Skip to content
తెలంగాణ › వార్తలు

మేడిగడ్డను కాంగ్రెస్ నాయకులే బాంబులతో పేల్చేశారు…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

Krishna Rao 19 Nov 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
మేడిగడ్డను కాంగ్రెస్ నాయకులే బాంబులతో పేల్చేశారు…కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు..

చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు.. కరవు నిర్వహణలో ఏపీ సీఎం భేష్ అంటూ వ్యాఖ్యలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన ‘రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం’ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

వివరాల్లోకి వెళితే భూపాలపల్లి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు గురువారం కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఓట్లు కావాలని తాము ఎప్పుడూ తప్పుడు హామీలు ఇవ్వలేదని, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ గతంలో చేసిన విమర్శలు నిజమవుతున్నాయని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ఆ పార్టీ ఎమ్మెల్యేలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని కాంగ్రెస్ నాయకులే చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో కేవలం ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండగా, కేసీఆర్ పాలనలో వాటి సంఖ్యను 32కు పెంచామని వివరించారు.

భట్టి విక్రమార్కపై కేటీఆర్ సెటైర్లు

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై కూడా కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నటనలో కమల్‌హాసన్‌ను మించిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీల అమలుపై హనుమాన్ ఆలయంలో ప్రమాణం చేసి అఫిడవిట్ ఇచ్చిన భట్టి విక్రమార్క.. ఆ హామీలను నెరవేర్చలేకపోయారని విమర్శించారు. ఎన్నికల సమయంలో వంద రోజుల్లోనే హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారని, కానీ మూడేళ్లు గడుస్తున్నా ఆరు గ్యారంటీల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై విమర్శలు చేస్తూ ఆయన రెగ్యులర్ సీఎం కాదని, రెన్యువల్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఢిల్లీలోని తమ అధిష్ఠానాలకు బానిసలుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.

మేడిగడ్డపై సంచలన ఆరోపణలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ అంశాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. మేడిగడ్డను కాంగ్రెస్ నాయకులే బాంబులతో పేల్చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఇంజినీర్లు ఫిర్యాదు కూడా చేశారని పేర్కొన్నారు. బ్యారేజీలో దెబ్బతిన్న రెండు పిల్లర్లకు మూడేళ్లుగా మరమ్మతులు చేయించలేకపోతున్నారని మండిపడ్డారు.

వరదల కారణంగా మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా దెబ్బతినేలా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. సుమారు రూ.400 కోట్లతో పూర్తయ్యే మరమ్మతుల పనులకు రూ.4 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం చూస్తోందని విమర్శించారు. ప్రజాధనాన్ని వృథా చేసే ప్రయత్నాలను సహించబోమని అన్నారు.

4.70 లక్షల పెన్షన్లు తొలగించారంటూ విమర్శలు

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. గత మూడేళ్లలో సుమారు 4.70 లక్షల పెన్షన్లను తొలగించారని ఆరోపించారు. మరోవైపు ఇప్పుడు కొత్తగా 4.65 లక్షల పెన్షన్లు మంజూరు చేస్తున్నామని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కొత్త పెన్షన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామాలకు తెరతీస్తోందని మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. రాబోయే రోజుల్లో ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్‌లు: Telangana