UP Elections 2027: యూపీ ఎన్నికల్లో సెగలు పుట్టిస్తున్న సహారన్పూర్.. ఎస్పీ-కాంగ్రెస్ వివాదానికి కేంద్ర బిందువుగా మారిన జిల్లా మీద ఎందుకు అంత క్రేజ్..
Saharanpur
UP Elections 2027: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు పొత్తుల వేటలో పడ్డాయి. కాంగ్రెస్-ఎస్పీ కూటమి మధ్య ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సహారన్పూర్ జిల్లా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ జిల్లా కోసం రెండు పార్టీలు కొట్టుకునే పరిస్థితి అక్కడ కనిపిస్తోంది. మరి ఆ జిల్లా మీద ఎందుకు అంత క్రేజ్ చూపుతున్నాయో ఓ సారి చూద్దాం.
యూపీకి ఉత్తరాన, నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్న సహారన్పూర్ జిల్లా భౌగోళికంగానే కాకుండా, ఇప్పుడు రాజకీయంగానూ అత్యంత కీలకమైన కేంద్రంగా మారింది. పశ్చిమాన హర్యానా, తూర్పున ఉత్తరాఖండ్, ఉత్తరాన హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులతో ఉన్న ఈ జిల్లా, ప్రత్యక్ష సరిహద్దు లేని హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను అనుసంధానించే వారధిలా నిలుస్తోంది. అయితే, భౌగోళికంగా రాష్ట్రాలను కలిపే ఈ ప్రాంతం, నేడు ఇండియా (INDIA) కూటమిలోని కీలక మిత్రపక్షాలైన కాంగ్రెస్- సమాజ్‌వాదీ పార్టీ (SP) మధ్య అతిపెద్ద రాజకీయ విభేదానికి కేంద్రబిందువుగా మారింది.
2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం చర్చలు కొనసాగుతుండగానే.. సమాజ్‌వాదీ పార్టీ ఏకపక్షంగా ఐదుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించడం కూటమిలో కలకలం రేపింది. కాంగ్రెస్ పార్టీ ఆశిస్తున్న సహారన్పూర్, సహారన్పూర్ దేహత్, బెహత్ నియోజకవర్గాల నుంచి ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఎస్పీ తిరిగి నామినేట్ చేసింది. జిల్లాలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాల్లో 2022 ఎన్నికల్లో బీజేపీ ఐదు స్థానాలను (డియోబంద్, గంగోహ్, నకూర్, రాంపూర్ మణిహరన్-ఎస్సీ, సహారన్పూర్ నగర్) గెలుచుకోగా.. ఎస్పీ కేవలం బెహత్ సహారన్పూర్ స్థానాలను మాత్రమే గెలుచుకుంది.
ఈ నేపథ్యంలో 2022లో గెలిచిన స్థానాలపై తమకే సహజ హక్కు ఉందని ఎస్పీ వాదిస్తుండగా.. సహారన్పూర్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మానికి విరుద్ధంగా ఎస్పీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తాను సహారన్పూర్ ఎంపీగా గెలిచినప్పుడు ఈ రెండు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం లభించిందని ఇమ్రాన్ మసూద్ గుర్తుచేస్తున్నారు.
సమాజ్‌వాదీ పార్టీతో ఇమ్రాన్ మసూద్ సంబంధాలు ఎప్పుడూ ఒడిదుడుకుల మధ్యే సాగాయి. 2007 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, 2012, 2014, 2017, 2019 ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఓటమి పాలైన ఇమ్రాన్, 2024 లోక్‌సభ విజయంతో తిరిగి తన రాజకీయ ఉనికిని చాటుకున్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కాంగ్రెస్ నుంచి ఎస్పీకి, ఆ తర్వాత బీఎస్పీకి మారి చివరకు 2024 ఎన్నికలకు ముందు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. ప్రియాంక గాంధీ వాద్రాతో ఉన్న సాన్నిహిత్యం, ముక్కుసూటితనం ఆయన్ను పశ్చిమ యూపీలో కీలక నేతగా మార్చాయి.
అయితే, సహారన్పూర్ వివాదం వెనుక లోతైన వ్యక్తిగత, కుటుంబ కారణాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. దివంగత కేంద్ర మంత్రి, తొమ్మిది సార్లు ఎంపీగా పనిచేసిన రషీద్ మసూద్ రాజకీయ వారసత్వం కోసం ఇమ్రాన్ కుటుంబంలోనే చీలిక ఏర్పడింది. ఇమ్రాన్ మసూద్ అల్లుడు (కుమార్తెకు దూరంగా ఉంటున్న) షయాన్ మసూద్ ఈ ఏడాది ఆగస్టులో ఎస్పీలో చేరి ఇమ్రాన్‌పై బహిరంగ విమర్శలు గుప్పించారు.
ఎస్పీ తిరిగి టికెట్ ఇచ్చిన సహారన్పూర్ ఎమ్మెల్యే అశు మాలిక్ తో ఇమ్రాన్‌కు తీవ్ర విభేదాలు ఉన్నాయి. ఆగస్టులో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ సమావేశంలో వీరిద్దరూ బహిరంగంగానే వాగ్వాదానికి దిగారు. 2022లో ఇమ్రాన్ మద్దతుతోనే గెలిచిన అశు మాలిక్, బెహత్ ఎమ్మెల్యే ఒమర్ అలీ ఇప్పుడు ఆయనకు బద్ధ వ్యతిరేకులుగా మారారు.
సహారన్పూర్ ఎందుకింత కీలకం? సామాజిక సమీకరణాలు
సహారన్పూర్ జిల్లాలోని సుమారు 19 లక్షల మంది ఓటర్లలో 6.80 లక్షల మంది (41% పైగా) ముస్లింలు, 22 శాతం దళితులు ఉన్నారు. అంటే మొత్తం ఓటర్లలో 63 శాతానికి పైగా ఈ రెండు వర్గాలే ఉండటంతో ఇరు పార్టీలకు ఈ జిల్లా అత్యంత కీలకంగా మారింది. ప్రఖ్యాత ఇస్లామిక్ విద్యాసంస్థ దారుల్ ఉలూమ్ దియోబంద్ ఇక్కడే ఉండటం ఈ ప్రాంత రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచుతోంది.
పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో కోల్పోయిన ముస్లిం-దళిత ఓటు బ్యాంకును తిరిగి నిర్మించుకోవడానికి కాంగ్రెస్.. ఇమ్రాన్ మసూద్ విజయాన్ని ఒక వేదికగా వాడుకుంటోంది. వచ్చే నెలలో రాహుల్ గాంధీ సహారన్పూర్లో భారీ ర్యాలీతో 2027 ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతుండటం దీనికి నిదర్శనం. మరోవైపు అఖిలేష్ యాదవ్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘పీడీఏ’ (వెనుకబడిన, దళిత, మైనారిటీ) వ్యూహానికి సహారన్పూర్ పట్టుకొమ్మలాంటిది కావడంతో ఎస్పీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన సిక్కు-ముస్లిం బంధం
జిల్లా జనాభాలో సిక్కులు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. 2014లో అంబాలా రోడ్డులోని గురుద్వారా సమీప భూవివాదం కారణంగా ముస్లిం, సిక్కు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లు జిల్లా చరిత్రలో చీకటి అధ్యాయంగా మిగిలాయి. అయితే ఆరేళ్ల తర్వాత 2020లో ఇరు వర్గాలు కోర్టు వెలుపల రాజీకి వచ్చి దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఢిల్లీ అల్లర్లు, సీఏఏ నిరసనల సమయంలో సిక్కులు.. ముస్లింలకు అందించిన సేవలకు కృతజ్ఞతగా వివాదాస్పద భూమిపై హక్కును వదులుకున్న ముస్లిం సమాజం గురుద్వారా నిర్మాణానికి ‘కార్ సేవ’ చేయగా, సిక్కులు మసీదు భూమి కొనుగోలుకు సహకరించారు.
ఇలా భౌగోళికంగా రాష్ట్రాలను, సామాజికంగా వర్గాలను కలిపిన సహారన్పూర్ జిల్లా, ఇప్పుడు 2027 ఎన్నికల వేళ ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎస్పీల ఐక్యతకు అతిపెద్ద అగ్నిపరీక్షగా మారింది.