Skip to content
జాతీయం › వార్తలు

Rahul Gandhi: మా అమ్మ నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించింది.. ఆమె భయపడటాన్ని నేనెప్పుడూ చూడలేదు.. రాహుల్ గాంధీ భావోద్వేగం..

jagan 17 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Rahul Gandhi: మా అమ్మ నాలుగుసార్లు క్యాన్సర్‌ను జయించింది.. ఆమె భయపడటాన్ని నేనెప్పుడూ చూడలేదు.. రాహుల్ గాంధీ భావోద్వేగం..

Rahul and Sonia Gandhi

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీలోని అసాధారణ ధైర్యసాహసాలను, మానసిక స్థైర్యాన్ని కొనియాడుతూ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. తన తల్లి రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ (Belonging: A Journey of Love) పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ, దశాబ్దాలుగా ఆమె ఎదుర్కొన్న వ్యక్తిగత ఆరోగ్య సమస్యలు , జీవిత పోరాటాల గురించి సభలో వెల్లడించారు. తన తల్లి ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు క్యాన్సర్ మహమ్మారిని జయించారని ఆయన తెలిపారు.

పుస్తకంలో తన తల్లి తన ఆరోగ్య సమస్యలను చాలా తక్కువ చేసి రాశారని, కానీ వాస్తవానికి ఆమె నాలుగుసార్లు క్యాన్సర్‌తో పోరాడి గెలిచారని రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. తన తల్లిలో ధైర్యం చాలా ఎక్కువని, తన జీవితంలో ఆమె భయపడటాన్ని ఒక్కసారి కూడా చూడలేదని ఆయన పేర్కొన్నారు. అమ్మ రాసిన ఈ పుస్తకంలో పాఠకులు చదువుతున్నది నాన్న రాజీవ్ గాంధీ చనిపోక ముందు నాటి విషయాలని, ఆ తర్వాత ఆమె జీవితంలో ఎన్నో విపత్కర పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారని వివరించారు. ఇదే వేదికపై ఉన్న తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాను ఉద్దేశించి మాట్లాడుతూ.. అమ్మానాన్నలు నిన్ను ఎంతో ప్రేమించారని, నాన్న నిన్ను చూసి ఎంత గర్వపడేవారో మాటల్లో చెప్పలేనని రాహుల్ ఆప్యాయంగా అన్నారు.

మరోవైపు, ఇదే కార్యక్రమంలో సోనియా గాంధీ సైతం 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న అత్యంత కష్టకాలాన్ని గుర్తుచేసుకున్నారు. తండ్రి మరణానంతరం రాహుల్ గాంధీని అమెరికాలోని ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో చేర్పించామని, అయితే భద్రతా కారణాల వల్ల అక్కడ చదువు కొనసాగించడం సాధ్యం కాలేదని తెలిపారు. రాహుల్‌కు భద్రత కల్పించేందుకు హార్వర్డ్ వర్గాలు అంగీకరించలేదని, అది ఇతర విద్యార్థులకు ప్రమాదకరంగా మారవచ్చని చెప్పి తిరస్కరించాయని సోనియా వివరించారు. దాంతో అనివార్య పరిస్థితుల్లో రాహుల్‌ను హార్వర్డ్ నుంచి వేరొక అమెరికన్ కళాశాలకు మార్చి, నకిలీ గుర్తింపు (మారుపేరు)తో చదివించాల్సి వచ్చిందని ఆ నాటి చేదు జ్ఞాపకాలను ఆమె పంచుకున్నారు.

ట్యాగ్‌లు: Congress Rahul Gandhi Sonia Gandhi