Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

అందరికళ్లు దిల్లీ వైపే

Prajapaksham 28 Nov 2026 1 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
అందరికళ్లు దిల్లీ వైపే

జవాబుదారీతనానికి ‘రీకాల్‌' హక్కు

పార్లమెంటు ఉభయసభల సమావేశాలు నిరవధికంగా వాయిదాపడి 100 రోజులు దాటినా, వాటి ప్రోరోగ్‌ను ప్రభుత్వం ఎందుకు కోరలేదు? అది నిన్నటిదాకా ఉత్కంఠ. లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచి, నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలు జరిపే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏప్రిల్‌లో లోక్‌సభలో ఓడిపోయినప్పటికీ, తిరిగి సంబంధిత బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఆ ప్రయత్నాలు ఇంకా ఫలించలేదని నవంబర్‌ 25దాకా ప్రచారంలో ఉన్న వార్త. సభలను ప్రోరోగ్‌ చేయనందున రెండ్రోజుల నోటీసుతో సమావేశపరిచే సౌలభ్యం సభాపతులకు ఉంటుంది. రెగ్యులర్‌ శీతాకాల సమావేశాలు ఉంటాయా, లేదా అని మీమాంస జరుగుతుండగా రాజ్యాంగ దినమైన నవంబర్‌ 26(గురువారం) ప్రభుత్వం ఉత్కంఠకు తెరదించింది. నవంబర్‌ 30న లోక్‌సభను, డిసెంబర్‌ 2న రాజ్యసభను సమావేశపరచాల్సిందిగా ప్రభుత్వం ఉభయసభల అధ్యక్షులకు వర్తమానం పంపింది. ఈ ప్రత్యేక సమావేశాలు డిసెంబర్‌ 3న ముగుస్తాయని కూడా తెలిపింది. డీలిమిటేషన్‌ బిల్లు ఆమోదం కోసమే ఈ ప్రత్యేక సమావేశమని విదితమైంది. అక్కడినుంచి ఊహాగానాలు, వ్యాఖ్యానాలు మొదలైనాయి. శుక్రవారం ఉదయం కేంద్రమంత్రిమండలి సమావేశం తర్వాత మరికొంత స్పష్టత వచ్చింది. ఏప్రిల్‌లో 54ఓట్ల తేడాతో తిరస్కరణకు గురైన బిల్లును ప్రభుత్వం తిరిగి తెస్తున్నదంటే ఆనాటి చర్చల ఆధారంగా బిల్లులో ఏవో కొన్ని మార్పులు తలపెట్టి ఉండాలి. రెండు, బిల్లును బలపరిచే సంఖ్యాబలాన్ని కూడగట్టుకుని ఉండాలి. కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ వాఖ్యానించినట్లు ‘ఆపరేషన్‌ లోటస్‌’ పూర్తయి ఉండా లి. మంత్రిమండలి నిర్ణయాలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, మీడియా కథనాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల అభ్యంతరాలు, ఫిర్యాదులను సంతృప్తిపరచేందుకు స్థూలంగా వారి డిమాండ్‌లు అంగీకరించినట్లు చెప్పబడుతున్నది. ఒకటి, లోక్‌సభలో అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్య సీట్ల సంఖ్యను 50శాతం పెంపుదలను గత బిల్లుకు భిన్నంగా తాజా బిల్లులో పొందుపరుస్తారు. (గతంలో అది నోటిమాట ప్రచారం తప్ప బిల్లులో పెట్టలేదు). రెండు, ఇప్పుడు పెరిగే సీట్లు సహా లోక్‌సభ సీట్ల సంఖ్య 25 ఏళ్లపాటు స్తంభింపజేయబడుతుంది. 2021లో వాజ్‌పేయి ప్రభుత్వం లోక్‌సభ సీట్ల సంఖ్యను 25 సంవత్సరాలు స్తంభింపజేస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. అది 2026లో ముగుస్తుంది. 1971 సెన్సెస్‌ ప్రాతిపదికగా డీలిమిటేషన్‌ జరిగింది. అదే రీతిలో ఇప్పుడు పెరిగే 50శాతం సీట్లు సహా ఆయా రాష్ట్రాల సీట్ల సంఖ్య 2051వరకు స్థిరంగా ఉంటుంది. నియోజకవర్గాల హద్దుల పునర్నిర్ణయానికి మాత్రమే గత 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటారని చెప్పబడుతున్నది. అంటే దక్షిణాది సహా అన్ని రాష్ట్రాలకూ లోక్‌సభలో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్య శాతం యథాతథంగా కొనసాగుతుందనే హామీ లభిస్తుంది. అయితే పూర్ణసంఖ్యలో అగాథం మరింత
పెరుగుతుంది.
సీట్ల సంఖ్యను పెంపుచేయటమనే బిజెపి పట్టుదల వెనుకనున్న తర్కం, ఉద్దేశంపై ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీలో అనుమానాలున్నా, సీట్ల పెంపుదల ఎరతో వాటిలో కొన్నింటి మద్దతు సంపాదించటంలో బిజెపి సఫలమైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిల్లు ముసాయిదా చేతికందినాకగాని వారి వైఖరి స్పష్టం కాదు. ఈ మొత్తం ప్రయత్నంలో బిజెపి నిజాయితీగా వ్యవహరించకపోవటం గమనించదగింది. అది 2023లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు తెచ్చినపుడు లోక్‌సభ సీట్లు పెంచి అమలు చేస్తామని చెప్పలేదు. డీలిమిటేషన్‌పై స్తంభన ముగిశాక అమలు చేస్తామంది. ప్రస్తుత సభ సంఖ్యాబలం 543 సీట్లలో మూడవవంతు మహిళలకు కేటాయించి వెంటనే అమలులోకి తేవాలని ఇండియా కూటమి ఆనాటినుంచి ఈనాటివరకు చేస్తున్న డిమాండ్‌ను అంగీకరించలేదు. 2026 ఏప్రిల్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు తెచ్చినపుడు ప్రతి రాష్ట్రానికీ సీట్లు 50 శాతం పెంపుదలను బిల్లులో పొందుపరచలేదు. జనాభా ప్రాతిపదికన సీట్లు సంఖ్య నిర్ణయం అనే వైఖరి దక్షిణాది రాష్ట్రాల్లో వ్యతిరేకతకు హేతువైంది. ఈ సమస్య 1971 నుంచీ ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్షాలను మహిళా రిజర్వేషన్‌ వ్యతిరేకులుగా చూపటమే దాని ప్రయోజనంగా కనిపించింది. తాము మహిళలకు పట్టంకడుతుంటే ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని బిజెపి వారు విస్తృతంగా ప్రచారం చేసినా, మోదీగారు 400 సీట్లు ఇవ్వండని అర్థిస్తే విజ్ఞులైన ఓటర్లు కనీస మెజారిటీకి కూడా సరిపోకుండా 240 సీట్లే ఇచ్చారు. సీట్ల సంఖ్యను పెంచటం ద్వారా హిందీబెల్టు రాష్ట్రాలను గుప్పిట్లో పెట్టుకుని అధికారం శాశ్వతం చేసుకోవటం బిజెపి ధ్యేయంగా ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం జరిపి ప్రభుత్వ ప్రతిపాదనలు చర్చించి ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలన్న ఇండియా కూటమి డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం అంగీకరించలేదు.
తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి చీలిపోయిన 20మంది ఎంపిలు బిజెపి పంచన చేరటం, మహారాష్ట్ర నుంచి ఉద్దవ్‌ థాక్రే ఎంపిలు అరడజను మంది ఏక్‌నాధ్‌ షిండె శివసేనలోకి ఫిరాయించటం, అకాలీదళ్‌తో పొత్తుతో లభించిన ఒక్క ఓటు, ఆప్‌ నుంచి ఐదారుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరటం, తమిళనాడు పరిణామాల్లో డిఎంకె ఇండియా కూటమికి దూరం కావటం, శరద్‌ పవార్‌ ఎన్‌సిపిని ఎన్‌డిఎలోకి ఆకర్షించే ప్రయత్నాల్లో కొంత సానుకూలత కనిపించటం ఇత్యాది కారణాలన్నీ రాజ్యాంగ సవరణ బిల్లుకు అవసరమైన సంఖ్యాబలం సమకూర్చుతాయని బిజెపికి విశ్వాసం కలిగించాయనవచ్చు. రానున్న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్‌ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముందు అది మరో ప్రయత్నం చేస్తున్నది. 320 మంది సభ్యులున్న ఎన్‌డిఎ పలు ప్రాంతీయ పార్టీలకు వేస్తున్న ఎరను అవి మింగుతాయా? ఇండియా కూటమి ఏకత్రాటిపై ఉండగలదా? ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య ఆఖరు నిమిషంలో ఏదైనా ఏకాభిప్రాయం సంభవమా? వేచిచూదాం!