Skip to content
జాతీయం › వార్తలు

పంజాబ్‌ ఎన్నికల్లో హోరాహోరీగా త్రిముఖ పోటీ !

Prajapaksham 26 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
పంజాబ్‌ ఎన్నికల్లో హోరాహోరీగా త్రిముఖ పోటీ !

Punjab Elections

డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌

పంజాబ్‌ రాజకీయ రంగం రాజకీయ పార్టీల మధ్య పోటాపోటీగా మారుతోంది. అదే సమయంలో సామాన్య ప్రజలకు ఇది ఎంతో ఆసక్తికరంగా మారింది. రాజకీయ నాయకులు తమ విధేయతలను మార్చుకోవడం, రాజకీ య పార్టీలు అనుసరిస్తున్న ఎత్తుగడలు సామాన్య ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నాయి. రాజకీయ నాయకుల, పార్టీల కుతంత్రాలను ప్రజలు సులభంగానే పసిగట్టగలరు.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే పంజాబ్‌లో త్రిముఖ రాజకీయ పోరు జరిగే అవకాశం కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి), శిరోమణి అకాలీ దళ్‌ (ఎస్‌ఎడి) తిరిగి పొత్తు ప్రకటించటంతో ఈ పోటీ త్రిముఖ పోరుగా మారింది. అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) తన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. తన ప్రభావాన్ని విస్తరించుకోవ టం బిజెపి లక్ష్యమైనప్పటికీ, ఒంటరి పోరాటం కలిసిరాదని భావించి అకాలీదళ్‌తో పొత్తు పునరుద్ధరించుకుని రాష్ట్రంలో ఎన్‌డిఎకి అకాలీదళ్‌ నాయకత్వాన్ని అంగీకరించింది. అకాలీ దళ్‌ తన పాత రాజకీయ పునాదిని తిరిగి దక్కించుకేనేందుకు శ్రమిస్తోంది. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, ఈసారి పార్టీల మధ్య పోటీ మరింత తీవ్రంగా ఉంటుందనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం రాజకీయ విధేయతలు మారే కాలం నడుస్తున్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌, అకాలీ దళ్‌ పార్టీలకు చెందిన అనేకమంది నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి బిజెపి చాలా చురుకుగా వ్యవహరిస్తోంది. నవంబర్‌ 19న ఇలాంటి మార్పు ఒకటి చోటుచేసుకుంది. లూథియానా, మోగా, సంగ్రూర్‌ జిల్లాలకు చెందిన ఆప్‌, కాంగ్రెస్‌, ఆకాలీదళ్‌ పార్టీల కీలక నాయకులు తమ వందలాది మంది అనుచరులతో కలిసి బిజెపిలో చేరారు.
చండీగఢ్‌లోని పంజాబ్‌ బిజెపి ప్రధాన కార్యాలయంలో వీరి చేరిక కార్యక్రమం జరిగింది. బిజెపిలో చేరిన వారిలో మోగాకు చెందిన ఆప్‌ నాయకుడు, అధికార ప్రతినిధి నవదీప్‌ సింగ్‌ సంఘా, రాయ్‌కోట్‌కు చెందిన సీనియర్‌ అకాలీ నాయకుడు సురీందర్‌ సింగ్‌ చౌహాన్‌, పంజాబ్‌ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌యుఐ మాజీ అధ్యక్షుడు హార్దిక్‌ నైన్‌ (లెహ్రాగాగా) ఉన్నారు.
ఆప్‌ అధికార ప్రతినిధి నవదీప్‌ సింగ్‌ సంఘాతో పాటు, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు,మోగా ‘ఇంటలెక్చువల్‌ వింగ్‌’ ఇన్‌ఛార్జ్‌ మన్‌దీప్‌ సింగ్‌ గిల్‌, అలాగే పంజాబ్‌ ఎస్‌సి, బిసి వింగ్‌ జాయింట్‌ సెక్రటరీ సుఖ్‌దీప్‌ సింగ్‌ ధామీ కూడా బిజెపిలో చేరారు. ఈ చేరికల సందర్భంగా ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది.‘ఆల్‌ ఇండియా హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌’ (ఎఐహెచ్‌ఆర్‌సి)కి చెందిన సుమారు 25 మంది బాధ్యులు బిజెపి సిద్ధాంతాలను స్వీకరించారు! ఇది ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే ఎఐహెచ్‌ఆర్‌సి తనకు తానుగా మానవ హక్కులు, సమానత్వం, ప్రజల గౌరవాన్ని పరిరక్షించడానికి పనిచేస్తున్న ఒక రాజకీయేతర లౌకిక సంస్థగా చెప్పుకుంటోంది. బిజెపిలో చేరిన వారిలో దాని జాతీయ అధ్యక్షురాలు ఆశా సింగ్‌ ఆజాద్‌, ఆర్‌టిఐ వింగ్‌ చైర్మన్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ (మొహాలీ), రైతు విభాగం అధ్యక్షుడు హర్‌జిందర్‌ సింగ్‌ ఘుమన్‌, ఎన్‌ఆర్‌ఐ వింగ్‌ చైర్మన్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ ఉన్నారు.
పంజాబ్‌ ప్రజలను ఆశ్చర్యపరిచిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాంగ్రెస్‌ తరఫున 2027 పంజాబ్‌ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించే కీలక పాత్రను అప్పగించిన, రెండుసార్లు ఎంఎల్‌ఎ, కాంగ్రెస్‌ నాయకుడు అయిన హరిదయాల్‌ సింగ్‌ కాంబోజ్‌ కూడా పార్టీని వీడి నవంబర్‌ 19న బిజెపిలో చేరారు. ఆయన 2027 ఎన్నికల కోసం కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీకి కో పనిచేస్తున్నారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కూడా బిజెపిలో చేరారు.
బిజెపి ప్రధానంగా ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను తనవైపు తిప్పుకోవడం ద్వారా రాష్ట్రంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. 2022 పంజాబ్‌ శాసనసభ ఎన్నికల్లో (మొత్తం 117 స్థానాలకు గాను) బిజెపి కేవలం 2 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఆ ఎన్నికల్లో బిజెపికి లభించిన ఓట్ల శాతం కేవలం 6.6 శాతంగా ఉంది. అందుకే ఆ పార్టీ తన పునాదిని విస్తరించుకోవాలని భావిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సహా బిజెపి కేంద్ర నాయకత్వం తరచుగా రాష్ట్రంలో పర్యటిస్తూ, సిక్కు దళితుల్లో బలమైన ప్రభావం కలిగిన పలువురు మత పెద్దలతో సమావేశమవుతున్నారు. 2020లో వివాదాస్పద వ్యవసాయ చట్టాల అంశంపై ఎన్‌డిఏ కూటమి నుంచి బయటకు వచ్చిన శిరోమణి అకాలీదళ్‌తో బిజెపి పొత్తు ఖరారు చేసుకుంది.
2022 ఎన్నికల్లో అకాళీదళ్‌ కేవలం 3 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది, ఆ పార్టీకి లభించిన ఓట్ల శాతం 18.38గా ఉంది. రైతులు, సిక్కు వర్గాల్లో ఆ పార్టీ తన పట్టును గణనీయంగా కోల్పోయింది. ఇప్పుడు ఆ మద్దతును తిరిగి రాబట్టుకునేందుకు అకాలీదళ్‌ ప్రయత్నిస్తోంది. ఆ పార్టీకి ఇది రాజకీయ మనుగడ కోసం జరుగుతున్న పోరాటం. పార్టీ తన వ్యవస్థను పునర్నిర్మించుకోవడానికి ప్రయత్నిస్తోంది. నవంబర్‌ 15న బీబీ జాగీర్‌ కౌర్‌ అకాలీదళ్‌లో తిరిగి చేరడం ఇందుకు స్పష్టమైన సంకేతం.
బిజెపి, అకాలీదళ్‌ గత పొత్తు ఏర్పాటులో బిజెపి సుమారు 23 స్థానాల్లో, అకాలీదళ్‌ 94 స్థానాల్లో పోటీ చేసేవి. అయితే, ప్రస్తుత పొత్తులో బిజెపి 42 నుండి 47 స్థానాలను కోరుతోంది. కాగా అకాలీదళ్‌ సుమారు 70 నుండి 75 స్థానాల్లో పోటీ చేయాలని వారిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికారంలో ఉండడం, రాష్ట్రవ్యాప్తంగా బలమైన నిర్మాణం కలిగి ఉండటం వంటి ప్రయోజనాలతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే, పాలన, ఇచ్చిన హామీల అమలు విషయంలో ఆ పార్టీ అనేక ప్రశ్నలను ఎదుర్కొంటోంది. కాబట్టి, తన పాలనను సమర్థించుకోవాల్సిన అవసరం ఆ పార్టీకి ఉంది. మాదకద్రవ్యాల (డ్రగ్స్‌) సమస్య ఆ పార్టీకి అతిపెద్ద సవాలుగా మారింది. అంతేకాకుండా, ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. మరోవైపు, తాము అధికారంలోకి వస్తే ‘డ్రగ్స్‌ రహిత పంజాబ్‌’ను నిర్మిస్తామని బిజెపికి చెందిన అమిత్‌ షా రాష్ట్రంలో ప్రచారం చేస్తున్నారు. 2022లో ఆమ్‌ ఆద్మీ పార్టీ 42.01 శాతం ఓట్ల వాటాతో 92 సీట్లు గెలుచుకుంది.
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌, గత ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ చేతిలో అధికారాన్ని కోల్పోయింది. పార్టీలోని అంతర్గత కలహాలే ఇందుకు ప్రధాన కారణం, ఈ కలహాలు నేటికీ కొనసాగుతున్నాయి. 2022లో ఆ పార్టీ 22.98 శాతం ఓట్ల వాటాతో 18 సీట్లు గెలుచుకుంది. ముఖ్యంగా తన అంతర్గత విభేదాలను విజయవంతంగా పరిష్కరించుకోగలిగితే, అధికార వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేసుకునే అవకాశం కాంగ్రెస్‌ పార్టీకి ఉంది. గ్రామీణ పంజాబ్‌లో తనకున్న గణనీయమైన మద్దతుతో తిరిగి అధికారంలోకి రావాలని ఆ పార్టీ కోరుకుంటోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతతో ఇబ్బంది పడుతున్నందున, ముఖ్యంగా మరో బలమైన రాజకీయ పార్టీ లేని ఈ తరుణంలో కాంగ్రెస్‌ అతిపెద్ద లబ్ధిదారుగా నిలవడం ఖాయం.
ఇక అమృత్‌ పాల్‌ సింగ్‌, పాంథిక్‌ అంశం కూడా ఉంది. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో అకాలీ దళ్‌ (వారిస్‌ పంజాబ్‌ దే) ఏర్పాటు ఒక ముఖ్యమైన రాజకీయ పరిణామం. ఈ పార్టీ యువ సిక్కు ఓటర్లను ఆకర్షిస్తోంది. ఇది శిరోమణి అకాలీ సాంప్రదాయ పాంథిక్‌ రాజకీయ పునాదికి సవాలు విసరవచ్చు. పంజాబ్‌లో కొత్తగా తలెత్తుతున్న మూడు ప్రధాన రాజకీయ సమస్యలు మాదకద్రవ్యాల బెడద, నిరుద్యోగం, రైతుల సంక్షేమం. క్షీణిస్తున్న శాంతిభద్రతలు, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి మిగిలిన రెండు సమస్యలు.
2022 ఎన్నికల్లో వివిధ పార్టీల పరిస్థితి
మొత్తం స్థానాలు : 117
ఆమ్‌ ఆద్మీ పార్టీ : 92(42.01 శాతం ఓట్లు)
కాంగ్రెస్‌ : 18 (22.98 శాతం ఓట్లు)
అకాలీదళ్‌ : 3 (18.38 శాతం ఓట్లు)
బిజెపి : 2 (6.6 శాతం ఓట్లు)