Hyderabad Liquor Fraud: ఖరీదైన బ్రాండ్ల సీసాలలో చీప్ లిక్కర్.. స్వీట్లలో నకిలీ వెండి రేకులు.. హైదరాబాద్‌లో నకిలీ ముఠా గుట్టురట్టు..
Hyderabad Liquor Fraud
Hyderabad Liquor Fraud: నగరంలో ఖరీదైన మద్యం బ్రాండ్ల పేరిట సాగుతున్న భారీ కల్తీ దందాను ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు బట్టబయలు చేశారు. ప్రీమియం బ్రాండ్లకు చెందిన ఖాళీ మద్యం సీసాలలో చౌకబారు మద్యాన్ని (చీప్ లిక్కర్) నింపి, అసలైన ఖరీదైన మద్యంగా నమ్మించి విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. ఈ అక్రమ వ్యవహారానికి సంబంధించి ఇద్దరు నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ పరిధిలోని శాతరాయికి చెందిన అశోక్ అనే వ్యక్తి గతంలో ‘బగ్గా డిస్టిలరీ’లో పనిచేశాడు. ఆ తర్వాత ఉపాధి కోసం క్యాబ్ డ్రైవర్‌గా మారాడు. అయితే గతంలో మద్యం తయారీ, ప్యాకింగ్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉండటంతో, దానిని అడ్డుపెట్టుకుని సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా తన నివాసాన్నే కేంద్రంగా చేసుకుని నకిలీ మద్యం తయారీ దందాకు తెరలేపాడు.
స్థానికంగా స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్న యాకూబ్ పాషా అనే వ్యాపారి నుంచి ఖరీదైన బ్రాండ్లకు చెందిన ఖాళీ మద్యం సీసాలను అశోక్ సేకరించేవాడు. ఆ సీసాలను శుభ్రం చేసి, మార్కెట్లో సుమారు రూ.560 విలువ చేసే ‘డౌన్ టెన్’ అనే చౌకబారు మద్యాన్ని వాటిలో నింపేవాడు. అనంతరం సీసాలకు సీల్ వేసి, అవి ఒరిజినల్ ప్రీమియం మద్యం బాటిళ్లుగా కస్టమర్లను నమ్మించి అధిక ధరలకు విక్రయించేవాడు.
ఈ కల్తీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ కానిస్టేబుల్ ధనుంజయ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ అధికారులకు పక్కా సమాచారం అందించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది శాతరాయిలోని అశోక్ ఇంటిపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడి జరిగిన సమయంలో నిందితుడు ఖరీదైన బాటిళ్లలో చీప్ లిక్కర్ నింపుతుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఘటనా స్థలం నుంచి కల్తీ మద్యంతో నింపిన 10 పూర్తి సీసాలతో పాటు, మరో 30 ఖాళీ ప్రీమియం మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అశోక్‌కు ఖాళీ సీసాలను సరఫరా చేస్తున్న స్క్రాప్ వ్యాపారి యాకూబ్ పాషాను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన అధికారులు, ఈ కల్తీ మద్యాన్ని ఎవరెవరికి విక్రయించారు, ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
స్వీట్లు, పాన్ ప్రియులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్‌లో నకిలీ వెండి రేకుల ముఠా గుట్టురట్టు.. నలుగురి అరెస్ట్
నగర ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ, మిఠాయిలు, పాన్ , బేకరీ ఉత్పత్తులపై అలంకరణ కోసం వాడే స్వచ్ఛమైన వెండి రేకుల (సిల్వర్ వర్క్) స్థానంలో ప్రమాదకరమైన అల్యూమినియం రేకులు, పొడిని తయారు చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కమిషనర్స్ టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా పాతబస్తీలోని చార్మినార్, ఫలక్‌నుమా పరిధిలోని నాలుగు అక్రమ తయారీ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించి ఈ భారీ మోసాన్ని బట్టబయలు చేశారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ నకిలీ సరుకును తయారు చేస్తున్న నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని, వారిపై నాలుగు కేసులు నమోదు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో నిందితుల స్థావరాల నుంచి భారీగా నకిలీ సరుకు, యంత్ర సామగ్రి పట్టుబడింది. ఇందులో 49 బండిళ్ల నకిలీ అల్యూమినియం సిల్వర్ ఫాయిల్, 10 కేజీల అల్యూమినియం ఫ్లేక్స్, కేకుల అలంకరణకు వాడే ఒక కేజీ నకిలీ సిల్వర్ కోటెడ్ షుగర్ బాల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు పెద్ద మొత్తంలో కివామ్, పొగాకు, టాల్కమ్ పౌడర్, ఫ్లేవర్డ్ పాన్ చట్నీ, గ్లూకోజ్, మొక్కజొన్న పిండి, జంతు చర్మపు రేకులు, మిక్సర్లు, ప్యాకింగ్ మెషీన్లు , బరువు తూచే యంత్రాలను అధికారులు సీజ్ చేశారు.
నిందితులు ఎలాంటి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) అనుమతులు లేకుండానే ఈ దందాను గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్ నుంచి తక్కువ ధరకు అల్యూమినియం ఫ్లేక్స్ తెప్పించి, వాటిని నకిలీ వెండి రేకులుగా మారుస్తున్నారు. వీటిని కాజు కట్లీ, కాజు రోల్స్, చమ్ చమ్ వంటి ఖరీదైన స్వీట్లతో పాటు మీఠా పాన్లలో యథేచ్ఛగా వాడుతున్నారు. అల్యూమినియం పూత పూసిన షుగర్ బాల్స్‌ను కేకుల తయారీ కోసం బేకరీలకు, అల్యూమినియం పొడిని జర్దా, కిమామ్ వంటి సువాసన పాన్ పదార్థాలకు సరఫరా చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చిన్న దుకాణాలతో పాటు పలు ప్రముఖ స్వీట్ షాపులకు కూడా వీటిని విక్రయిస్తున్నారని, ముఖ్యంగా పండుగల సీజన్లో భారీ ఎత్తున వ్యాపారం సాగిస్తున్నారని పోలీసులు గుర్తించారు.
ఆహార పదార్థాలలో ఉపయోగించడానికి ఏమాత్రం అర్హత లేని అల్యూమినియం లోహాన్ని దీర్ఘకాలం పాటు తింటే శరీరంలో పేరుకుపోయి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు, పోలీసులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. దీనివల్ల మూత్రపిండాలు (కిడ్నీలు) దెబ్బతినడం, నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటం, ఎముకలు బలహీనపడటం , తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 318(4), 110 తో పాటు ఆహార భద్రతా చట్టం నిబంధనల కింద కఠిన కేసులు నమోదు చేశారు.
మరోవైపు, వినియోగదారులు తాము కొనుగోలు చేసే స్వీట్లపై ఉన్నది అసలైన వెండి రేకా లేక నకిలీ అల్యూమినియమా అనే విషయాన్ని ప్రాథమికంగా ఎలా గుర్తించవచ్చో పోలీసులు వివరించారు. వెండి రేకును వేళ్లతో లేదా చేతితో మెల్లగా రుద్దినప్పుడు అది అతి సూక్ష్మమైన పొడిలా చర్మంలో కలిసిపోతే అది అసలైన స్వచ్ఛమైన వెండి అని అర్థం. అలా కాకుండా చేతితో రుద్దినప్పుడు నలిగిపోవడం, చిరిగిపోవడం లేదా చిన్న ఉండలుగా మారితే అది కచ్చితంగా నకిలీ అల్యూమినియం రేకు అని గుర్తించాలని తెలిపారు. అలాగే డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్‌లో వేస్తే అల్యూమినియం కరిగిపోయి హైడ్రోజన్ వాయువు విడుదలవుతుందని, అసలైన వెండి మాత్రం కరగదని పేర్కొన్నారు. అయితే ఇలాంటి రసాయన పరీక్షలను కేవలం ప్రయోగశాలల్లో నిపుణుల సమక్షంలోనే నిర్వహించాలని పోలీసులు స్పష్టం చేశారు.