Skip to content
జాతీయం › వార్తలు

Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు జీవిత ఖైదు సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..

jagan 16 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసు.. ఇద్దరు దోషులకు జీవిత ఖైదు సస్పెండ్ చేస్తూ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..

supreme court

Bilkis Bano Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం, కుటుంబ సభ్యుల హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దోషులైన బిపిన్‌చంద్ కన్హయ్యాలాల్ జోషి, ప్రదీప్ రమణ్‌లాల్ మోధియాలకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ, వారి జీవిత ఖైదు శిక్షను సస్పెండ్ చేసింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ పి.బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే వీరు 17 ఏళ్లకు పైగా జైలు జీవితం గడపడం, వారి అప్పీల్‌లో పలు వాస్తవాలు , చట్టపరమైన అంశాలను లోతుగా పరిగణించాల్సి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయస్థానం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

తమకు విధించిన జీవిత ఖైదు శిక్షను సమర్థిస్తూ 2017 మే నెలలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ జోషి, మోధియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా దోషుల్లో ఒకరైన బిపిన్‌చంద్ జోషి తీవ్ర వికలాంగుడనే (దివ్యాంగుడు) విషయాన్ని కూడా ధర్మాసనం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి వీరికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే, నేర తీవ్రత అత్యంత దారుణంగా ఉన్న దృష్ట్యా దోషులకు బెయిల్ ఇవ్వడాన్ని ప్రభుత్వ తరపు అదనపు సొలిసిటర్ జనరల్ రాజ్‌కుమార్ భాస్కర్ థాకరే తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై దోషుల తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సోనియా మాథుర్ వాదనలు వినిపిస్తూ.. ప్రాథమిక ఎఫ్ఐఆర్‌లో ఒక దోషి పేరు లేదని, ఘటన జరిగిన దాదాపు మూడేళ్ల తర్వాత కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలు కూడా పోలీసులకు లేదా వైద్య పరీక్షల సమయంలో వీరి పేర్లను చెప్పలేదని, కేవలం గుంపులో ఉన్నారనే ఆరోపణ తప్ప వారు నేరుగా నేరానికి పాల్పడినట్లు బలమైన ఆధారాలు లేవని వాదించారు.

ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలోనే గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కాగా, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబ సభ్యుల హత్య కేసులో 11 మందికి జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. 2022 ఆగస్టులో గుజరాత్ ప్రభుత్వం వీరికి ముందస్తు విడుదల (రెమిషన్) ఇవ్వగా, దానిని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2024 జనవరిలో సుప్రీంకోర్టు ఆ 11 మంది దోషుల ముందస్తు విడుదలను రద్దు చేసి తిరిగి జైలుకు పంపింది. తాజాగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ పొందిన ఈ ఇద్దరు కూడా ఆ 11 మంది దోషుల్లో ఉన్నారు.