Karthika Pournami 2026: తెలంగాణలో కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం ఎక్కడెక్కడ? ఫేమస్ ఆలయాల లిస్ట్ ఇదే
Karthika Pournami 2026: తెలంగాణలో కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం ఎక్కడెక్కడ? ఫేమస్ ఆలయాల లిస్ట్ ఇదే
కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం అయ్యిందంటే చాలు, మన కళ్ళ ముందు కనిపించే అత్యంత అద్భుతమైన దృశ్యం ఏదంటే – అది జ్వాలాతోరణమే. రెండు ఎండు అరటి చెట్ల మధ్య నిప్పు అంటించి, దాని కింద నుంచి భక్తులు “ఓం నమః శివాయ” అనుకుంటూ దాటడం… ఆ మంట వెలుగులో ముఖం మీద పడే వెచ్చదనం, ఆ భయం, ఆ భక్తి… దాన్ని మాటల్లో చెప్పలేం, కళ్ళారా చూడాల్సిందే. ఈసారి జ్వాలాతోరణం చూడాలని ఉంది, ఎక్కడికి వెళ్తే బాగుంటుంది? అని చాలామంది అడుగుతుంటారు. మీ కోసం తెలంగాణలో జ్వాలాతోరణానికి అత్యంత ఫేమస్ అయిన 7 గుళ్ల లిస్ట్ తెచ్చాను. రేపు మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి చూసేయండి.
ముందు అసలు జ్వాలాతోరణం అంటే ఏంటి?
చిన్నగా చెప్పాలంటే, ఇది యముడి బాధ నుంచి తప్పించుకునే దారి. త్రిపురాసురుడిని చంపిన తర్వాత శివుడు ఆ మంటల్లో నుంచి వచ్చాడని పురాణం చెబుతుంది. ఆ జ్వాల కింద నుంచి దాటితే, మన పాపాలన్నీ ఆ మంటలో కాలిపోతాయని, మళ్ళీ జన్మ ఉండదని భక్తుల నమ్మకం. అందుకే కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం దాదాపు ప్రతి శివాలయంలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది.
1. వేములవాడ – శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం
తెలంగాణలో జ్వాలాతోరణం అంటే మొదట గుర్తొచ్చే పేరు వేములవాడనే. దీన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఇక్కడ సాయంత్రం 6 గంటల తర్వాత జ్వాలాతోరణం మొదలవుతుంది. రాజన్న దర్శనం చేసుకుని, ధర్మగుండంలో స్నానం చేసి, జ్వాలాతోరణం కింద నుంచి వెళ్తే ఆ అనుభూతే వేరు. రేపు ఇక్కడ లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. వెళ్ళేవాళ్ళు కాస్త ముందే బయలుదేరండి, లేదంటే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతారు.
ఎక్కడ: రాజన్న సిరిసిల్ల జిల్లా
2. కాళేశ్వరం – శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం
గోదావరి, ప్రాణహిత, సరస్వతి మూడు నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర ఉన్న గుడి ఇది. ఇక్కడ జ్వాలాతోరణం చూడటం కూడా ఒక గొప్ప అనుభవం. ముందు గోదావరిలో స్నానం చేసి, స్వామివారిని దర్శించుకుని, సాయంత్రం జ్వాలాతోరణ దర్శనం చేసుకుంటే, ఆ రోజు చేసిన పుణ్యం అంతా ఒక్కచోటే వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ గోదావరి హారతి కూడా చాలా బాగా జరుగుతుంది, దాన్ని మిస్ అవ్వకండి.
ఎక్కడ: జయశంకర్ భూపాలపల్లి జిల్లా
3. కీసరగుట్ట – శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం
హైదరాబాద్ వాళ్ళకి ఇదే బెస్ట్ ఆప్షన్. సిటీకి చాలా దగ్గర, కేవలం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది.
గుట్ట మీద ఉన్న ఈ శివాలయంలో కార్తీక పౌర్ణమి రోజున ఉదయం నుంచే భక్తులు క్యూ కడతారు. సాయంత్రం జ్వాలాతోరణం చాలా ఘనంగా జరుగుతుంది. దూరం వెళ్ళలేని వాళ్ళు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇక్కడికి వెళ్ళడం బెటర్.
ఎక్కడ: మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా, హైదరాబాద్ కి దగ్గర
4. యాదగిరిగుట్ట – లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
యాదగిరిగుట్ట అంటే నరసింహస్వామి గుడి అని అందరికీ తెలుసు. కానీ గుట్ట పైన ఉన్న శివాలయంలో కూడా కార్తీక పౌర్ణమి చాలా ఘనంగా జరుగుతుంది. ఇక్కడ సాయంత్రం సామూహిక కార్తీక దీపోత్సవం, ఆ తర్వాత జ్వాలాతోరణం ఉంటుంది. కొత్తగా కట్టిన గుడి చూస్తూ, దీపాల వెలుగులో జ్వాలాతోరణం చూస్తే కళ్ళు తిప్పుకోలేరు.
ఎక్కడ: యాదాద్రి భువనగిరి జిల్లా
5. భద్రాచలం – శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం
భద్రాచలం అంటే రాముడి గుడి అనుకుంటాం, కానీ కార్తీక పౌర్ణమికి ఇక్కడ కూడా అంతే హడావుడి ఉంటుంది. గోదావరి ఒడ్డున కార్తీక దీపాలు వదలడం, నదీ హారతి చూడటం… ఇదంతా ఒక పండుగలా ఉంటుంది.
ఇక్కడి అనుబంధ ఆలయమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జ్వాలాతోరణం జరుగుతుంది. గోదావరి స్నానం, రాముడి దర్శనం , జ్వాలాతోరణం… మూడు ఒక్కచోటే కావాలంటే భద్రాచలం బెస్ట్.
ఎక్కడ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
6. బాసర – జ్ఞాన సరస్వతి ఆలయం
బాసరలో కూడా కార్తీక పౌర్ణమి చాలా స్పెషల్. ఉదయాన్నే గోదావరిలో స్నానం చేసి, సరస్వతి అమ్మవారిని దర్శించుకుని, సాయంత్రం గోదావరి తీరంలో దీపాలు వదిలితే ఆ అనుభూతి మర్చిపోలేం. ఇక్కడ కూడా శివాలయాల్లో జ్వాలాతోరణం జరుగుతుంది. పిల్లలతో వెళ్ళేవాళ్ళకి ఇది మంచి ఆప్షన్.
7. వరంగల్ – వేయి స్తంభాల గుడి & రామప్ప
వరంగల్ చుట్టుపక్కల వాళ్ళకి రెండు బెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి హన్మకొండలోని వేయి స్తంభాల గుడి, రెండోది రామప్ప ఆలయం.
కాకతీయుల కాలం నాటి ఈ గుళ్ళలో, దీపాల వెలుగులో జ్వాలాతోరణం చూడటం అంటే, చరిత్రలోకి వెళ్ళినట్టే ఉంటుంది. ఇక్కడ కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది.
జ్వాలాతోరణం చూసేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
- పిల్లలను, ముసలివాళ్ళను మంటకి దగ్గరగా తీసుకెళ్ళకండి. కాస్త దూరం నుంచి చూస్తే చాలు.
- నైలాన్, పాలిస్టర్ బట్టలు వేసుకుని వెళ్ళకండి. కాటన్ బట్టలే వేసుకోండి.
- జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళేటప్పుడు తొందరపడకండి. క్యూలో నెమ్మదిగా వెళ్ళండి.