Court Contempt Case: కోర్టు ధిక్కరణ కేసు.. సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డికి జైలు శిక్ష.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
TS High court
Court Contempt Case: కోర్టు ధిక్కరణ కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేశ్ రెడ్డి, మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డిలకు తెలంగాణ హైకోర్టు గట్టి షాకిచ్చింది. న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే బేఖాతరు చేశారని నిర్ధారిస్తూ.. ఈ ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులకు రెండు వారాల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ. 2,000 చొప్పున జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించడంలో విఫలమైతే అదనంగా మరో వారం రోజుల పాటు సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
గతంలో ఒక భూ వివాదానికి సంబంధించిన కేసులో విచారణ జరిపిన హైకోర్టు, పిటిషనర్‌కు తగిన పోలీస్ రక్షణ (Police Protection) కల్పించాలని పోలీస్ శాఖకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఉన్నతాధికారులు ఆ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా అమలు చేయకపోవడంతో బాధితుడు తిరిగి హైకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం, న్యాయస్థానం ఉత్తర్వులను అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రమేశ్ రెడ్డి, కోటిరెడ్డిలను దోషులుగా తేల్చింది.
అయితే ఈ తీర్పుపై ఉన్నత ధర్మాసనంలో (డివిజన్ బెంచ్) అప్పీల్ చేసుకునేందుకు వీలుగా జైలు శిక్ష అమలును హైకోర్టు వారం రోజుల పాటు నిలిపివేసింది (సస్పెండ్ చేసింది). ఈ వారం రోజుల గడువులోగా ఉన్నత బెంచ్ నుంచి స్టే ఉత్తర్వులు పొందలేకపోతే.. గడువు ముగిసిన వెంటనే హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోయి జైలు శిక్షను అనుభవించాలని న్యాయస్థానం ఆదేశించింది.