UP Elections 2027: యూపీ ఎన్నికల సమరం.. మేనిఫెస్టో విడుదల చేసిన ఎస్పీ.. బీజేపీకి పోయే రోజు దగ్గర పడిందంటూ అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు..
AKhilesh yadav
UP Elections 2027: వచ్చే ఏడాది (2027) జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ (SP) పూర్తిస్థాయి సమరశంఖం పూరించింది. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం (నవంబర్ 26, 2026) లక్నోలోని హోటల్ సెంట్రమ్‌లో జరిగిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తమ ఎన్నికల మేనిఫెస్టోను అధికారికంగా విడుదల చేశారు.
మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలోక్ రంజన్ పర్యవేక్షణలో రూపొందించిన ఈ ప్రణాళికకు “సత్తాయిస్ కా సంకల్ప్: పీడీఏ కా ప్రణ్పత్ర” (2027 సంకల్పం: పీడీఏ ప్రతిజ్ఞా పత్రం) , ‘జన్-మన్ కా మేనిఫెస్టో’ అనే పేర్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు అజం ఖాన్, ఎంపీ డింపుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతి చేతికి పని, ప్రతి రైతుకు వేతనం, మహిళలకు గౌరవం, చట్టానికి గౌరవం” అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ మేనిఫెస్టోను తీర్చిదిద్దారు. రాజ్యాంగ పరిరక్షణ, రిజర్వేషన్ల రక్షణ ద్వారా తమ ప్రధాన ఓటు బ్యాంకు అయిన పీడీఏ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) కూటమిని మరింత పటిష్టం చేయాలని ఎస్పీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర స్థాయి మేనిఫెస్టోతో పాటు, మహిళలు , బాలికల కోసం ప్రత్యేక డాక్యుమెంట్‌ను, అలాగే వచ్చే జనవరి నాటికి రాష్ట్రంలోని మొత్తం 75 జిల్లాలకు స్థానిక అవసరాలు, మౌలిక సదుపాయాలు , ప్రాంతీయ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తూ విడివిడిగా జిల్లా మేనిఫెస్టోలను కూడా విడుదల చేయనున్నట్లు అఖిలేష్ ప్రకటించారు.
సమాజ్‌వాదీ పార్టీ మేనిఫెస్టోలోని ప్రధాన హామీలు:
మహిళలు, వృద్ధులు & సంక్షేమం: బీపీఎల్ కుటుంబాల మహిళలు, వృద్ధులు , నిరుపేదలకు ఏటా రూ. 40,000 వార్షిక పింఛను (నగదు బదిలీ). పేదలకు కేవలం రూ. 5 కే నాణ్యమైన భోజనం అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘సమాజ్‌వాదీ క్యాంటీన్ల’ ఏర్పాటు. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానం (OPS) పునరుద్ధరణ.
యువత, ఉద్యోగాలు & నిరుద్యోగ భృతి: పట్టభద్రులైన నిరుద్యోగ యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. 5,000 నిరుద్యోగ భృతి. రాబోయే 5 ఏళ్లలో 25 లక్షల మంది యువతకు ఉపాధి కల్పన. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీతో పాటు పేపర్ లీక్‌ల నివారణకు కఠిన చట్టాలు. ఒక పరీక్ష ఉన్న నియామకాలను 3 నెలల్లో, రెండు పరీక్షలు ఉన్న వాటిని 6 నెలల్లో పూర్తి చేయడం.
విద్య & డిజిటల్ విప్లవం: యువత కోసం ఉచిత ల్యాప్‌టాప్ పథకం పునఃప్రారంభం. రాష్ట్రంలో మూసివేసిన ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరవడం. అందరికీ ఉచిత, నాణ్యమైన విద్యతో పాటు పీడీఏ వర్గాల విద్యార్థుల కోసం ప్రత్యేక రాష్ట్ర విద్యా విధానం. శిక్షామిత్రుల జీతాలు పెంచి వారిని శాశ్వతం చేయడం.
రైతులు & గ్రామీణాభివృద్ధి: రాష్ట్రంలోని రైతుల పంట రుణాల మాఫీ. చెరకు రైతులకు బకాయిలను 24 గంటల్లోగా చెల్లించేలా చర్యలు. వీధి దీపాలు, నిరంతర విద్యుత్, తారు రోడ్లు , ఉచిత వై-ఫై సౌకర్యాలతో ఆధునిక కొత్త గ్రామాల నిర్మాణం , అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం.
ఆరోగ్యం & సామాజిక న్యాయం: రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత, నాణ్యమైన వైద్యం అందించేందుకు ‘రాష్ట్ర ఆరోగ్య విధానం 2027’, ఉచిత అంబులెన్స్ సేవలు. అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా కుల గణన (Caste Census) నిర్వహణ. ప్రతిభను ప్రోత్సహించే ‘యశ్‌భారతి సమ్మాన్’ అవార్డును అధిక నగదు పురస్కారంతో పునఃప్రారంభించడం.
శాంతిభద్రతలు & మహిళా రక్షణ: నేరాలపై జీరో టాలరెన్స్ విధానం. శాంతిభద్రతల పర్యవేక్షణకు ఏఐ (AI) ఆధారిత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం. మహిళల భద్రతను మరింత పటిష్టం చేయడంతో పాటు, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు.
మేనిఫెస్టోలో లేని పనులు కూడా మేము చేసి చూపించాం” – అఖిలేష్ యాదవ్
మేనిఫెస్టో విడుదల సందర్భంగా అధికార బీజేపీపై అఖిలేష్ యాదవ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలో ‘అచ్ఛే దిన్’ (మంచి రోజులు) ఎప్పటికీ రాలేదు, కానీ బీజేపీకి ‘బురే దిన్’ (చెడ్డ రోజులు) పోయే సమయం ఆసన్నమైంది. ఓటమి భయంతోనే వారి భాష మారిపోయింది. మేము పీడీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం అని ధీమా వ్యక్తం చేశారు.
గతంలో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గుర్తుచేస్తూ.. నేతాజీ (ములాయం సింగ్ యాదవ్) ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి లక్నో అభివృద్ధికి ఎంతో కృషి జరిగింది. మా మేనిఫెస్టోలో లేకపోయినా లక్నోలో అత్యుత్తమ మేదాంత ఆసుపత్రి, దేశంలోనే అత్యుత్తమ ప్రపంచ స్థాయి క్రికెట్ స్టేడియం, దేశంలోనే అతిపెద్ద మాల్ నిర్మించాం. నేడు మనం ఏఐ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల గురించి మాట్లాడుకుంటున్నాం.. ఆనాడే మేము హెచ్‌సీఎల్ (HCL) సంస్థను లక్నోకు తీసుకువచ్చి, యువతకు ఉపాధి కోసం ఐటీ నగరాన్ని నిర్మించాం అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. కాగా, 2027 ఎన్నికల పొత్తులో భాగంగా కాంగ్రెస్‌తో రేపు (శుక్రవారం) రెండో దశ సీట్ల పంపకం చర్చలు జరగనున్నాయి.