Skip to content
ఎడిట్ పేజి › వార్తలు

భారత్‌ మధ్య సుహృద్భావం పునరుద్ధరణ

Prajapaksham 25 Nov 2026 0 నిమిషాల పఠనం ఎడిట్ పేజి
భారత్‌ మధ్య సుహృద్భావం పునరుద్ధరణ

Modi and Nepal PM

పొరుగు హిమాలయ పర్వతదేశం నేపాల్‌ ప్రధానమంత్రి బాలేంద్ర షా పదవీ బాధ్యతలు చేబట్టిన సంవత్సరంలోనే తొలి విదేశీ పర్యటనకు భారత్‌ను ఎంచుకుని ఈ రెండు సాంప్రదాయక మిత్రదేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు పునరుద్ధరించారు. భారత్‌ పొరుగున జన్‌ తరం తిరుగుబాటు పర్యవసానంగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదుపరి ఏర్పడిన యువతరం ప్రభుత్వాధిపతి బాలేంద్ర. ప్రజా తిరుగుబాటుతో నేపాల్‌ రాచరిక వ్యవస్థ కూలిపోయి రిపబ్లిక్‌గా అవతరించిన గత రెండు దశాబ్దాల్లో రాజకీయ అనిశ్చితి చోటు చేసుకుంది. నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు నాయకుల మధ్య సఖ్యత పొసగక రెండుగా చీలిపోవటం, సాయుధ పోరాటం విడిచిపెట్టి పార్లమెంటరీ పంథాలోకి వచ్చిన పుష్పకమల్‌ దహల్‌ (ప్రచండ) పార్టీ అధికార ఆపేక్షతో ఆ పార్టీలతో సఖ్యత నెరపలేకపోవటం, ఏ కమ్యూనిస్టు గ్రూపు అధికారంలోకి రావాలన్నా నేపాల్‌ కాంగ్రెస్‌తో పొత్తు అనివార్యం కావటం తరచూ ప్రభుత్వాలు కూలిపోవటానికి ప్రధాన కారణం. చివరగా సిపిఎన్‌(ఎంఎల్‌ నాయకుడు కె.పి.శర్మ ఓలి నేపాలీ కాంగ్రెస్‌తో కలిసి ప్రధానిగా ప్రభుత్వం నడుపుతున్న కాలంలో జన్‌ తరం యువత తిరుగుబాటు చేశారు. అనంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు ప్రకారం ఖఠ్మండు మేయర్‌గా పనిచేసిన యువనేత, ప్రజా నాయకుడు బాలేంద్ర షా నాయకత్వంలో మార్చి 5, 2026 న కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఆరుమాసాలకే ఆగస్టులో భోటెకోసి నదిలో అతితీవ్రమైన వరదలు సంభవించి నేపాల్‌కు అపారనష్టం సంభవించింది. ప్రజాజీవితం, నష్టపోయిన ఆస్తుల పునరుద్ధరణకు అంతర్జాతీయ సహాయం
అవసరమైంది.
ఈ హిమాలయ రాజ్యానికి ఇటువైపు సమీపంలో భారత్‌, అటువైపు దూరంలో చైనా ప్రజా రిపబ్లిక్‌ ఉన్నాయి. ప్రజలు అవలంభించే మతాధిక్యతరీత్యా భారత్‌ తదుపరి నేపాల్‌ రెండో హిందూ దేశంగా ఉంది. ఈ మత సంబంధం వల్లనే ఇరు దేశాల మధ్య చిరకాలం శాంతి సంబంధాలు వర్థిల్లాయి. అయితే నేపాల్‌ రిపబ్లిక్‌గా అవతరించిన తదుపరి భారత్‌తో చిరకాలంగా ఉన్న సమస్యలు, అంతర్గతంగా భారత్‌ అనుకూల జనసమూహాలతో సమస్యల వల్ల గత ప్రభుత్వాలు చైనాతో సంబంధాలు మెరుగుపరుచుకున్నాయి. అది భారత్‌కు రుచించని వ్యవహారం. పొరుగుదేశాలైన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంకలతో సత్సంబంధాలు కొరవడిన భారత ప్రభుత్వం నేపాల్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తదుపరి స్నేహ అభివృద్ధికి చొరవ తీసుకుంది. వరదల విపత్తు వెటనే సహాయం పంపి కొంత ఉపశమనం చేకూర్చింది.
తొలిగా భారత్‌ పర్యటనకు వచ్చిన బాలేంద్ర షాకు ప్రధాని నరేంద్రమోదీ లాంఛనపూర్వక ఘనస్వాగతం పలికారు. సోమవారం చర్చల్లో వరదలు కలుగజేసిన వినాశం నుంచి కోలుకునేందుకు, ఆర్థికాభివృద్ధికి రూ.15 వేల కోట్ల సహాయ ప్యాకేజి ప్రకటించారు. నేపాల్‌ భవిష్యత్‌లో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేందుకు ఈ సహాయం ఉద్దేశించినట్లు మోదీ చెప్పారు. హైదరాబాద్‌ హౌస్‌లో సంయుక్త పత్రికా గోష్టిలో నేపాల్‌ ప్రధాని మాట్లాడుతూ భారతదేశంనుంచి పెట్టుబడులను, పర్యాటకులను నేపాల్‌కు ఆహ్వానించారు. భారత్‌ సహాయంలో రూ.11,500కోట్లు ఎనర్జీ ప్రాజెక్టులకు స్వల్పవడ్డీపై రూపాయిల్లో రుణం, రూ.3500కోట్లు మౌలిక వసతుల ప్రాజెక్టుల పునర్నిర్మాణానికి గ్రాంటు అని భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్త్రీ చెప్పారు.
ఇరు దేశాల మధ్య చిరకాలంగా ఉన్న సరిహద్దు వివాదాల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిందిగా ప్రధానులిరువురూ తమ విదేశీ వ్యవహారాల శాఖల కార్యదర్శులను కోరారు. ఉత్తరాఖండ్‌లో వ్యూహాత్మక ప్రాముఖ్యతగల కాలాపానీ ప్రాంతం వివాదంతోపాటు కాలాపానీ త్రివిధ జంక్షన్‌ వివాదం చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి. ఈ సమస్యలతోపాటు విస్తృతమైన సరిహద్దు సమస్యల అధ్యయనానికి 2016 లో నాటి ప్రధాని శర్మ ఓలి భారత పర్యటన సందర్భంలో ప్రసిద్ధ వ్యక్తుల గ్రూపు (ఇపిజి) ఏర్పాటు చేశారు. ఆ బృందం కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చిన నివేదిక బహిర్గతం కాలేదు.
ప్రధానులు నరేంద్రమోదీ, బాలేంద్ర షా ‘వికసిత్‌ భారత్‌ నేపాల్‌ః భాగస్వామ్యం పునరుజ్జీవం’ పేరుతో విజన్‌ డాక్యుమెంట్‌ ఆమోదించారు. మరో 8 ఒప్పందాలపై కూడా సంతకాలు చేశారు. ఇదే సందర్భంలో, రామాయణ సర్క్యూట్‌ వెంట టూరిజం పెంపొందించేందుకు అయోధ్య నుంచి నేపాల్‌లోని జనక్‌పూర్‌ ధామ్‌ (రామాయణంలోని సీతాదేవి జన్మస్థలంగా ప్రసిద్ధి) మధ్య సరయు ఎక్స్‌ప్రెస్‌ను, ఇరు దేశాల మధ్య సరిహద్దుపై ధార్‌చుల నేపాల్‌ వంతెనను వారు వర్చువల్‌గా ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య ఉద్దేశించిన సహకారం, అభివృద్ధి వేగవంతం కావాలని, స్నేహసంబంధాలు వర్థిల్లాలని ఆశించుదాం!