Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

Hyderabad Biryani Price Hike: హైదరాబాద్‌ బిర్యానీ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

jagan 16 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
Hyderabad Biryani Price Hike: హైదరాబాద్‌ బిర్యానీ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..

Hyderabad Biryani Price Hike

Hyderabad Biryani Price Hike: భాగ్యనగరవాసులకు, ముఖ్యంగా భోజన ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘుమఘుమలాడే బిర్యానీ ధరలు అమాంతం పెరిగాయి. నగరంలోని దాదాపు అన్ని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లు ప్లేట్ బిర్యానీపై రూ.50 వరకు ధరను పెంచేశాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలతో సతమతమవుతున్న సామాన్యులకు ఈ పెంపు అదనపు భారంగా మారింది. వీకెండ్ వచ్చినా, చిన్నపాటి సెలబ్రేషన్ చేసుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 25,000 హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. ఉద్యోగాలు, చదువుల కోసం నగరంలో నివసించే బ్యాచిలర్లు, విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఎక్కువగా బయటి ఆహారంపైనే ఆధారపడుతుంటారు. తాజా ధరల పెంపుతో వీరి నెలవారీ బడ్జెట్‌పై రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనపు భారం పడుతుందని అంచనా. వ్యాపార వర్గాల లెక్కల ప్రకారం నగరవ్యాప్తంగా రోజుకు సుమారు 6 లక్షల బిర్యానీ ప్లేట్లు అమ్ముడవుతున్నాయి. ఈ లెక్కన సగటున ఒక్కో ప్లేట్‌పై రూ.30 పెరిగినా నగరవాసులపై రోజుకు రూ.1.8 కోట్లు, నెలకు ఏకంగా రూ.54 కోట్ల అదనపు భారం పడుతోంది. ఇక ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లలో ఆర్డర్ చేసేవారికి డెలివరీ, ప్యాకింగ్ ఛార్జీలు కూడా తోడై బిల్లు మరింత తడిసిమోపెడవుతోంది.

అయితే ఈ ధరల పెంపునకు బలమైన కారణాలు ఉన్నాయని హోటల్ యజమానులు వివరిస్తున్నారు. గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా ముడిసరుకుల ధరలు 15 శాతం నుంచి 20 శాతం వరకు పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని వారు స్పష్టం చేస్తున్నారు. బిర్యానీ తయారీలో కీలకమైన నాణ్యమైన నెయ్యి ధర హోల్‌సేల్ మార్కెట్‌లో కిలోకు రూ.580 నుంచి రూ.800 దాటింది. పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తుల ధరలు కూడా 20 శాతం వరకు పెరిగాయి.

వీటికి తోడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర గతంలో రూ.1,750 ఉండగా ఇప్పుడు రూ.3,080కి చేరింది. వంట నూనె లీటరు రూ.150కి ఎగబాకగా, నాణ్యమైన బియ్యం కిలో రూ.100కు చేరువైంది. చికెన్, కూరగాయల ధరలు సైతం అధికంగానే ఉంటుండటంతో పెరిగిన పెట్టుబడి వ్యయాన్ని తట్టుకోలేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ భారాన్ని వినియోగదారులపై మోపాల్సి వస్తోందని రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు.

నగరంలో హోటల్ వ్యాపార పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా మారిందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కంచర్ల అశోక్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హోటళ్లలో లాభాలు పోయి నష్టాలు వస్తున్నాయని ఆయన తెలిపారు. ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరగడంతో చేసేదేమీ లేక కొన్ని హోటళ్లు ధరలు పెంచేశాయని వివరించారు. ధరలు పెంచితే కస్టమర్లు దూరమవుతారనే బాధ ఉన్నప్పటికీ, పెంచకపోతే హోటళ్లను నడపలేని దుస్థితి దాపురించిందని ఆయన స్పష్టం చేశారు.