Telangana Employees: OPS కోసం నేడు భారీ నిరసన.. 2.15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు…
Telangana Employees: OPS కోసం నేడు భారీ నిరసన.. 2.15 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల సామూహిక సెలవు...
తెలంగాణలో పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సీపీఎస్ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా నవంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా సామూహిక సెలవు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ (TSCPSEU) ఈ మేరకు కార్యాచరణ ప్రకటించింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ వెల్లడించిన వివరాల ప్రకారం.. అత్యవసర విధుల్లో ఉండే సిబ్బందిని మినహాయించి పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ఈ ఆందోళనలో భాగస్వాములు కానున్నారు.
రాష్ట్రంలోని సుమారు 2.60 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో 45 వేల మందిని అత్యవసర సేవల కోసం మినహాయించారు. మిగిలిన 2.15 లక్షల మంది ఉద్యోగులు సెలవు పెట్టి నిరసన తెలియజేయనున్నారు. ఇప్పటికే దాదాపు 1.5 లక్షల మందికి పైగా ఉద్యోగులు సామూహిక సెలవుల కోసం దరఖాస్తులు సమర్పించినట్లు యూనియన్ నాయకులు వెల్లడించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్మదీక్ష కార్యక్రమాలు చేపట్టి తమ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.
ఎన్నికల హామీని అమలు చేయాలని డిమాండ్
2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలులో భాగంగా పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సీపీఎస్ విధానాన్ని కొనసాగించడం వల్ల పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి అనిశ్చితంగా మారుతోందని యూనియన్ ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఉద్యోగులు తమ జీతంలో 11.5 శాతం మొత్తాన్ని పెన్షన్ కాంట్రిబ్యూషన్ రూపంలో చెల్లిస్తున్నారని నాయకులు తెలిపారు. ఇంత ఆర్థిక భారం భరిస్తున్నప్పటికీ రిటైర్మెంట్ తర్వాత తగినంత పెన్షన్, వైద్య సదుపాయాల విషయంలో భరోసా లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుత విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
సీఎస్‌కు జన జాగరణ సభ తీర్మానాలు
గత ఆగస్టు 23న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా TSCPSEU ఆధ్వర్యంలో జన జాగరణ సభ నిర్వహించారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఉద్యోగుల సమస్యలతో కూడిన తీర్మానాలను యూనియన్ ప్రతినిధులు తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు అందించారు.
యూనియన్ ప్రధాన కార్యదర్శి కల్వరి శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం సీఎస్‌ను కలిసి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా కేవలం తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ పాత పెన్షన్ విధానం అమలు చేయాలనే డిమాండ్ బలంగా ఉందని ప్రతినిధులు వివరించారు. ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.
నిరసనకు ఉపాధ్యాయ సంఘాల మద్దతు
నవంబర్ 17న చేపట్టనున్న సామూహిక సెలవుల కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డితో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఉద్యమంలో భాగంగా నల్లగొండలో నిర్వహించే ధర్మదీక్షకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా యూనియన్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పాత పెన్షన్ విధానం అమలు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.