నియమించినట్లే మోదీ ప్రభుత్వం తమ చేతుల్లోని పెద్ద మనుషులతో ఈ కమిషన్‌ను నియమిస్తుంది.
ఓటింగ్ యంత్రాల్లో ఓట్ల తారుమారు, ఓటర్ల జాబితాల్లో చేర్పులు, తొలగింపుల ద్వారా సీట్ చోరీ ఆరోపణలు, వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోని సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఓటర్ల జాబితాల ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) పేరుతో కోట్లాదిమంది ఓటర్ల తొలగింపు (ఓట్చోరీ), జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంటే, ఆయన్ను సమర్థిస్తూ బీజేపీ దేశవ్యాప్త ప్రదర్శనలు-వీటన్నిటికి పరాకాష్టగా డీలిమిటేషన్ కోసం మోదీ-షా ద్వయం తాజా ప్రయత్నం. ఇవన్నీ దేశాన్ని నియంతృత్వం దిశగా తీసుకెళ్లే ప్రమాద సంకేతాలుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం పొందగలమని మోదీ ప్రభుత్వం సంపూర్ణ విశ్వాసంతో ఉంది. గట్టెక్కలేకపోతే రెండవసారి ప్రభుత్వం పరువుపోతుంది. లేక ఎత్తులు, జిత్తులతో పార్లమెంటులో తమ పంతం నెగ్గించుకోగలిగినా ప్రజాక్షేత్రం విచక్షణాజ్ఞానం, నిఘానేత్రం ప్రభుత్వ పోకడను గమనిస్తూనే ఉంటుందని మరువరాదు!