26/11 Mumbai Attacks: 18 ఏళ్లైనా వీడని ముంబై 26/11 మిస్టరీ.. ఆ రహస్య ‘మేజర్ జనరల్ సాహబ్’ ఎవరు.. ముంబై ఉగ్రదాడులకు ముందు కసబ్‌ను ఎందుకు కలిసారు..
Mumbai Attacks and kasab
26/11 Mumbai Attacks: సరిగ్గా 18 ఏళ్ళ క్రితం ఇదే రోజు ముంబై నగరంతో పాటు దేశాన్ని వణికించిన ఉగ్ర దాడి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. వందలాది మందిని పొట్టన పెట్టుకున్న టెర్రరిస్టుల దాడి అది. దేశ వాణిజ్య రాజధాని ముంబైపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన 26/11 మారణహోమానికి నేటితో (నవంబర్ 26, 2026) సరిగ్గా 18 సంవత్సరాలు పూర్తయ్యాయి.
2008 నవంబర్ 26వ తేదీ రాత్రి 10 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గం గుండా ముంబైలోకి చొరబడి, కీలక ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 26 మంది విదేశీయులతో సహా 170 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. రెండు ఫైవ్-స్టార్ హోటళ్లలో సుమారు 60 గంటల పాటు అనేక మందిని బందీలుగా పట్టుకుని ఉగ్రవాదులు సృష్టించిన బీభత్సం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడుల వెనుక పాకిస్తానీ సైన్యం, గూఢచార సంస్థ ఐఎస్ఐ (ISI) హస్తం ఉన్నట్లు ఆధారాలతో సహా రుజువైనప్పటికీ, ఈ భయంకరమైన కుట్రకు సూత్రధారులలో ఒకరైన రహస్య వ్యక్తి అసలు గుర్తింపు 18 ఏళ్లు గడిచినా ఇప్పటికీ అజ్ఞాతంగానే మిగిలిపోయింది.
ఛార్జిషీట్‌లో ‘నిందితుడు నెం. 20: మేజర్ జనరల్ సాహిబ్’
26/11 దాడులకు సంబంధించి 2009లో దాఖలు చేసిన ఛార్జిషీట్, కోర్టు పత్రాలలో ఆ అజ్ఞాత వ్యక్తి పేరు పదేపదే ప్రస్తావించబడింది. అందులో అతడిని నిందితుడు నెం. 20: మేజర్ జనరల్ సాహిబ్.. పేరు తెలియదని పేర్కొన్నారు. ఛార్జిషీట్‌లో నిందితులుగా చేర్చిన 32 మంది పాకిస్తానీయులలో, నేటికీ అసలు పేరు, గుర్తింపు తెలియని ఏకైక వ్యక్తి ఇతనే కావడం గమనార్హం.
సజీవంగా పట్టుబడిన ఏకైక ఉగ్రవాది అజ్మల్ కసబ్, అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఎన్ఐఏ (NIA) రూపొందించిన ఛార్జిషీట్‌లో పలువురు పాకిస్తాన్ ఆర్మీ అధికారుల పేర్లు స్పష్టంగా నమోదయ్యాయి. వీరిలో మేజర్ జనరల్ ముహమ్మద్ ఖాలిద్ రావు, స్పెషల్ కమ్యూనికేషన్స్ ఆర్గనైజేషన్ (SCO) కల్నల్ సాదతుల్లా, మేజర్ ఇక్బాల్ అతని సీనియర్ లెఫ్టినెంట్ కల్నల్ హమ్జా వంటి అధికారుల పేర్లు ఉన్నాయి. కానీ అందరికంటే కీలక పాత్ర పోషించిన మేజర్ జనరల్ సాహిబ్ ఫోటో గానీ, కనీసం స్కెచ్ గానీ దర్యాప్తు సంస్థల వద్ద లేదు. కేవలం కసబ్ పోలీసు విచారణలో ఇచ్చిన వాంగ్మూలం మాత్రమే అతని ఉనికికి ఏకైక ఆధారంగా మిగిలింది.
కసబ్ వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు:
ముంబై పోలీసులకు ఇచ్చిన విచారణ నివేదికలో.. లష్కర్-ఎ-తైబా (LeT), పాకిస్తాన్ సైన్యం నుంచి తాను పొందిన శిక్షణ దశలను కసబ్ పూసగుచ్చినట్లు వివరించాడు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్ LeT శిక్షణా శిబిరాన్ని సందర్శించిన ఆ రహస్య వ్యక్తి గురించి కసబ్ విచారణ అధికారులకు ఇలా చెప్పాడు.
మా శిక్షణ సమయంలో అక్కడకు ఒక అపరిచిత వ్యక్తి వచ్చారు. లష్కర్ చీఫ్ హాఫిజ్ సయీద్, కమాండర్ జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ ఆయన్ను కలిసి ఎంతో గౌరవంతో కౌగిలించుకున్నారు. అప్పటి నుంచి అందరూ ఆయన్ను మేజర్ జనరల్ అని పిలవడం మొదలుపెట్టారు. మమ్మల్ని ‘ఖచ్చితమైన జిహాదీలుగా’ మార్చిన ఆ ఎనిమిది వారాల కఠిన శిక్షణను ఈ మేజర్ జనరల్ స్వయంగా పర్యవేక్షించారని కసబ్ కస్టడీలో తెలిపారు.
2008 ఆగస్టులో కొత్తగా ఎంపికైన ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి ఆ మేజర్ జనరల్ తిరిగి శిక్షణా శిబిరానికి వచ్చారని కసబ్ వెల్లడించాడు. సముద్ర మార్గంలో ముంబైకి రావాల్సి ఉన్నందున, కసబ్‌ను ‘నీకు ఈత వచ్చునా? అని ఆ అధికారి ప్రత్యేకంగా అడిగారు. అంతేకాకుండా, ఆ శిబిరంలో ఉగ్రవాదుల కాల్పుల సామర్థ్యాన్ని ఆయన స్వయంగా పరీక్షించారు.
సయీద్, లఖ్వీలతో ఏకాంతంగా మాట్లాడిన తర్వాత.. మేజర్ జనరల్ సూచన మేరకు 10 లక్ష్యాలను ఏర్పాటు చేసి కాల్పుల డ్రిల్ నిర్వహించారు. సయీద్ ఒక్కసారి కాల్చమని సంకేతమిచ్చినప్పుడు ఒక షాట్, రెండుసార్లు సంకేతమిచ్చినప్పుడు నిరంతరాయంగా కాల్పులు జరపాలని ఆదేశించగా.. ఆ 10 మంది ఉగ్రవాదులు గురి తప్పకుండా లక్ష్యాలను ఛేదించారు. ఈ ప్రదర్శన చూసి సంతోషించిన ఆ మేజర్ జనరల్.. కసబ్ వీపు తట్టి అభినందించినట్లు కసబ్ తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ముంబై మారణహోమానికి 18 ఏళ్లు నిండినా, ఆ కుట్రకు పాఠాలు నేర్పిన పాక్ ఆర్మీ ‘మేజర్ జనరల్ సాహిబ్’ ఎవరనే ప్రశ్న నేటికీ సమాధానం దొరకని మిస్టరీగానే ఉండిపోయింది.