ఆదిలాబాద్‌లో చేయూత పింఛన్లపై రాజకీయ రగడ.. పాయల్ శంకర్ పేరుతో లేఖల పంపిణీపై సర్పంచుల అభ్యంతరం…
పాయల్ శంకర్
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ వ్యవహారం ఆదిలాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వివాదానికి దారితీసింది. లబ్ధిదారులకు అందజేస్తున్న పింఛన్ మంజూరు పత్రాలను బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరుతో ఉన్న కవర్లలో పంపిణీ చేయడంపై కాంగ్రెస్, బీఆర్ఎస్కు చెందిన సర్పంచులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకానికి ఎమ్మెల్యే వ్యక్తిగత పేరు ఎలా ఉపయోగిస్తారని వారు ప్రశ్నించారు.
ఆదిలాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధిలోని గ్రామాల్లో బీజేపీ నాయకులు పాయల్ శంకర్ పేరుతో ఉన్న కవర్లలో చేయూత పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నారని సర్పంచులు ఆరోపించారు. ప్రభుత్వ పథకాన్ని ‘శంకర్ అన్న పథకం’గా మార్చి రాజకీయ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వ నిబంధనలు, ప్రోటోకాల్ ప్రకారం గ్రామాల్లో పింఛన్ మంజూరు పత్రాలను సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి సమక్షంలో పంపిణీ చేయాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఇందుకు ఆధారంగా ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామంలో పంపిణీ చేసినట్లు చెబుతున్న పాయల్ శంకర్ పేరు ఉన్న కవరును వారు చూపించారు. చేయూత పింఛన్ పత్రాలను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) నుంచి బీజేపీ నాయకులు నేరుగా తీసుకుంటున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్కు చెందిన చందా (టి) సర్పంచ్ కె. మంజూష ఈ వ్యవహారంపై స్పందిస్తూ.. గ్రామంలో మొత్తం 64 మంది చేయూత పింఛన్ లబ్ధిదారులు ఉండగా, వారిలో 25 మందికి మాత్రమే ఎమ్మెల్యే పాయల్ శంకర్ స్వయంగా ప్రొసీడింగ్స్ కాపీలు అందజేశారని తెలిపారు. మిగిలిన పత్రాలను గ్రామంలో పంపిణీ చేయాలని బీజేపీ నాయకులకు అప్పగించారని ఆరోపించారు. ఎన్నికైన సర్పంచ్‌గా తనకు గ్రామంలో ఏం బాధ్యత ఉంటుందని ఆమె ప్రశ్నించారు. మిగిలిన పత్రాలను గ్రామ కార్యదర్శికి అప్పగిస్తే స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు అందజేసే అవకాశం ఉండేదని అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్‌కు చెందిన బేల మండలం బెడోడా ఉప సర్పంచ్ బలేరావు సురేందర్, పోచెర గ్రామ పంచాయతీ సర్పంచ్ కడారపు గంగన్న కూడా ఇదే అంశంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులు పంపిణీ నిబంధనలను పాటించడం లేదని, ప్రభుత్వ పథకాన్ని వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు.
చేయూత పింఛన్ల పంపిణీలో స్థానిక ప్రజాప్రతినిధుల పాత్ర, ప్రోటోకాల్ అంశాలు ఇప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారాయి.