Water Safety Alert: బిస్లరీ వివాదం ఎఫెక్ట్.. బాటిల్ వాటర్‌పై ఎఫ్ఎస్ఎస్ఏఐ కొరడా.. అన్ని కంపెనీల శాంపిల్స్ పరీక్ష..
FSSAI
Water Safety Alert: ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ ‘బిస్లరీ’ (Bisleri) వ్యవహారంలో ఇటీవల తలెత్తిన వివాదం నేపథ్యంలో.. భారత ఆహార భద్రత , ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) దేశవ్యాప్తంగా తన తనిఖీలను ముమ్మరం చేసింది. కేవలం ఒక బ్రాండ్‌కే పరిమితం కాకుండా, దేశీయ మార్కెట్లో విక్రయిస్తున్న అన్ని రకాల బాటిల్ వాటర్ బ్రాండ్లను అధికారులు పూర్తిస్థాయి నిఘా పరిధిలోకి తీసుకొచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా, నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలు పాటించని తాగునీటి తయారీ , సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా సంస్థ కీలక అడుగులు వేస్తోంది.
ఈ ప్రత్యేక తనిఖీ డ్రైవ్‌లో భాగంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న వివిధ ప్యాకేజ్డ్ వాటర్ బ్రాండ్ల నుంచి అధికారులు రాండమ్‌గా నీటి నమూనాలను (శాంపిల్స్) సేకరించారు. అంతకుముందు బిస్లరీతో పాటు పలు ఇతర ప్రధాన, స్థానిక బ్రాండ్ల నమూనాలను కూడా సేకరించి ప్రయోగశాలలకు పంపించారు. వీటికి సంబంధించిన తాజా ల్యాబ్ రిపోర్టులు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా సదరు ఉత్పత్తులు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనేది స్పష్టం కానుంది, లోపాలు తేలితే ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోనున్నారు.
మరోవైపు, ప్రముఖ వాటర్ బ్రాండ్ల ఆదరణను ఆసరాగా చేసుకుని మార్కెట్లోకి వస్తున్న నకిలీ బ్రాండ్ల పైనా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా, అసలైన కంపెనీల పేర్లు, లోగోలు, బాటిల్ డిజైన్ , లేబుల్ రంగులను పోలి ఉండే విధంగా (Look-alike brands) బాటిళ్లను తయారు చేసి మార్కెట్లోకి తెస్తున్న సంస్థలను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇలాంటి మోసపూరిత విధానాలకు పాల్పడుతూ నాణ్యత లేని నీటిని విక్రయిస్తున్న సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరించింది. తాజా శాంపిల్స్ సేకరణ , నిఘా చర్యలతో దేశీయ ప్యాకేజ్డ్ తాగునీటి మార్కెట్ మొత్తాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ తన ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తీసుకువచ్చింది.