AP Gram Panchayat Elections: ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. రెండో విడత నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 29న పోలింగ్.. 18 నుంచి నామినేషన్ల స్వీకరణ..
Election Commission
AP Gram Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మరింత వేడెక్కింది. గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సోమవారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29వ తేదీన రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4,960 సర్పంచ్ పదవులతో పాటు 49,224 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నవంబర్ 21న ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన చేపడతారు. పరిశీలనలో తిరస్కరణకు గురైన అభ్యర్థులు నవంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్పీల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ అప్పీళ్లపై 23న విచారణ జరిపి అధికారులు తుది నిర్ణయం తీసుకుంటారు. నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 24 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు విధించగా, అదే రోజు బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.
పోలింగ్ రోజైన నవంబర్ 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించి, అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిస్తారు. ఫలితాల ప్రకటన తర్వాత గెలిచిన వార్డు సభ్యులతో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహిస్తారు. ఒకవేళ అనివార్య కారణాలతో ఎక్కడైనా పోలింగ్ నిలిచిపోతే, అవసరమైన చోట్ల నవంబర్ 30న రీ-పోలింగ్ జరుపుతామని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఖరారైన షెడ్యూల్ ప్రకారం తొలి విడత పోలింగ్ నవంబర్ 26న, రెండో విడత నవంబర్ 29న, మూడో విడత డిసెంబర్ 2న జరగనుంది. ఈ మూడు దశల్లో కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,167 సర్పంచ్ పదవులు, 1.32 లక్షలకు పైగా వార్డు సభ్యుల స్థానాలను భర్తీ చేయనున్నారు.