Skip to content
బిజినెస్ › వార్తలు

Bisleri Water Controversy: బిస్లరీ వాటర్ వివాదం.. నీరు సురక్షితమే అంటున్న కంపెనీ.. ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలతో కలకలం..

jagan 23 Nov 2026 1 నిమిషాల పఠనం బిజినెస్
Bisleri Water Controversy: బిస్లరీ వాటర్ వివాదం.. నీరు సురక్షితమే అంటున్న కంపెనీ.. ఎఫ్ఎస్ఎస్ఏఐ చర్యలతో కలకలం..

Bisleri Water

Bisleri Water Controversy: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ ‘బిస్లరీ’ (Bisleri) నీటి నాణ్యత విషయంలో భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (FSSAI) చేసిన ప్రకటన, దానికి బిస్లరీ యాజమాన్యం ఇచ్చిన వివరణ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. బిస్లరీ ప్రాంగణం నుంచి సేకరించిన ‘ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్’ (మినరల్ వాటర్ కాకుండా) నమూనా నిర్దేశిత భద్రతా ప్రమాణాలను అందుకోవడంలో విఫలమైనందున, బిస్లరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌పై చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదివారం వెల్లడించింది.

సదరు నీటి నమూనాలో ‘బ్రోమేట్’ స్థాయిలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలడంతో, ఆహార భద్రత , ప్రమాణాల చట్టం-2006 ప్రకారం దానిని సురక్షితం కానిదిగా ప్రకటించినట్లు సంస్థ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. ఈ ప్రాథమిక నివేదికపై బిస్లరీ అప్పీల్ చేయడంతో, ఆ నమూనాను మరిన్ని పరీక్షల కోసం రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించగా, అక్కడ కూడా ‘పాలీన్యూక్లియర్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు’ గుర్తించడంతో నమూనా సురక్షితం కాదని నిర్ధారించినట్లు నియంత్రణ సంస్థ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో ఆహార భద్రత నిబంధనలు పాటించలేదన్న కారణంతో ఊర్మి లైఫ్‌సైన్సెస్ ఎల్‌ఎల్పీ, గౌర్ ఆయుర్వేదిక్ స్టోర్‌ల లైసెన్సులను కూడా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సస్పెండ్ చేసింది.

మరోవైపు, నీటి నాణ్యతపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి నోటీసులు అందుతున్నాయంటూ వెలువడిన వార్తా కథనాలపై బిస్లరీ సంస్థ తాజాగా స్పందిస్తూ.. తమ నీరు పూర్తిగా సురక్షితమని వినియోగదారులకు భరోసా ఇచ్చింది. ఎలాంటి సంకోచం లేకుండా బిస్లరీ నీటిని తాగవచ్చని స్పష్టం చేసిన సంస్థ, గోవా ప్లాంట్‌లో తయారైన ఒక బ్యాచ్ బాటిళ్లలో బ్రోమేట్ పరిమితికి మించి ఉన్నట్లు వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చింది.

ఈ ఉదంతం సుమారు 14 నెలల క్రితం నాటిదని పేర్కొన్న బిస్లరీ, అప్పట్లో ఆహార ఔషధ నియంత్రణ సంస్థ నిర్వహించిన పరీక్షల్లో మొదటి ఐదు శాంపిల్స్‌లో ఎలాంటి సమస్యా రాలేదని, కేవలం ఆరో శాంపిల్‌లో మాత్రమే బ్రోమేట్ స్థాయి కొద్దిగా ఎక్కువగా నమోదైందని తెలిపింది. దీనిపై తాము అప్పీల్ చేయగా, రిఫరల్ ల్యాబ్‌లో మళ్లీ జరిగిన పరీక్షల్లో తమకు క్లీన్‌చిట్ వచ్చిందని యాజమాన్యం వెల్లడించింది.

తాము నాణ్యత విషయంలో అత్యంత కఠినమైన ప్రమాణాలను పాటిస్తామని, పది దశల్లో 90కి పైగా నాణ్యత పరీక్షలు నిర్వహించిన తర్వాతే నీటి బాటిళ్లను మార్కెట్లోకి విక్రయానికి పంపిస్తామని బిస్లరీ స్పష్టం చేసింది. వినియోగదారుల ఆరోగ్యమే తమకు తొలి ప్రాధాన్యమని పునరుద్ఘాటించిన సంస్థ, తాజా వివాదానికి సంబంధించి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ చేపట్టే విచారణకు అన్ని రకాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చింది.