చెక్ బౌన్స్ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష.. రూ.95 లక్షల జరిమానా..
తెలుగు సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో ఫిర్యాదుదారుడికి అయిన న్యాయపరమైన ఖర్చులను కూడా బండ్ల గణేష్ భరించాలని కోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
అసలు ఈ కేసు విషయానికి వస్తే.. జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ తన నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో రూ.95 లక్షల విలువైన చెక్కును జారీ చేశారు. అయితే, ఆ చెక్కును బ్యాంకులో జమ చేయగా ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. దీంతో తనకు రావాల్సిన డబ్బులు చెల్లించాలని వెంకటేశ్వర్లు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
దీంతో ఆయన న్యాయపోరాటానికి దిగారు. చెక్ బౌన్స్ వ్యవహారంపై కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు, కేసుకు సంబంధించిన అంశాలను పరిశీలించింది. విచారణ అనంతరం బండ్ల గణేష్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఏడాది జైలు శిక్ష విధించింది. రూ.95 లక్షల జరిమానాతో పాటు ఫిర్యాదుదారుడి న్యాయపరమైన ఖర్చులను కూడా చెల్లించాలని ఆదేశించింది.
2023 నాటి కేసు.. హైకోర్టుకు వెళ్తానన్న బండ్ల గణేష్
మరోవైపు కోర్టు తీర్పుపై బండ్ల గణేష్ స్పందించారు. ఈ వ్యవహారం 2023లో చోటుచేసుకుందని తెలిపారు. ఈ కేసులో తాము గతంలోనే దరఖాస్తు చేసుకున్నప్పటికీ తీర్పు తమకు వ్యతిరేకంగా వచ్చిందని పేర్కొన్నారు. దీంతో తదుపరి న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయిస్తానని స్పష్టం చేశారు.
సినిమా నిర్మాణ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్.. నిర్మాతగానే కాకుండా నటుడిగా, పలు రాజకీయ అంశాలపై తన వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు రూ.95 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు విధించిన శిక్ష, ఆయన తదుపరి న్యాయపరమైన చర్యలపై ఆసక్తి నెలకొంది. హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన ప్రకటించిన నేపథ్యంలో ఈ కేసులో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది చూడాలి.