Skip to content
జాతీయం › వార్తలు

ప్రజా ఉద్యమాలకు అక్షరాయుధాలు తెలుగునాట వామపక్ష పత్రికల చరిత్ర

Prajapaksham 23 Nov 2026 0 నిమిషాల పఠనం జాతీయం
ప్రజా ఉద్యమాలకు అక్షరాయుధాలు తెలుగునాట వామపక్ష పత్రికల చరిత్ర

Prajapaksham

నందిరాజు రాధాకృష్ణ

తెలుగు పత్రికా రంగ చరిత్రలో వామపక్ష పత్రికలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. అవి కేవలం వార్తలను అందించే సమాచార సాధనాలుగానే కాకుండా, సామాజిక చైతన్యానికి, కార్మికకర్షక ఉద్యమాలకు, భూస్వామ్య వ్యతిరేక పోరాటాలకు, ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణకు అక్షరాయుధాలుగా పనిచేశాయి. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకు తెలుగు సమాజంలో రాజకీయ, సామాజిక పరిణామాలను ప్రభావితం చేయడంలో వామపక్ష పత్రికలు కీలక పాత్ర పోషించాయి. ఆరంభ దశలో ప్రగతిశీల భావజాలానికి పునాదులు వేసి తెలుగునాట వామపక్ష భావజాల వ్యాప్తికి 1930వ దశకం ఒక ముఖ్యమైన మలుపు తిప్పాయి. రష్యా విప్లవ ప్రభావం, మార్క్సిస్టు సిద్ధాంతాలు, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కార్మిక ఉద్యమాలు, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు తెలుగు మేధావులను కూడా ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో వాహిని, ప్రభ, జ్వాల వంటి ప్రగతిశీల ధోరణి కలిగిన పత్రికలు సాహిత్య, సామాజిక చర్చలకు వేదికలయ్యాయి. అభ్యుదయ రచయితల ఉద్యమానికి కూడా ఇవి భావజాల నేపథ్యాన్ని అందించాయి.
1937 డిసెంబరు 15న రాజమండ్రి నుంచి వెలువడిన నవశక్తి కమ్యూనిస్టు భావజాల ప్రచారంలో ఒక ముఖ్యమైన మైలురాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో దాని ప్రచురణకు అంతరాయం ఏర్పడింది. అనంతరం వివిధ రూపాల్లో ప్రచురణ కొనసాగి, 1942లో ప్రజాశక్తి వారపత్రికగా ముందుకొచ్చింది. ప్రజా పోరాటాలకు ప్రతిధ్వనిగా ప్రజాశక్తి 1942లో వారపత్రికగా ఆవిర్భవించి 1945లో దినపత్రిక ప్రచురణ ప్రారంభమైంది. తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రతో విడదీయలేని అనుబంధం కలిగిన పత్రిక, 1940వ దశకంలో ప్రజాశక్తి పత్రిక కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రధాన ప్రచార సాధనంగా ఎదిగింది. రైతాంగ సమస్యలు, వ్యవసాయ కార్మికుల దుస్థితి, జమీందారీ వ్యవస్థ దోపిడీ, వెట్టిచాకిరీ, కార్మికుల హక్కులు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఆంధ్ర ప్రాంత రైతాంగ ఉద్యమాలు, కార్మిక సంఘాల పోరాటాలకు సంబంధించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వామపక్ష ప్రచురణలు విశేషంగా దోహదపడ్డాయి. 1948లో ప్రభుత్వ నిషేధం కారణంగా ప్రజాశక్తి ప్రచురణ నిలిచిపోయింది. 1969లో తిరిగి వారపత్రికగా ప్రారంభమై, 1981లో విజయవాడ కేంద్రంగా దినపత్రికగా పునఃప్రారంభమైంది. ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు విస్తరించింది.
రాజకీయ ఆకాంక్షకు పత్రికా రూపమే విశాలాంధ్ర…
కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భాషా సమైక్యతకు బాసటగా నిలిచిన విశాలాంధ్ర 22 జూన్‌ 1952 విజయవాడలో ప్రారంభమైన ప్రముఖ తెలుగు దినపత్రిక. తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలన్న విశాలాంధ్ర ఉద్యమానికి కమ్యూనిస్టులు గట్టి మద్దతునిచ్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుపై చర్చలు, ఆంధ్ర రాష్ట్ర సాధన ఉద్యమం, పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష, ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావం వంటి చారిత్రక పరిణామాల నేపథ్యంలో ఈ పత్రిక తనదైన పాత్ర పోషించింది. రైతులు, కార్మికులు, విద్యార్థులు, మధ్యతరగతి ప్రజల సమస్యలతోపాటు పార్లమెంటరీ రాజకీయాలు, అంతర్జాతీయ పరిణామాలు, సాహిత్య, సాంస్కృతిక అంశాలకు కూడా స్థానం కల్పించింది.
తెలంగాణలో వామపక్ష పత్రికా నేపథ్యం ప్రాముఖ్యత చెప్పుకోతగినది. తెలంగాణలో నిజాం పాలన కాలంలో పత్రికా స్వేచ్ఛపై అనేక ఆంక్షలు ఉండేవి. అయినప్పటికీ ప్రజా చైతన్యం, భాషా సాంస్కృతిక ఉద్యమాలు, ఆంధ్ర మహాసభ కార్యకలాపాలు క్రమంగా విస్తరించాయి. గోలకొండ, మీజాన్‌ వంటి పత్రికలు అప్పటి తెలంగాణ రాజకీయ, సామాజిక పరిణామాలకు వేదికలయ్యాయి. ముఖ్యంగా ఆంధ్ర మహాసభలో వామపక్ష ధోరణులు బలపడిన సమయంలో కమ్యూనిస్టు కార్యకలాపాలకు సంబంధించిన పరిణామాలు పత్రికల్లో ప్రతిబింబించాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేపథ్యంలో భూస్వామ్య వ్యతిరేకత, వెట్టిచాకిరీ నిర్మూలన, భూమి కోసం రైతాంగం చేసిన పోరాటాలు వామపక్ష ప్రచురణల్లో ప్రధాన అంశాలయ్యాయి. తెలుగునాట వామపక్ష పత్రికా రంగం కేవలం ప్రజాశక్తి, విశాలాంధ్ర దినపత్రికలకే పరిమితం కాలేదు. వివిధ కమ్యూనిస్టు పార్టీలు, ప్రజాసంఘాలు, సాహిత్య సంస్థలు తమ భావజాల ప్రచారానికి పత్రికలు, మాసపత్రికలు, వారపత్రికలు, పుస్తక ప్రచురణలను సాధనాలుగా చేసుకున్నాయి. వాటిలో ముఖ్యంగా ప్రస్తావించదగినవి నవతెలంగాణ: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2015లో ప్రారంభమైన వామపక్ష దినపత్రిక. నవచేతన వామపక్ష పుస్తక ప్రచురణలు, అభ్యుదయ భావజాల వ్యాప్తిలో ప్రాధాన్యం వహించింది.
ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ విశాలాంధ్ర: తన ప్రచురణ విస్తరణను కొనసాగించి, ప్రజాపక్షం పత్రికను మొదలెట్టింది.
వీటికి వెన్నుదన్నుగా ప్రగతిశీల సాహిత్య పత్రికలు: అభ్యుదయ రచనలు, సామాజిక వాస్తవికత, శ్రమజీవుల జీవితాలను ప్రతిబింబించే రచనలకు వేదికలయ్యాయి. వామపక్ష ప్రచురణ సంస్థలు పుస్తకాలు, మార్క్సిస్టు సిద్ధాంత గ్రం థాలు, ఉద్యమ చరిత్రలు, అనువాద సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేయడంలో నూ విశేషంగా పనిచేశాయి. 2020లో ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవచేతన తదితర ప్రచురణ సంస్థలు సంయుక్తంగా లక్ష ప్రతుల కమ్యూనిస్టు ప్రణాళికను తెలుగులో ప్రచురించడం ఈ సంప్రదాయానికి ఒక ఉదాహరణ.
వామపక్ష పత్రికలు ప్రధానంగా రైతాంగ సమస్యలు: భూసంస్కరణలు, కౌలు రైతుల హక్కులు, వ్యవసాయ కార్మికుల వేతనాలు; కార్మిక సంక్షేమం: కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, కార్మిక చట్టాలు, ట్రేడ్‌ యూనియన్‌ హక్కుల అంశాలకు ప్రాధాన్యం ఇచ్చాయి. సామాజిక న్యాయం, కులవివక్ష, అంటరానిత నం, మహిళలపై వివక్ష, అణగారిన వర్గాల హక్కులు, పౌర స్వేచ్ఛలు, పత్రికా స్వేచ్ఛ, ప్రభుత్వ విధానాలపై విమర్శనాత్మక విశ్లేషణపై దృష్టి సారించాయి. అధికార పార్టీలకు భిన్నమైన ప్రజా సమస్యల ఆధారిత ప్రత్యామ్నాయ రాజకీయ చర్చ, మారుతున్న కాలంలో వామపక్ష పత్రికల సవాళ్లు గురించి చర్చించాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ, కార్మిక వాడల్లోనూ, విద్యార్థి వసతి గృహాల్లోనూ వామపక్ష పత్రికలకు మంచి ఆదరణ ఉండేది. పార్టీ కార్యకర్తలు, ప్రజాసంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, మేధావులు వాటిని క్రమం తప్పకుండా చదివేవారు. పత్రికల సంపాదకీయా లు రాజకీయ చర్చలకు దిశానిర్దేశం చేసేవి. కాలక్రమంలో రాజకీయ సమీకరణాలు మారి, కమ్యూనిస్టు పార్టీల ఎన్నికల ప్రాబల్యం తగ్గడం, పాఠకుల అభిరుచుల్లో మార్పులు, టెలివిజన్‌, డిజిటల్‌ మీడియా విస్తరణ, ముద్రణ వ్యయాల పెరుగుదల, ప్రకటనల ఆదాయంలో అసమానతలు వామపక్ష పత్రికల ముందున్న సవాళ్లుగా మారాయి. పార్టీ విధానాలను సమర్థించడం, ప్రజా సమస్యలను స్వతంత్రంగా విశ్లేషించడం మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం మరోవైపు పెరిగింది. ప్రజల ఆదరణను నిలబెట్టుకోవాలంటే విమర్శనాత్మక దృక్పథం, నిష్పాక్షిక వార్తా సేకరణ, పరిశోధనాత్మక జర్నలిజం, నూతనతరానికి చేరువయ్యే డిజిటల్‌ ప్రచురణలు అవసరం ఏర్పడింది.
అక్షర పోరాటానికి చరిత్ర ఉంది.. భవిష్యత్తుకు సవాళ్లున్నాయి. తెలుగునాట వామపక్ష పత్రికల చరిత్ర పరిశీలిస్తే అది కేవలం కొన్ని పత్రికల ప్రచురణ మాత్రమే కాదు. రైతాంగ పోరాటాలు, కార్మిక ఉద్యమాలు, సామాజిక సంస్కరణలు, ప్రజాస్వామిక హక్కుల సాధన, అభ్యుదయ సాహిత్య వికాసం వంటి అనేక ప్రజా ఉద్యమాల సమాంతర అంశాల ప్రస్తావన.
ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం రాష్ట్ర సమస్యల ప్రాధాన్యతతో ప్రజాశక్తి, విశాలాంధ్ర రెండు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వేర్వేరు పత్రికలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన (2 జూన్‌ 2014) అనంతరం తెలుగు పత్రికా రంగంలోనూ ప్రాంతీయ పునర్వ్యవస్థీకరణ చోటుచేసుకుంది. ముఖ్యంగా వామపక్ష భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలు రెండు రాష్ట్రాల రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా తమ ప్రచురణ కార్యకలాపాలను విస్తరించాయి.
ప్రజాశక్తి: ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రచురణను కొనసాగిస్తూనే, తెలంగాణలో వామపక్ష భావజాలానికి ప్రాతినిధ్యం వహించే ప్రత్యేక దినపత్రికగా 2015 మార్చి 21న నవతెలంగాణ ప్రారంభమైంది.
విశాలాంధ్ర: ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ తన ప్రచురణ విస్తరణను కొనసాగించి, ప్రజాపక్షం పత్రికను 2018లో మొదలెట్టింది. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక ప్రచురణ జరిగింది.
ఈ పరిణామాన్ని తెలుగునాట వామపక్ష పత్రికా చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా విశ్లేషించవచ్చు. రాష్ట్ర విభజనతో మారిన రాజకీయ ప్రాధాన్యతలు, ప్రాంతీయ సమస్యలు, ప్రజా ఉద్యమాలు, కార్మిక, రైతాంగ పోరాటాలు, ప్రభుత్వ విధానాలు, ప్రజా సంక్షేమ అంశాలకు ఈ పత్రికలు తమ సంపాదకీయాల్లో ప్రాధాన్యమిచ్చే పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల్లో వామపక్ష పత్రికలు తమ భావజాల నిబద్ధతను కొనసాగిస్తూనే, ఆయా రాష్ట్రాల ప్రజల సమస్యలను ఎంతవరకు ప్రతిబింబించగలిగాయి, మారుతున్న పత్రికా రంగంలో వాటి పాఠకాదరణ, ఆర్థిక మనుగడ, రాజకీయ ప్రభావం ఎలా ఉన్నాయనే అంశాలు ప్రత్యేకంగా పరిశీలించాలి.
ప్రజాశక్తి, విశాలాంధ్ర, నవతెలంగాణ, ప్రజాపక్షం వంటి పత్రికలు తమదైన రాజకీయ, భావజాల నేపథ్యంతో కొనసాగుతున్నాయి. గత వైభవాన్ని మాత్ర మే ప్రస్తావించుకుంటూ వర్తమాన సవాళ్లను విస్మరించలేవు. ఒకప్పుడు వామపక్ష పత్రికలు ప్రజా ఉద్యమాలకు గొంతుకలయ్యాయి.

ట్యాగ్‌లు: CPI CPI news Today news