Telangana High Court: టాస్క్‌ఫోర్స్ సోదాలపై తెలంగాణ హైకోర్టు సీరియస్.. డీజీపీ, హోంశాఖ, సీపీలకు నోటీసులు.. కౌంటర్ దాఖలుకు ఆదేశం!
TS High court
Telangana High Court: హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా సోదాలు, తనిఖీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ దాఖలైన రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ టి. మాధవి దేవి.. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, టాస్క్‌ఫోర్స్ డీసీపీలకు నోటీసులు జారీ చేశారు. పిటిషన్‌లో లేవనెత్తిన ఆరోపణలపై సమగ్ర వివరణతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు.
బోరబండ ప్రాంతానికి చెందిన బి. బాలరాజ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పోలీసు యూనిఫాం ధరించకుండా, తమ గుర్తింపును కూడా వెల్లడించకుండా సాధారణ పౌర దుస్తుల్లో వచ్చి ఇళ్లలో తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నారని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే సోదాలు చేయడం, వస్తువులను స్వాధీనం చేసుకోవడం, కనీసం రసీదులు కూడా ఇవ్వకపోవడం పూర్తిగా చట్టవిరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.
విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్ గోపాల్ వాదనలు వినిపిస్తూ.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకముందే ఏకపక్షంగా దర్యాప్తు చేపట్టడం ‘భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) 2023’ సెక్షన్ 173(1) నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. సంబంధిత వ్యక్తులకు తమ వాదన వినిపించే అవకాశం ఇవ్వకుండా, పారదర్శకత లేకుండా వ్యవహరించడం వల్ల చట్టపరమైన రక్షణ హక్కులకు భంగం కలుగుతోందని వాదించారు.
ముఖ్యంగా సెర్చ్ వారెంట్లు జారీ చేసే అధికారం కేవలం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌లకు మాత్రమే ఉంటుందని, ఏసీపీ స్థాయి అధికారులు సెర్చ్ వారెంట్లు జారీ చేయడం చట్టబద్ధం కాదని న్యాయవాది స్పష్టం చేశారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను డిసెంబరు నెలకు వాయిదా వేశారు. టాస్క్‌ఫోర్స్ పనితీరుపై హైకోర్టు నేరుగా నోటీసులు జారీ చేయడం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.