Kartika Purnima 2026: కార్తీక పౌర్ణమి రోజున ఈ 5 తప్పులు అస్సలు చేయకండి… చేస్తే దోషం తగులుతుంది
Kartika Purnima
కార్తీక పౌర్ణమి అంటేనే పుణ్యం తెచ్చిపెట్టే రోజు. ఏడాది మొత్తంలో ఈ ఒక్క రోజు చేసిన పూజ, దానం, దీపం… మిగిలిన అన్ని రోజుల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని పెద్దలు చెబుతుంటారు. కానీ మనం తెలియక చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల, చేసిన పుణ్యం అంతా పోయి, దోషం మిగిలిపోతుంది. పండుగ రోజున ఉత్సాహంలో మనం సాధారణంగా చేసే 5 తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడండి.
1. దీపం వెలిగించి ఊది ఆర్పడం
ఇది చాలామంది చేసే అతిపెద్ద తప్పు. దీపం పెట్టాక ఫోటోలు తీసుకుని, హారతి అయ్యాక, “అయిపోయింది కదా” అని ఊది ఆర్పేస్తుంటారు.
ఎందుకు చేయకూడదు? దీపంలో అగ్నిదేవుడు, లక్ష్మీదేవి ఉంటారని నమ్మకం. నోటితో ఊది ఆర్పడం అంటే వారిని అవమానించినట్టే. దీపం దానంతట అదే కొండెక్కే వరకు వదిలేయాలి. ఒకవేళ ఆర్పాల్సి వస్తే, ఒక పువ్వుతో సున్నితంగా ఆర్పాలి, నోటితో ఎప్పుడూ ఊదకూడదు.
2. మాంసాహారం, మద్యం తీసుకోవడం
“పొద్దున్నే పూజ చేసేసాం కదా, సాయంత్రం ఏం తింటే ఏం?” అని చాలామంది అనుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున ఒక్క పూట కూడా మాంసాహారం తినకూడదు.
ఈ రోజు శివుడికి, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసం, మద్యం ముట్టుకున్నా కూడా, చేసిన ఉపవాసం, దీపారాధన ఫలితం ఉండదు. రేపు ఒక్క రోజు పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోండి. కుదరకపోతే కనీసం ఒక్క పూటైనా భోజనం మానేయండి.
3. తులసి కోట దగ్గర చెప్పులతో తిరగడం
కార్తీక మాసం అంటేనే తులసి పూజ. పౌర్ణమి రోజున తులసి కోట దగ్గర 365 వత్తుల దీపం పెడతాం. కానీ చాలామంది చెప్పులు వేసుకునే అక్కడికి వెళ్లి, దీపాలు పెట్టేసి వచ్చేస్తారు.
తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ ప్రదేశంలో చెప్పులతో తిరగడం మహా దోషం. దీపం పెట్టే ముందు కాళ్ళు కడుక్కుని, చెప్పులు విడిచి వెళ్ళండి. అలాగే దీపం పెట్టిన చోట ఎవరైనా చెప్పులతో తొక్కకుండా చూసుకోండి.
4. ఇంట్లో గొడవ పడడం, ఇతరులను తిట్టడం
ఇది చాలా ముఖ్యమైన విషయం. పండుగ రోజున దీపాలు పెట్టడానికి, పిండి వంటలు చేయడానికి హడావుడి పడి, ఇంట్లో వాళ్ల మీద అరుస్తూ ఉంటాం. “అది తీసుకురా, ఇది చెయ్యి” అని కోపంతో మాట్లాడుతుంటాం.
నిజం చెప్పాలంటే, మనం ఎన్ని దీపాలు పెట్టామన్నది కాదు, ఏ మనసుతో పెట్టామన్నదే ముఖ్యం. కోపంతో, విసుగుతో పెట్టిన దీపానికి ఏ ఫలితమూ ఉండదు. రేపు రోజంతా ఎవరితోనూ గొడవ పడకండి. ఎవరైనా తప్పు చేసినా, ఒక్క రోజు క్షమించేయండి. నవ్వుతూ దీపం పెడితే, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.
5. నదిలో స్నానం చేసి బట్టలు, ప్లాస్టిక్ వదిలేయడం
కార్తీక పౌర్ణమి రోజున నదీ స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వేలమంది నదుల దగ్గరికి వెళ్తారు. కానీ స్నానం చేశాక, వాడిన బట్టలు, ప్లాస్టిక్ కవర్లు, పూజ సామాను అక్కడే నదిలో వదిలేసి వస్తుంటారు.
గంగమ్మను పవిత్రంగా చూసుకునే మనమే, ఆమెను మురికి చేస్తే ఎలా? పుణ్యం కోసం వెళ్లి పాపం మూటకట్టుకోవద్దు. మీ పూజ సామాను అంతా ఒక కవర్లో వేసుకుని, డస్ట్ బిన్ లోనే వేయండి. నదిని శుభ్రంగా ఉంచడం కూడా ఒక పూజే.
పూజ అంటే భయంతో చేయాల్సిన పని కాదు. భక్తితో, ప్రేమతో చేయాల్సిన పని. పై 5 తప్పులు చేయకుండా, మనసు పెట్టి ఒక్క దీపం పెట్టినా చాలు, ఆ శివయ్య మీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు.